నాగుపాము ఎలా చనిపోయింది..పాము మృతికి కారకులెవరు..?

x
Highlights

తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడలో నాగుపాము మృతి చెందింది. 27 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన పాము కాసేపటి క్రితమే...

తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడలో నాగుపాము మృతి చెందింది. 27 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన పాము కాసేపటి క్రితమే అనారోగ్యంతో మృతి చెందింది. ఈ 27 రోజుల పాటు పాము ప్రత్యేక పూజలను అందుకుంది. సుబ్రహ్మణ్యస్వామి ప్రతిరూపంగా స్థానికులు, నాగ భక్తులు పామును కొలిచారు.

నిన్న పామును ఆరోగ్య పరిస్థితిని వెటర్నరీ డాక్టర్లు పరీక్షించారు. అనారోగ్యంతో ఉందంటూ చికిత్స చేసేందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ పామును అక్కడి నుంచి తీసుకెళ్లనివ్వకుండా స్థానికులు, భక్తులు అడ్డుకున్నారు. ఇప్పుడు అధికారుల తీరువల్లే పాము చనిపోయిందంటూ స్థానికులు ఆందోళన చేస్తున్నారు. 26 రోజుల క్రితం దుర్గాడలోని ఓ రైతు పొలంలో పడగ విప్పి నాట్యం చేస్తున్న పాముకు మహిమాన్విత శక్తులు ఉన్నాయని భావించారు. పాము ఎవరిపై ఎటాక్ చేయకపోవడం కనీసం కాటు వేసే ప్రయత్నం కూడా చేయకపోవడంతో స్థానికులంతా పూజలు చేయడం ప్రారంభించారు. ఆ సుబ్రహ్మణ్య స్వామే పాము రూపంలో తమ కష్టాలు తీర్చేందుకు వచ్చాడని నిత్యం పూజలు చేశారు.

27 రోజులుగా పాము ఏమీ తినలేదు. ఇన్ని రోజులు తినకుండా ఎలా ఉండగలిగిందన్నదే ఇప్పుడు మిస్టరీగా మారింది. ఏమీ తినకుండా ఎవ్వరినీ ఏమీ అనకుండా ఉండటంతో పాముకు శక్తులున్నాయని స్థానికులు నమ్మారు. నాగేంద్రుడికి ఓ గుడి కూడా కట్టాలని ఫిక్సయ్యారు. కానీ ఇంతలోనే పాము అనారోగ్యంతో చనిపోయింది. దుర్గాడ పొలాల్లోకి వచ్చిన 25 రోజుల తర్వాత పాము కుబుసం విడిచింది. దీంతో అక్కడ స్థానికులు పెద్ద ఎత్తున పూజలు చేశారు. నాగేంద్రుడికి ప్రత్యేకంగా అభిషేకాలు చేశారు. కుబుసం విడిచిన రోజు మాత్రమే కాదు పాము పడగ విప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ పూజలు కొనసాగుతూనే ఉన్నాయి. పూనకాలు ఊగేవాళ్లు ఊగుతూనే ఉన్నారు. ఆ నాగన్న దేవుడే తమకోసం వచ్చాడని భక్తులంతా బలంగా నమ్మారు.

పాము విషయం ఆ నోటా ఈ నోటా పాకి తూర్పుగోదావరి జిల్లాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. దీంతో పామును చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాటు దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి చూసి వెళ్లారు. పాలు తీసుకొచ్చి నాగేంద్రుడికి పోశారు. పామును దర్శించుకొని పారవశ్యం చెందారు. ఈ 27 రోజులు దారులన్నీ వాహనాలన్నీ దుర్గాడ పొలాల వైపే మళ్లాయి. ఇప్పటివరకు వేల మంది పామును చూసేందుకు వచ్చారు. ఈ తంతు 4 వారాల పాటు నిర్విరామంగా కొనసాగింది.

అడవుల్లో తిరిగే పాముకు ఈ రేంజ్‌లో పూజలు జరుగుతాయని ఇంత హాట్ టాపిక్‌గా మారుతుందని ఎవరూ ఊహించలేదు. జనమే కాదు ఆ పాము కలలో కూడా అనుకోలేదు తనకు పూజలు, అభిషేకాలు చేస్తారని. తన మానాన తాను పొలాల్లో పడి తిరుగుతూ దొరికింది తింటుంటే ఊహించని విధంగా ఇలాంటి ఎపిసోడ్ ఒకటి తన జీవితంలో వస్తుందని పాము అస్సలు అనుకొని ఉండదు. ఒక్కసారి పడగ విప్పి తలూపిన పాపానికి జనం అస్సలు ఆలస్యం చేయకుండా పూజలు చేయడం మొదలెట్టేశారు. మళ్లీ ఎక్కడ పడగ దించితే ఏం చేస్తారోనన్న భయం, ఆందోళనతో పాము అలాగే చూస్తూ, ఆడుతూ ఉండిపోయింది. ఓపిక నశించి ఎవరినీ ఏమీ అనకుండా ఉండిపోయింది. దీంతో జనం దానికి.. తమ మూఢనమ్మకాలను ఆపాదించి.. 4 వారాల పాటు దానికి తిండి లేకుండా చేశారు. చివరికి దాని ప్రాణం కూడా లేకుండా చేసేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories