పాముల కల్యాణవైభోగమే.. వేదమంత్రాలసాక్షిగా ఒక్కటైన జంట..!

పాముల కల్యాణవైభోగమే.. వేదమంత్రాలసాక్షిగా ఒక్కటైన జంట..!
x
Highlights

వేదమంత్రోచ్ఛారణల నడుమ.. వారిద్దరూ ఒకటయ్యారు.. ఆకాశమంత పందిరి, భూదేవి అంత పీట లేకపోయినా.. బంధుమిత్రుల సమక్షంలో అత్యంత శాస్త్రోక్తంగా వారి పెళ్లి...

వేదమంత్రోచ్ఛారణల నడుమ.. వారిద్దరూ ఒకటయ్యారు.. ఆకాశమంత పందిరి, భూదేవి అంత పీట లేకపోయినా.. బంధుమిత్రుల సమక్షంలో అత్యంత శాస్త్రోక్తంగా వారి పెళ్లి జరిగింది. పెళ్లికి పెద్దసంఖ్యలో తరలి వచ్చిన బంధుమిత్రులు వారిని దీవించారు. విశ్వ మానవ కల్యాణం కోసం, ప్రపంచ శాంతి కోసం వారిద్దరూ ఏకమయ్యారు..

ఎక్కడైనా మనుషులకు పెళ్లవుతుంది.. కానీ ఇక్కడ మాత్రం పాములకు పెళ్లయ్యింది.. వరుడు జెర్రిగొడ్డు.. వధువు నాగుపాము.. ఈ రెండు పాములకు పచ్చని పందిట్లో పెళ్లి జరిపించడమే కాదు.. చక్కగా విందు భోజనం కూడా చేశారు.. తరాలు మారినా.. ఇంకా అవే మూఢ సంప్రదాయాలు కొనసాగుతున్నాయనడానికి ఇదో నిదర్శనం..
పెళ్లంటే మూడు ముళ్లు.. ఏడడుగులు... కట్న కానుకలు.. వైభవంగా పెళ్లి జరపడం.. ఇది మనుషులకే అనుకుంటే పొరపాటు.. విశ్వ మానవ సంక్షేమం కోసం ఈమధ్య చాలా చోట్ల జంతువులకూ పెళ్లిళ్లు చేయడం చూస్తుంటాం.. వర్షాలు పడాలని కప్పల కల్యాణం చేస్తుంటారు... అవి చేస్తే.. కరువు తొలగి వర్షాలు పడతాయని నమ్ముతారు. . నిజంగా వర్షాలు పడకపోయినా.. పట్టించుకోరు కానీ ముందు శాస్త్రం మాత్రం పాటిస్తారు..

వివిధ సమస్యల పరిష్కారానికి ఇలా జంతువులకు పెళ్లిళ్లతో ముడిపెట్టడం మనకు అలవాటే.. సరిగ్గా విజయ నగరంలో కూడా ఇలాంటి సంప్రదాయమే కొనసాగింది. నాగసర్ప దోషం పోవాలనీ, లోక కల్యాణార్ధం విజయ నగరం జిల్లా పార్వతీ పురం దుర్గ గుడిలో ఈ కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.జెర్రిగొడ్డు, నాగుపాములకు శాస్త్రోక్తంగా పెళ్లి చేసి ముచ్చట తీర్చుకున్నారు నిర్వాహకుడు వెంకట రమణ. పాములకు పెళ్లి అనడంతో పార్వతీ పురం స్థానికులు కూడా బాగానే తరలి వచ్చారు.. ఔత్సాహిక జంటలు ఈ సందర్భంగా పూజలు కూడా చేయించుకున్నారు. ఇక పీటలపై కూర్చున్న పెళ్లి కొడుక్కి కన్యాదానం ముందు కాళ్లు కడుగుతారు కదా.. ఇక్కడ కూడా కాళ్లు కడిగారు.. ఆ తంతు ఓ సారి చూడండి..

రాహువు, కేతువు మకర రాశిలోకి ప్రవేశించిన రోజుల్లో విశ్వం కాలసర్ప దోషంలోకి వెళ్లి పోతుందని ఫలితంగా అనేక ఉపద్రవాలు జరుగుతాయని చెబుతున్నారు అక్కడి పూజారి.. ఇక తమ కుటుంబానికున్న సర్పదోష పరిహారం కోసమే ఈ పెళ్లి జరిపించానంటున్నారు విశాఖ పట్నం కందనపల్లికి చెందిన వెంకట రమణ. నాగకల్యాణం చూసిన ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తారని ముందు తరం కానీ తర్వాతి తరం వారికి కానీ నాగదోషం అనేది ఉండదనీ అంటున్నారు పూజారి కాళిదాస్ శర్మ.. వంశాభివృద్ధి, కల్యాణం, సంతాన ప్రాప్తి కలుగుతుందని .. ఇది రుగ్వేదంలో కూడా ఉందనీ చెబుతున్నారు.. కాళిదాస్ శర్మ, పురోహితుడు వివాహ తంతు మూడు గంటలకు పైగానే సాగినా.. పాములు రెండూ కదలకుండా కూర్చున్నాయి.. రెంటికీ తలపై జీలకర్ర బెల్లం పెట్టి శాస్త్రోక్తంగా మాంగల్యధారణ కూడా జరిపించారు.. కానీ తలంబ్రాల సీన్ వచ్చేసరికి సీన్ సితారైంది.

పాములకు పెళ్లి చేయడమే ఓ విచిత్రమనుకుంటే..అదీ శాస్త్రోక్తంగా చేయడం మరీ విడ్డూరం.. రెండు పాముల తలలపైనా జీలకర్ర బెల్లం పెట్టారు.. సుముహూర్తం చూసుకున్నారు.. జెర్రిగొడ్డు చేత నాగుపాము మెడలో తాళి కట్టించారు.. రెంటినీ అందరూ ఆశీర్వదించారు.. ఆ తర్వాతే వచ్చింది తలంబ్రాల సీను.. గంటల తరబడి తమను పెడుతున్న హింస చూసి జెర్రిగొడ్డుకు చిర్రెత్తుకొచ్చింది.. ముత్యాల తలంబ్రాలు పోస్తున్న టైమ్ లో జెర్రిగొడ్డు అసహనంతో కదిలిపోయింది. పాము చిర్రుబుర్రులాడటంతో దానిని వెంటనే బుట్టలో కప్పెట్టేశారు.. నాగుపాముకు మాత్రమే మిగతా తంతంతా జరిపించారు.. చిత్రంగా నాగుపాము మాత్రం పడగవిప్పి అందరినీ చూస్తూ బుద్ధిగా కూర్చుంది. పెళ్లి తర్వాత రెండు పాములనీ బుట్టల్లో పెట్టుకుని నిర్వాహకులు వెళ్లిపోగా.. ఇక జనం మాత్రం పెళ్లి భోజనం ఆరగించి.. బ్రేవ్ మని తేన్చి మరీ ఇంటి ముఖం పట్టారు..

చిత్రమేమంటే.. ఈ పెళ్లిని లోక కల్యాణానికి ముడిపెట్టడం.. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న వినాశనాలు, కష్టాలకు నాగసర్ప దోషమే కారణమట.. పాకిస్థాన్, చైనా మనకి కంటి మీద కునుకు లేకుండా చేయడానికి, రైలు ప్రమాదాలు, ఆర్థిక మాంద్యం ఒకటేమిటి.. ఇలా సమస్త సమస్యలకూ పాములకు పెళ్లితో పరిష్కారం చూపించారు నిర్వాహకులు..


Show Full Article
Print Article
Next Story
More Stories