మేమూ మనుషులమే...

x
Highlights

హిజ్రా..ఈ పేరు వింటేనే చాలామందికి ఒకరకమైన ఫీలింగ్. ఈసడింపులు, వెటకారపు మాటలు అన్నిచోట్లా వాళ్ళకు ఎదురయ్యేవి ఇవే. ఆడా మగా కాదని కన్నవాళ్లే...

హిజ్రా..ఈ పేరు వింటేనే చాలామందికి ఒకరకమైన ఫీలింగ్. ఈసడింపులు, వెటకారపు మాటలు అన్నిచోట్లా వాళ్ళకు ఎదురయ్యేవి ఇవే. ఆడా మగా కాదని కన్నవాళ్లే కాదనుకుంటారు. తేడా అంటూ సమాజం దూరం పెడుతుంది. విద్య, ఉద్యోగం, ఉపాధి ఎక్కడా ఏ అవకాశం ఉండదు. మమ్మల్ని మనుషులుగా గుర్తించి సాయపడండి అని వేడుకున్నా అంతటా సహాయ నిరాకరణ. తామూ మనుషులమేనని మమ్మల్ని కూడా అందరిలానే గుర్తించి ప్రభుత్వం తమకు సహాయం అందించాలని హిజ్రాలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. గౌరవంగా బ్రతికే అవకాశం ఇవ్వమని వేడుకుంటున్న హిజ్రాలపై hmtv స్పెషల్ ఫోకస్.

ఆడిపాడి అడుక్కొనే హిజ్రాలను చూస్తే అందరికీ చిరాకు. బలవంతంగా డబ్బు వసూలు చేస్తారనే ఓ స్థిరమైన అభిప్రాయం. రాత్రిళ్లు చీకటి పనులు చేసేవారనే గుర్తింపు. అందరిలాగే పుట్టిన వీళ్ళ జీవన విధానంలో ఎందుకు తేడా? దీనికి కారణాలెన్నో ఉన్నా ముఖ్యమైన కారణం మాత్రం సమాజం కనీసం మనుషులన్న గుర్తింపు లేకుండా చిన్నచూపుకు గురవటం. తమ బిడ్డ హిజ్రా అంటే అవమానమని కన్నవారే దూరం పెట్టడం హిజ్రాల జీవనాన్ని మార్చేశాయి.

తెలంగాణలో అధికారికంగా 48 వేల మంది హిజ్రాలు వున్నారు. అనధికారికంగా ఈ సంఖ్య మరో నాలుగు రెట్లు ఉండొచ్చని అంచనా. అప్రకటిత సామాజిక బహిష్కరణకు గురైన హిజ్రాలు సమూహ జీవనం సాగిస్తుంటారు. చేద్దామంటే పని దొరక్క కడుపు నింపుకొనేందుకు వేరే మార్గం లేక అడుక్కొంటున్నారు. ఇక్కడా వీరికి పోటీ ఎదురవుతోంది. వీరిలాగా వేషం మార్చిన కొందరు బలవంతపు వసూళ్ళు చేస్తున్నారు.

మెడిసిన్, ఇంజినీరింగ్, లా, హోటల్ మేనేజ్‌మెంట్‌ వంటి పీజీలు చేసిన వాళ్ళెందరో హిజ్రాలలో ఉన్నారు. సర్టిఫికేట్లలో పురుషుడిగా ఉంటే ఇప్పుడు ట్రాన్స్‌జెండర్‌గా చెల్లని పరిస్థితి. కుటుంబ సభ్యుల వెలి కారణంగా ఇంట్లోనే సర్టిఫికేట్లు ఉండిపోయిన వారు కొందరు. విద్య, వైద్యం, ఉపాధి, వ్యాపారం అడుగడుగునా అంతులేని వివక్ష. ప్రతిచోటా చీత్కారాలు, వెకిలి మాటలతో వేధింపులు. అవమానించిన వారే తప్ప అవకాశం ఇచ్చినవారు లేరంటున్నారు హిజ్రాలు.

మనుషులు, జంతువులుకు సమాజంలో స్థానం వుంది కానీ తమకే స్థానం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు బ్రతుకుతున్నామో తెలీక మానసికంగా కుంగిపోతున్నవారు చాలా మంది వున్నారు. వాళ్ళు కొట్టే చప్పట్లలో తమను ఆదరించని సమాజం మీద కోపం, తిట్టే తిట్లలో తమను ఈసడించుకుంటున్నారన్న బాధ వుంది. చివరికి టాయిలెట్ విషయంలో కూడా వీరికి వివక్షే ఎదురవుతోంది. మహిళలు, పురుషులు ఇటు కాదు అటు వెళ్లమంటూ తరిమేస్తుంటే ఏం చేయాలని వాపోతున్నారు.

సుప్రీమ్‌కోర్ట్ మార్గదర్శకాలను పాటించటం లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమని గుర్తించటం లేదని చెప్తున్నారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హిజ్రాల సంక్షేమానికి బడ్జెట్‌లో 20 కోట్లు కేటాయించింది. ఒంటరి హిజ్రాలకు నెలనెలా 1500 పెన్షన్ అందిస్తోంది. వారికి ఇళ్ళు నిర్మిస్తామని ప్రకటించింది. తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాలు సైతం హిజ్రాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తమను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందన్న బాధలో వున్నారు హిజ్రాలు.

పుట్టుకతోనే ఎవరూ తప్పు చెయ్యరు. పెరిగిన వాతావరణం, చుట్టూ వున్న సమాజాన్ని బట్టే వారి ప్రవర్తన వుంటుంది. హిజ్రాలు ఇలా బతకడానికి కారణం కేవలం సమాజమే. పట్టింపు లేని పాలకుల తీరు, సామాజిక వివక్ష హిజ్రాలను దోషులుగా నిలబెడుతుంది. వారిలో సమాజంపై ద్వేషం పెంచుతోంది. కానీ ముస్తాబైన ఆ ముఖాల వెనుక ఓ మనసుంది. అది ఆదరణ కోరుకుంటుంది. విధి వంచితులమైన తమకు గౌరవంగా బతికే అవకాశం ఇవ్వాలంటోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories