Top
logo

అతివలు.. ఆభరణాలు

అతివలు.. ఆభరణాలు
X
Highlights

భూమి గుండ్రంగా ఉంటుంది అన్నట్టు ఫ్యాషన్ సైకిల్ నిరంతరం తిరుగుతూ ఉంటుంది. ఈ చక్రం వెనక్కు వెళ్లడాన్నే మనం...

భూమి గుండ్రంగా ఉంటుంది అన్నట్టు ఫ్యాషన్ సైకిల్ నిరంతరం తిరుగుతూ ఉంటుంది. ఈ చక్రం వెనక్కు వెళ్లడాన్నే మనం ట్రెండ్, ఫ్యాషన్, ఫ్యాంటసీ, స్టైల్, మోడ్రన్, కాంటెంపరరీ ఇలా వివిధ పేర్లతో పిలుస్తాం అన్నమాట. మానసిక ఆనందాన్ని, సంతృప్తిని, నాలుగు రాళ్లు వెనకేసుకున్నా మనే భరోసాను, ఇక మన తరువాతి తరానికి ఏదైనా వారసత్వంగా ఇవ్వచ్చనే ధీమాను కల్పించేది నగలు అనే అస్తులే. సామాజిక హోదాను చెప్పేవి, దర్పణాన్ని ప్రదర్శించేవిగా నాగరికతలో నగల స్థానం రూపాంతరం చెందింది.

ఇష్టంలోనూ.. నష్టంలోనూ....
నగ, నట్ర అని అంటారు.. సంపద చూపడానికే కాదు.. కష్టకాలంలో ఆదుకుంటాయని మొదలైన ఈ నగల గోల తరతరాలైనా మారలేదు. ఫ్యాషన్స్, ట్రెండ్స్, సంప్రదాయం, పండుగలువంటి ఎన్నో పేర్లతో మన జీవితంలో అన్ని దశల్లోనూ నగలు అంతర్భాగమైపోయాయి. అందుకే అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా నగలంటే అంత మోజు. అందుకే బాగా ఇష్టమైనవారికి వీటిని కొనిపెడతారు.. ఆర్థికంగా దివాళాతీసే నష్టాల్లో ఇవి కాపాడుతాయనే ముందు చూపే దీనికి కారణం.

డైమండ్స్ ఆర్ ఫరెవర్...
గిఫ్ట్ ఇవ్వాలన్నా, ఏదైనా సందర్భాన్ని జీవితకాలం పాటు పదిలంగా దాచుకోవాలన్నా ఆ అకేషన్‌ను ఎప్పటికీ గుర్తుండిపోయేలా వజ్రాలు, బంగారం కొనడం ఆనవాయితీ. ఈ కారణంగానే డైమండ్స్ ఆర్ ఫరెవర్ అనే నానుడి వచ్చింది. ఇక ఇవన్నీ కుదరనప్పుడు సరదా తీర్చుకోవాడానికి ఎప్పుడూ గిల్టు నగలు సిద్ధంగానే మార్కెట్‌లో ఉంటాయి.

ఫిల్మీ జువెలరీ..
జోధా అక్బర్, దేవదాస్, రామ్‌లీలా, బాహుబలి తాజాగా పద్మావతి వంటి పీరియాడికల్ సినిమాలంతా నగల మయం. ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడంతా ట్రెండ్ వీటిచుట్టూ తిరుగుతూ ఉంటుంది. కిలోల కొద్దీ బంగారం, వెండిని ముడిపదార్థంగా ఉపయోగిస్తూ ఈ నగలను అత్యద్భుతంగా తయారు చేశారు.

కాక్ టెయిల్, క్లాసిక్, ఫంకీ ....
ఇక నగల్లో వెరైటీలు చెప్పాలంటే చేంతాడంత అవుతుంది. ఫంకీగా ఉండే వెస్ట్రన్ మోడల్స్ మొదలు లైట్ వెయిట్ జువె లరీ, ఎథ్నిక్, ఫ్యుజన్, కాంటెంపరరీ, కాక్ టెయిల్, క్లాసిక్ ఇలా చాలా రకాలైన నగలు షరాఫా బజార్‌ను ఎప్పటికప్పుడు ముంచెత్తుతుంటాయి. ట్రెండ్‌కు తగ్గట్టు వీటి తయారీ, వినియోగం జరుగుతుంది.

ముడి పదార్థం...
నగలకు ప్రధాన ముడి పదార్థం మనకు తెలిసినట్టు బంగారమే. ఇక ఇదికాకుండా ప్లాటినమ్, వెండి, చెక్క, మట్టి, గ్లాస్, లక్క, బీడ్స్, వన్ గ్రామ్ గోల్డ్ ఇంకా వివిధ రకాల మెటల్స్‌తో వీటిని కళ్లు జిగేల్‌మనేలా తయారు చేస్తారు. ఇటీవలి కాలంలో జూట్, సిల్క్ త్రెడ్‌ను విస్తృతంగా జువెలరీ తయారీలో వినియోగిస్తున్నారు. ఇవి ఇప్పుడు ట్రెండింగ్‌గా మారాయి.

వర్క్ వేర్, పార్టీ వేర్, వెడ్డింగ్ వేర్...
ఇక రాళ్లవా, బంగారువా అనే నగలు మాత్రమే కాదండోయ్.. ఇతరత్రా జువెలరీ టైప్స్ కూడా బోలెడున్నాయి. ఉద్యోగుల కోసం వర్క్‌వేర్ జువెలరీ, పెళ్లిళ్లలో ధరించేందుకు వెడ్డిండ్ వేర్ జువెలరీ, పేజ్ త్రీ, బర్త్ డే వంటి పార్టీల కోసం సెపరేట్‌గా పార్టీ వేర్ జువెలరీ, బీచ్‌లకు తరచూ వెకేషన్స్ కోసం వెళ్లేవారి కోసం బీచ్ జువెలరీ (ఇందులో ఎక్కువగా బీడ్స్‌తో చేసినవి, శంకులు, నత్తల డొక్కలు, ఈకలతో చేసిన జువెలరీ) ఇక స్వయంగా పెళ్లికూతురైతే ఆమెకోసం బ్రైడల్ జువెలరీ, ఎంగేజ్‌మెంట్ కోసం నిశ్చితార్థం స్పెషల్ రింగులు, భార్య భర్తలకు కలిపి కపుల్ రింగులు (వీటిని బ్యాండ్స్ అంటారు.. ఎక్కువగా ప్లాటినమ్‌లో కొనడం ఫ్యాషన్), ఇలా ఎన్నో రకాల సందర్భానుసారం, మన ఆసక్తి, శక్తి కొద్దీ కొనేందుకు మార్కెట్లో వివిధ రకాల ఆభరణాలు అందుబాటులో ఉన్నాయి.

హ్యాండ్ క్రాఫ్టెడ్ ట్రెండ్..
ఆమధ్య మెషీన్ మేడ్ నగలంటే చాలా తక్కువ మేకింగ్ ఛార్జెస్ వసూలు చేసేవారు. కానీ మళ్లీ హ్యాండ్‌క్రాఫ్టెడ్ స్టైల్‌గా మారడంతో చాలా నగలను డిజైనర్లు స్వయంగా చేత్తో తయారు చేస్తున్నారు. దీంతో నగల్లోని బంగారం ధర కంటే వీటి మేకింగ్ ఛార్జెస్ ఎక్కువగా ఉండే జువెలరీ పీసుల సంఖ్య ఎక్కువగా అందుబాటులోకి వస్తోంది. బిద్రీ వర్క్ చేసిన సిల్వర్ జువెలరీ, మీనాకారీ వర్క్ (మీనా వర్క్) చేసిన వెండి నగలు, ఇండియన్, ఫ్యూజన్ జువెలరీల్లో ఇప్పుడు చేత్తో చేసిన నగలకు మంచి డిమాండ్ ఉంది. హిందీ సీరియళ్ల పుణ్యమా అని ఇటీవలి కాలంలో అన్ని రకాల నగలకు విపరీతంగా గిరాకీ పుట్టుకొచ్చింది. చేతి నిండా, మెడ నిండా.. మొత్తం ఒంటి నిండా నగలు వేసుకుని ఎదుటివారిని ఆకట్టుకోవడంపై చాలామంది ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. మహారాణా ప్రతాప్, హర్ హర్ మహాదేవ్, బాలికా వధు వంటి టెలీ సోప్స్ ప్రభావంతో బుల్లితెరపై నటీనటులు వేసుకున్న నగల కోసం తహతహలాడేవారు చాలామంది బంగారు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. టెంపుల్ జువెలరీలో ఎక్కువ భాగం చేత్తో తయారు చేసేదే ఉంటుంది. అందుకే వీటిలో మేకింగ్, వేస్టేజ్ ఛార్జెస్ ఎక్కువగా వసూలు చేస్తారు.

పెరుగుతున్న బంగారం దిగుమతులు..
నగలు మన సంస్కృతిలో భాగమవ్వడంతో పాటు పెట్టుబడి పెట్టేందుకు సులువైన మార్గం కావడంతో బంగారం దిగుమతులు ప్రతి ఏటా పెరుగుతూనే ఉన్నాయి. బులియన్ మార్కెట్లో వెండి, బంగారం ధరల సూచిని నిత్యం చూడటం మనవారు రొటీన్‌గా పెట్టుకున్నారంటే నగలతో పెనవేసుకున్న అనుబంధం ఎంత బలమైనదో అర్థమవుతుంది. ఇక మన దేశంలో బంగారం వ్యాపారుల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. దేశ, విదేశీబ్రాండ్లు మనదేశంలో బంగారం రిటైల్, హోల్‌సేల్ స్టోర్లు తెరిచి తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు, ఆరు కాయలుగా మార్చుకుంటున్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే ఇటీవలి కాలంలో బంగారం వ్యాపారుల సంఖ్య లెక్కకు మించి పెరిగిపోయింది. ఇక అక్షయ తృతీయ, దీపావళి, దసరా, ఉగాది, ధనత్రయోదశి వంటి రోజుల్లో కనీసం ఒక్క మిల్లీ గ్రామైనా కొనాలనే సెంటిమెంట్ జనాలకు బలపడిన కారణంగా బంగారు మార్కెట్లు ఏడాది పొడవునా కళకళలాడుతున్నాయి.

పాత ఎప్పుడూ కొత్తే..
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు.. పాత ఎప్పుడూ కొత్తదే. అందుకే ఇటీవలి కాలంలో ఒంటి నిండా నగలతో తళుక్కుమనడం స్టైల్‌గా మారింది. ఇక పండుగలు, పార్టీలు, ముఖ్యంగా పెళ్లిళ్ల కోసం చాలామంది కాచుకుని ఉంటారు. తమవద్ద ఉన్న నగలను దిగేసుకుని ఫోటోలు, వీడియోల్లో సందడి చేసేందుకు ఇలాంటి వేదికలు, వేడుకలే ప్రధాన అవకాశం మరి. అందుకే పాత స్టైల్స్ అన్నీ మళ్లీ అందరినీ ఊరిస్తున్నాయి. ఉదాహరణకు కాళ్లకు పట్టీలు, కడియాలు (బ్రాస్‌లెట్స్ అంటారు) వేసుకోవడం, చేతులకు వంకీలు, తలకు పాపిడి బిళ్ల, చెంప సరాలు, చెవుల నిండుగా పెద్ద పెద్ద డిజైన్ ఉన్న బోలెడు స్టడ్స్ సెట్ పెట్టుకోవడం, బ్రూచ్‌లు, జడకు అడుగడుగునా నాగరబిళ్ల వంటివి బోలెడన్ని వెరైటీలతో కూడిన సెట్లు పెట్టుకోవడం, జూకాలు, మాటీలు, సైడు పిన్నులు, చేతులకు ఉంగరాలు, భారీగా ఉన్న కడియాలు, చేతి గడియారాలు, డజన్లకొద్దీ గాజులు, నవరత్నాలు పొదిగిన ఏడు వారాల నగలు ఇలా పాత నగలన్నీ ఇప్పుడు స్టేటస్ సింబల్‌గా మనందరికీ మారిపోయాయి. బ్యాక్ జువెలరీ (వీపు మీద వేసుకునే నగలు) ఇప్పుడు తాజా సెన్సేషన్‌గా తెరపైకి వచ్చింది.

జువెలరీ ఫ్యాషన్ షోలు ..
కేవలం వస్త్రాలకే ఒకప్పుడు ఫ్యాషన్ షోలు జరిగేవి. కానీ ఇప్పుడు జువెలరీ ఫ్యాషన్ షోల సంఖ్య కూడా బాగా పెరిగింది, ముంబై, బెంగళూరు, లక్నో, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై లాంటి ప్రాంతాల్లో ఏడాదికి కనీసం మూడు సార్లయినా జువెలరీ ఫ్యాషన్ షోలు జరుగుతాయి. ఇందులో అన్ని వయసుల వారికి, అన్ని సందర్భాలకు తగ్గట్టుగా సూటబుల్ జువెలరీలను తయారు చేసి ప్రదర్శిస్తారు. అందుకే జువెలరీ ఎక్స్ పోకు క్యూ కడుతున్నారు.

కస్టమ్ మేడ్ జువెలరీ...
జువెలరీ డిజైనర్ల మధ్య, జువెలరీ బ్రాండ్ల మధ్య ఏర్పడిన తీవ్రపోటీ నేపథ్యంలో ఎక్స్‌క్లూజివ్ జువెలరీ అనే కేటగరీ కొత్తగా వచ్చి చేరింది. మధ్యతరగతి వారు కూడా ఈ ఎక్స్‌క్లూజివ్ డిజైన్లపై అమితాసక్తి ప్రదర్శిస్తుండడం విశేషం. అంతే తమకు కావాల్సిన డిజైన్లను, నచ్చిన సైజులో, వెయిట్‌లో ప్రత్యేకంగా తయారుచేయించుకోవడం క్రేజీగా మారింది. ఇందుకు జువెలరీ డిజైనర్లను నగల షాపుల్లో అందుబాటులో ఉంచడంతో కస్టమర్లు కస్టమ్ మేడ్ జువెలరీపై మక్కువ ప్రదర్శిస్తున్నారు. ‘నేను కస్టమ్ మేడ్ నగలనే వాడతా, నా దగ్గర అంతా ఎక్స్‌క్లూజివ్ జువెలరీ కలెక్షన్ ఉంది, నాకవే నచ్చుతాయి, నప్పుతాయి’ అనే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అంటే మనం టైలర్ దగ్గర కుట్టించుకోకుండా ఓ బొటీక్‌కు వెళ్లి మన శరీరాకృతికి, సందర్భానికి నప్పేలా డిజైన ్లను చేయించుకున్నట్టే .. అచ్చంగా అలాగే నగలనుకూడా తయారు చేయించుకోవడం న యా ఫ్యాంటసీ. ఈ డిజైనర్ జువెలరీ చలువతో వ్యాపారం లాభసాటిగా జోరుగా సాగుతోంది.

కరణం భార్గవి

Next Story