తింటే 50... తినకపోయినా 50

x
Highlights

హోటళ్లు ఇప్పుడు వ్యాపార కేంద్రాలు. నచ్చింది తినడం నచ్చకుంటే పడేయడం. హోటల్‌కి వెళ్తే ఏం తిన్నావని అడిగారు ఎందుకు పడేస్తున్నావని ప్రశ్నించరు. కానీ ఈ...

హోటళ్లు ఇప్పుడు వ్యాపార కేంద్రాలు. నచ్చింది తినడం నచ్చకుంటే పడేయడం. హోటల్‌కి వెళ్తే ఏం తిన్నావని అడిగారు ఎందుకు పడేస్తున్నావని ప్రశ్నించరు. కానీ ఈ హోటల్‌లో అలా కాదు. ఎంత తినాలనిపిస్తే అంతే తినాలి. అలా కాదు మేము తినేది తింటాం వీలుకాకుంటే పడేస్తామంటే కుదరదు. తినాల్సిందేనని ఒత్తిడి తెస్తారు. అప్పటికీ వినకుంటే ఫైన్‌ కట్టించుకుంటారు. డిఫరెంట్‌గా అనిపిస్తుంది కదా. అయితే ఈ డిటైల్డ్‌ స్టోరీ చూడండి.

ఇదే ఆ హోటల్‌. వరంగల్‌ జిల్లా కేంద్రంలో మూడు దశాబ్దాల క్రితం చిన్నగా ప్రారంభమైన ఈ హోటల్‌ జిల్లా వాసులకు సుపరిచితం. ఇక్కడ లభిస్తున్న భోజనమే కాదు ఆ హోటల్‌లోని పరిసరాలు కూడా అందరికీ ఆహ్లాదం.

లింగాల కేదారి ఫుడ్‌ కోర్టు‌గా ప్రారంభమైన హోటల్‌ ప్రస్థానం ఇప్పుడు సంచలనాలకు, సామాజిక మార్పులకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయింది. వ్యాపారమంటే పైస ప్రయోజనాలే కాదు ప్రజాప్రయోజనంగా ఉండాలన్నది హోటల్‌ నిర్వాహకుల అభిప్రాయం. అందుకే సామాజిక బాధ్యతగా నడుపుతున్నామని చెబుతున్నారు.

ఎందుకంటె ఒక్కరు ప్రతిరోజు వృథా చేసే గుప్పెడు అన్నం ఏడాదిలో ఒక బియ్యం బస్తాతో సమానమంటారు. రైతు చెమటోడ్చి పండిస్తే ఆ అన్నం విలువ అందరికీ తెలియాలనే తాపత్రయం తమదని చెబుతారు. కడుపు నిండా తినాలి లేదా ఆ భోజనం వేరే వాళ్ల కడుపు నింపేలా ఉండాలన్నదే లింగాల కేదారి ఫుడ్‌కోర్టు షరతు అంటారు లింగాల దంపతులు.

మూడు దశాబ్దాల క్రితం బజ్జీల వ్యాపారంతో ప్రారంభమైంది లింగాల కేదారి హోటల్‌ ప్రస్థానం. ఒక ఫుడ్‌కోర్ట్ యజమానిగా తమ దైన శైలిలో నడుపుతూ అందరి మన్ననలను అందుకుంటున్నాడు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి తెలిసిన వారు చనిపోతే నిర్వహించే అన్నదానం, నిరుపేదలకు ఉచిత భోజనం వరకూ ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

వరంగల్‌ జిల్లా కేంద్రంలోని ఓ చిన్న ఏరియాలో కనిపిస్తున్న లింగాల కేదారి ఫుడ్‌కోర్ట్ సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్. సామాజిక మార్పును కాంక్షిస్తూ అందరికి భోజనాన్ని అందిస్తుంది ఈ ఫుడ్‌కోర్ట్. మూడు దశాబ్దాల క్రితం హోటల్‌ రంగంలో అడుగుపెట్టిన లింగాల కేదారి, పుష్పలత దంపతులు నేటికీ అక్కడి వంటశాలలో బిజీగా ఉంటారు. తమను ఆదరించే వారికి ఇంట్లో భోజనం ఎలా వుంటుందో అలాంటి భోజనం అందించటానికి వారే స్వయంగా వండుతారు. వడ్డిస్తారు.

అంతేకాదు ప్రతి రోజు కస్టమర్లకు ఇచ్చే ఆహారాన్నే వారు కూడా తింటారు. 50 రూపాయలకే మాంసాహార భోజనాన్నీ అందిస్తారు. కానీ ఫుడ్‌కోర్టులో భోజనం చేయాలంటే కొన్ని షరతులు వర్తిసాయని చెబుతున్నారు. భోజనం వృధా చేస్తే మాత్రం నిక్కచ్చిగా ఫైన్ వేస్తారు ఫైన్ వసూలు చేసే దాకా వదలిపెట్టే ప్రసక్తే లేదు. అన్నం కానీ కూర గానీ ఏది వృధా చేసినా ఊరుకోరు. ఒకవేళ ఎవరైనా వృథా చేస్తే ఎంత పెద్ద గొడవ జరిగినా సరే ఫైన్ వసూలు చేసే దాక ఊరుకోరు భోజనం బాగోకపోతే చెప్పండి మేమే ఫైన్ కడతాము అని చెప్తారు ఈ దంపతులు.

ఈ మాటలన్నీ నోటితో అనడమే కాదు... భోజనం బాగున్నా వదిలేస్తే ఊరుకోమని ఫైన్ వేస్తామని ఏకంగా బోర్డు కూడా పెట్టేశారు. ఇప్పటి వరకు 300 మందికి పైగా ఫైన్లు వేశామంటున్న లింగాల దంపతులు పోలీసులు, న్యాయవాదుల నుంచి జరిమానా వసూలు చేశామని గర్వంగా చెబుతున్నారు. ఆ డబ్బును నిరుపేదలకు ఉపయోగిస్తామని, ఆకలి విలువ తెలుసు కాబట్టే ఎవరైనా వృధా చేస్తే బాధగా ఉంటుందంటారు.

ఒక తల్లికి పుట్టిన వాళ్లే ఒకరకంగా ఉండరు. అలాంటిది సమాజంలో జనాలెందుకు ఒకలా ఉంటారు? హోటల్‌కు వచ్చే వాళ్లు కూడా అంతే కదా!!. ఒక్కో కస్టమర్‌ ఒక్కోలా ఉంటారు. ఆహారం ఎందుకు వృధా చేస్తున్నారని అడిగితే గొడవకు దిగుతారు. మరికొందరు నిజమే కదా అని ఆలోచించి తప్పేనని ఒప్పుకుంటారు. ఎలా అయినా ఫైన్‌ కడితేనే కానీ హోటల్‌ నుంచి వెళ్లనివ్వరు లింగాల దంపతులు.

లింగాల కేదారి ఫుడ్‌కోర్టులో చిన్న చిన్న గొడవలు మాములే. ఎందుకంటే భోజనం పడేయడం కామన్‌. ఎందుకు పడేశావంటేనే గొడవలు మొదలయ్యేవి. మాకెందుకులే మన డబ్బులు మనకొస్తుంటే పంచాయతీలతో పని లేదని సర్దిచెప్పుకోరు. అలాంటి గొడవలకు భయపడరు లింగాల దంపతులు. అలా గొడవకు వచ్చిన వాళ్లు ఏమైనా న్యూసెన్స్‌ చేస్తే కస్టమర్లంతా ఏకమవుతారు. హోటల్‌ యజమానికే మద్దతు పలుకుతారు. భోజనం వృథా చేయటం తప్పని, వంట బాగోకుంటే మేమంతా ఎలా తింటున్నామని నిలదీస్తారు.

మొదట్లో వృధా చేసిన వారు తమ తీరు మార్చుకున్నారని చెబుతారు కస్టమర్లు. ఇప్పుడు భోజనం అవసరమైనంతే పెట్టించుకుని తింటున్నామని అంటున్నారు. ఒక మంచి ఉద్దేశంతో నడుస్తున్న ఫుడ్‌కోర్ట్ అని లింగాల దంపతులకు కితాబిస్తుంటారు.

గతంలో ఒక టిఫిన్‌కి ఇంకో టిఫిన్ ఫ్రీ ఒక మీల్స్‌కి ఇంకో మీల్స్ ఫ్రీ ఒక టీ తాగితే ఇంకో టీ ఫ్రీ అంటూ ఆఫర్ ఇచ్చి బయట హోటల్స్ కంటే సగం ధరలకే నాణ్యమైన భోజనాన్ని పేదలకు అందించిందీ ఫుడ్‌కోర్టు. తెలంగాణా ఉద్యమ సమయంలో రోజు 10 వేల రూపాయల ఖర్చుతో ఉద్యమంలో పాల్గొన్న వారికి ఉచిత భోజనం అందించారు. నిరుపేదలకు , గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారికి, భోజనానికి సరిపడా డబ్బు లేని వారికి భోజనం వడ్డించి ఔదార్యం చూపించారు. మొత్తానికి ఇలా భోజన వృథాను నియంత్రించటానికి వీరు చేస్తున్న ప్రయత్నం అందరి మన్ననలను పొందుతుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories