జనామోదం పొందే ధీరులెవరు?

జనామోదం పొందే ధీరులెవరు?
x
Highlights

ఎన్నికల వేడి రాజుకుంది. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్.. రెండు రాష్ట్రాల్లోనూ నాయకులు శరవేగంగా జనంలోకి వెళ్లిపోతున్నారు. ఇందుకోసం ఒక్కొక్కరు ఒక్కోరకంగా...

ఎన్నికల వేడి రాజుకుంది. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్.. రెండు రాష్ట్రాల్లోనూ నాయకులు శరవేగంగా జనంలోకి వెళ్లిపోతున్నారు. ఇందుకోసం ఒక్కొక్కరు ఒక్కోరకంగా కార్యక్రమాలు రూపొందించుకుంటున్నారు. అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్, టీడీపీ ఎటూ వివిధ అభివృద్ధి కార్యక్రమాల పేరుతో నిత్యం జనంలో ఉండే ప్రయత్నం చేస్తుంటే ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ, వైఎస్‌ఆర్‌సీపీ లాంటి పార్టీలు కూడా రకరకాల నిరసనలు, ఆందోళనలతో జనం మధ్యనే ఉంటున్నాయి. ఓట్లు, సీట్లు సాధించడం మాట ఎలా ఉన్నా జనం ఫాలోయింగ్ మాత్రం బాగుండే సీపీఐ, సీపీఎంలు కూడా తమవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అందులోభాగంగానే సీపీఐ జాతీయ నేత నారాయణ మొన్న జీఎస్టీ సమావేశం హైదరాబాద్‌లో జరిగినప్పుడు అక్కడ నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు ఆయనను కిందకు తోసేయడంతో అంతటి పెద్దమనిషి నేలమీద పడిపోయారు.

సహజంగానే ఇది అందరి దృష్టికీ వెళ్లింది. తెలంగాణలో మంత్రులు, ముఖ్యమంత్రి, ఎంపీలు కూడా నిరంతరం ఏదో ఒక పేరుతో వార్తల్లో నానుతూనే ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమాల మీద సమీక్షలు, కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, వీటన్నింటికి తోడు ప్రతిపక్షాలు చేసిన విమర్శలకు సమాధానాల పేరుతో ప్రజలు ఎప్పుడూ తమను గుర్తుపెట్టుకునేలా చూసుకుంటున్నారు. దానికితోడు ఈ మధ్య వరుసపెట్టి తెలంగాణ ప్రభుత్వ పథకాలకు, మంత్రులకు అవార్డులు కూడా వస్తున్నాయి. కేసీఆర్ కిట్ల పథకం లాంటివి ఇందుకు ఉదాహరణలు. ఆ పేరుతోనూ జనం చెంతకు వెళ్తున్నారు. కాంగ్రెస్ నేతలు పార్టీపరమైన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ప్రభుత్వ పథకాల్లోని లోటు పాట్లను ప్రస్తావిస్తూ విమర్శల ఘాటు పెంచారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క లాంటి నేతలు తరచు వివిధ అంశాలపై స్పందిస్తున్నారు. ఆ పార్టీలో అంతర్గత కలహాల గురించి అయితే చెప్పనక్కర్లేదు.

ఇటీవల నిర్వహించిన పార్టీ శిక్షణ కార్యక్రమాల్లో సైతం కోమటిరెడ్డి బ్రదర్స్ కాస్త హల్‌చల్ చేశారు. దాంతో ఆ కార్యక్రమం రసాభాసగా ముగిసింది. మరోవైపు బీజేపీ సైతం కత్తులు నూరుతోంది. తెలంగాణలో కొంత మంది మంత్రులు కూడా తమతో టచ్‌లో ఉన్నారని చెబుతున్న కమలనాథులు.. మరో వారం రోజుల్లో జరగనున్న తెలంగాణ విమోచన దినం కోసం భారీ ఎత్తునే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత దీన్ని అధికారికంగా నిర్వహిస్తానని ఉద్యమ సమయంలో చెప్పిన కేసీఆర్ .. ఇప్పుడు దాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని, మజ్లిస్ పార్టీతో ఈ విషయంలో చేతులు కలిపారా అని కూడా నిలదీస్తు న్నారు. పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా సూచనలు, సలహాలతో దూకుడు పెంచుతూ ఇతర పార్టీల నేతలను కూడా తమ పార్టీలోకి ఆకర్షిస్తున్నారు. అయితే, రాష్ట్రమంతటా ప్రభావం చూపించగల నాయకులు లేకపోవడం తెలంగాణలో బీజేపీకి పెద్ద లోపం. చాలామంది నాయకులు కేవలం హైదరాబాద్ వరకే పరిమితం కావడంతో రాష్ట్రం మొత్తమ్మీద విస్తరించే ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు.

ఈ లోటును భర్తీ చేసుకోగలిగితే రాబోయే రోజుల్లో తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయంగా బీజేపీని ప్రజలు గుర్తించే అవకాశం ఉంటుంది. ఇక ఏపీలో ఎన్నికల పండగ కాస్తంత ముందు గానే మొదలయ్యింది. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అన్ని పార్టీలు శక్తియుక్తులు ఒడ్డుతున్నాయి. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో చేదు అనుభవాలు ఎదురు కావడంతో ప్రజల్లోకి ముందు నుంచి మరింత గా వెళ్లాలన్న వ్యూహంతో ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సీపీ కొత్త కార్యక్రమా లకు శ్రీకారం చుట్టింది. ప్రతిసారీ ’నాన్న గారు నాకు ఇంత పెద్ద కుటుంబం ఇచ్చారు అని చెప్పే వైఎస్ జగన్.. దానికి తగ్గట్లే వైఎస్‌ఆర్ కుటుంబం అనే పేరుతో ఓ కార్యక్రమం మొదలుపెట్టారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి రోజునే వైఎస్‌ఆర్ జిల్లాపులివెందులలో ఈ కార్యక్ర మానికి శ్రీకారం చుట్టినా, సెప్టెంబర్ 11 నుంచి మరింత ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బూత్ కమిటీ సభ్యులు రాష్ట్రంలో ప్రతి ఇంటికీ వెళ్లి అక్కడ 20 నిమిషాల పాటు ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడాలని చెప్పారు.

ఆ ఇంటి నుంచి కనీసం ఒకరిని పార్టీ సభ్యులుగా చేర్చాలని, తద్వారా వైఎస్‌ఆర్ కుటుంబం మరింత విస్తరించాలని దిశానిర్దే శం చేశారు. 91210 91210 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే తన కార్యాలయం నుంచే ఫోన్ కాల్ వస్తుందని జగన్ చెప్పారు. ఏ సమస్య ఉన్నా చెప్పుకోవచ్చన్నా రు. అధికారంలోకి రాగానే వాటిని నెర‌వేరుస్తామ‌న్నారు. ఏపీలో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకోడానికి జగన్ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజాదరణ వరకు బాగానే కనిపిస్తున్నా, ఓట్ల రూపంలోకి వచ్చేసరికి మాత్రం అధికార పార్టీకి ఉండే అన్నిరకాల సానుకూలతలు ఈ పార్టీని దెబ్బతీ స్తున్నాయి. మొన్నటికి మొన్న జరిగిన నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో చివరి ఒకటి రెండు రోజుల్లోనే మొత్తం పరిస్థితి మారిపోయి తిరగబడిందని పరిశీలకులు చెబుతున్నారు.

అప్పటి వరకు ఫ్యాన్ పార్టీ మంచి జోరు మీద ఉన్నట్లు కనిపించినా, చివరి రెండు రోజుల్లో మాత్రం టీడీపీ తనఎన్నికల వ్యూహాలు రచించడం, అమలు చేయడంతో అంచనాలు తిరగబడ్డాయని అంటున్నారు. అయితే ఉప ఎన్నికలు, స్థానిక సంస్థలకు.. అసెంబ్లీ ఎన్నికలకు చాలా తేడా ఉంటుందని, రాబోయే ఎన్నికల్లో పరిస్థితులు ఎటు తిరిగి ఎటు మారుతాయో చెప్పలేమని విశ్లేషిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా,కాపులను బీసీల జాబితాలో చేర్చి రిజర్వేషన్లుకల్పించడం, ఇంటింటికీ ఉద్యోగం.. అది ఇవ్వేలేకపోతే ఇంటికి నెలకు రూ. 2వేల చొప్పున నిరుద్యోగ భృతి, బెల్టు షాపుల నియంత్రణ.. ఇలా ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు చాలావరకు నెరవేరలేదు.దాదాపు 600 వరకు హామీలు ఇచ్చినా, వాటిలో కేవలం 12 మాత్రమే అమలయ్యాయి. వీటన్నింటినీ వైఎస్‌ఆర్ సీపీ అందిపుచ్చుకుంటోంది. హామీల అమలు, ఇతర సమస్యలు ఏమున్నా చెప్పుకోవచ్చంటూ ప్రత్యేకంగా అందుకోసం పార్టీ కేంద్ర కార్యాలయంలో భారీ ఏర్పాట్లే చేశారు. ఇవన్నీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిషోర్ సూచనలతో చేసినవేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జనంలోకి వెళ్లడానికి పాదయాత్ర ముహుర్తాన్ని కూడా జగన్ సిద్ధం చేసుకున్న విషయం తెలిసిందే. వైఎస్‌ఆర్ హయాంలో మొదలైన పాదయాత్ర సెంటి మెంటు తనకు కూడా కలిసొస్తుందని జగన్ భావిస్తున్నారు.

గత ఎన్నికలకు ముందు చంద్రబాబు కూడా ఇలాగే పాదయాత్ర చేసి విజయం సాధించారని ఆయన అంటున్నారు. మరి ఈసారి ఈ సెంటిమెంటు ఫలించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకు పట్టం కడతారో లేదో చూడాలి. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికతో పాటు కాకినాడ కార్పొరేషన్‌లో సాధించిన భారీ విజయాలతో మంచి ఊపు మీదున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు.. ఇదే పనిగా తమ పార్టీ శ్రేణులను జనం వద్దకు పంపుతున్నారు. ’ఇంటింటికీ తెలుగుదేశం పేరుతో ప్రజలందరినీ పలకరించాలని తమ శ్రేణులకు సూచించారు. ఇంటి గోడ మీద పార్టీ స్టిక్కర్ అతికించాలని, ఇంటిపై టీడీపీ జెండా ఎగరేయాలని చెప్పారు. వచ్చే ఏడాది ఎన్నికల ఏడాది అని ప్రతి ఒక్కరూ గ్రహించాలని గుర్తుచేశారు. అను కున్న లక్ష్యాలన్నీ ఏడాదిలోపు పూర్తి చేయాలన్నారు. జన్మభూమి కమిటీ సభ్యుల నుంచి మంత్రుల వరకు పనితీరును విశ్లేషించనున్నట్టు చెప్పారు. సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 30 వరకు.. అంటే 50 రోజుల పాటు ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమం చేపట్టి విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారానే ప్రభుత్వం ప్రజలకు ఏం చేసింది, ఇంకా ఏం చేయబోతుందనే విషయాలను పూర్తిస్థాయిలోకి తీసుకెళ్లాలని సూచించారు. లేదంటే ప్రతిపక్షాలు చేసిన వ్యాఖ్యలు ప్రజలు నిజమని నమ్మే ప్రమాదం ఉందని నాయకులను హెచ్చరించారు. ఎన్నికల మేనేజ్‌మెంట్‌లో అందెవేసిన చేయి ఉన్న చంద్రబాబుకు క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతోందో తెలియంది కాదు. తమ ప్రభుత్వం మీద చాలా తక్కువ కాలంలోనే తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని కూడా ఆయనకు తెలుసు.

ముద్రగడ పద్మనాభం పుణ్యమాని కాపు రిజర్వేషన్ల విషయంలో తమ వైఫల్యం దేనికి దారితీస్తుందోనన్న భయం ఆయనకు ఉండనే ఉంది. అందుకే ఆ వర్గానికే చెందిన సినీనటుడు, కొత్త నాయకుడు అయిన పవన్ కల్యాణ్‌ను జాగ్రత్తగా చేరదీస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తానో చెప్పలేనని అంటున్న పవన్.. తప్పనిసరిగా ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకోవాలి. ఒకసారి ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ, బీజేపీలు నమ్మకద్రోహం చేశాయంటూ విరుచుకుపడే పవన్... కొన్నాళ్ల తర్వాత కాపు రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం అనుస‌రిస్తున్న‌ విధానమే అత్యుత్తమం అంటూ కితాబిస్తారు. దాంతో ఆయన స్టాండ్ ఏంటనేది ఇంకా ఎవరికీ అర్థం కావడంలేదు. దాంతో ఆయన ఎవరితో చేతులు కలుపుతారోనన్నది అనుమానంగానే ఉంది. అయితే.. ఇప్పటికే ఒకసారి ప్రజారాజ్యం పార్టీ విషయంలో చేతులు కాల్చుకున్న కాపులు, ఇప్పుడు కొత్తదుకాణం తో వస్తున్న పవన్‌ను ఎంతవరకు నమ్ముతారనేది కూడా అనుమానంగానే కనిపిస్తోంది. ఈ లోపల ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేసుకుంటూ ఎన్నికల వేడిని మాత్రం రాజేస్తున్నారు.

చంద్ర‌శేఖ‌ర శ‌ర్మ‌

Show Full Article
Print Article
Next Story
More Stories