ఏపీపై పడగెత్తిన పెథాయ్‌

x
Highlights

తిత్లీ తుపాను కలిగించిన నష్ట ప్రభావం నుంచి ఇంకా కోలుకోకముందే ఏపీపై పెథాయ్‌ పేరిట మరో తుపాను పడగ విప్పి బుసలుకొడుతోంది. తీరప్రాంత జిల్లాల్లోని ప్రజలను...

తిత్లీ తుపాను కలిగించిన నష్ట ప్రభావం నుంచి ఇంకా కోలుకోకముందే ఏపీపై పెథాయ్‌ పేరిట మరో తుపాను పడగ విప్పి బుసలుకొడుతోంది. తీరప్రాంత జిల్లాల్లోని ప్రజలను ముఖ్యంగా రైతులను అత్యంత కలవరపరుస్తోంది. ఆరుగాలం కష్టించిన ఖరీఫ్‌ పంట చేతికందే సమయంలో విరుచుకుపడుతున్న తుపానుతో కలిగే నష్టాన్ని ఊహిస్తుంటే కర్షకుల గుండెల్లోంచి ఆవేదన తన్నుకొస్తోంది. పంటను ఎలాగైనా కాపాడుకోవాలనే తపన పొంగుకొస్తోంది. ‘పెథాయ్‌’ బారి నుంచి పంటలను రక్షించేందుకు ప్రభుత్వమూ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తోంది. అవసరమైన సహాయపునరావాస చర్యలు చేపట్టేందుకు సర్వసన్నద్ధతను ప్రకటించింది. నష్టతీవ్రతను తగ్గించి, బాధితులను ఆదుకునేందుకు సహాయబృందాలను అప్రమత్తం చేసింది. సీఎంచంద్రబాబు జిల్లా కలెక్టర్లు, అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన పెథాయ్‌ తుపాను ఆంధ్రప్రదేశ్‌ తీరంవైపు దూసుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉన్న తీవ్ర వాయుగుండం నిన్న తుపానుగా బలపడిందని వాతావరణశాఖ వెల్లడించింది. ఇది మరింత బలోపేతమై రేపు మధ్యాహ్నం ప్రాంతంలో మచిలీపట్నం - కాకినాడ మధ్య తీరం దాటొచ్చని, అనంతరం భూమార్గంలో విశాఖ జిల్లా వైపుగా పయనించొచ్చని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తుపాను తీవ్రత తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, కృష్ణ, గుంటూరు జిల్లాలపై ఉంటుందని హెచ్చరించారు. అధికారులు రాత్రి విడుదల చేసిన వివరాల ప్రకారం.. నిన్న సాయంత్రం 5.30 గంటల సమయంలో ఈ తుపాను శ్రీలంకలోని ట్రికోమలీకి 440 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి 590 కి.మీ, మచిలీపట్నానికి 690 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఇవాళ తీవ్ర తుపానుగా బలపడుతుంది. రేపు కూడా అదే తీవ్రతతో కొనసాగి మధ్యాహ్నం ఉత్తరవాయవ్య దిశగా ప్రయాణించి మచిలీపట్నం, కాకినాడ మధ్య తీరం తాకొచ్చు. అదే తీవ్రతతో విశాఖవైపుగా దిశ మార్చుకునే అవకాశం ఉంది. ఈ తీవ్ర తుపాను తీరం దాటే సమయంలో గాలుల తీవ్రత గంటకి 90 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల వరకు ఉండొచ్చని అంచనా. అమెరికాకు చెందిన జేటీడబ్ల్యుసీ సంస్థ మాత్రం.. కాకినాడ - విశాఖ జిల్లా మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తోంది.

తీవ్ర తుపాను ప్రభావం 5 జిల్లాలపై ఉంటుందని అధికారులు హెచ్చరించారు. ప్రత్యేకించి తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో నష్టతీవ్రత ఎక్కువగా ఉండొచ్చని తెలిపారు. విద్యుత్తు, సమాచార సంబంధాలు, పూరిల్లు, రోడ్లు దెబ్బతినే అవకాశాలుంటాయని, పంటలకు తీవ్రనష్టం వాటిల్లవచ్చని పేర్కొన్నారు. ఇవాళ, రేపు కోస్తాంధ్రలో చాలాచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. రేపు కొన్నిచోట్ల అతితీవ్రతతో కూడిన భారీ వర్షాలు ఉంటాయని తెలిపారు. ఉత్తరాంధ్రలో అక్కడక్కడా 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలుంటాయని తెలిపారు. కోస్తాంధ్ర తీరంలో తుపాను ఉప్పెన ప్రభావం 0.5 మీటర్ల నుంచి ఒక మీటరు ఎత్తు వరకు ఉంటుందని తెలిపారు. కాకినాడ సమీపంలో ఉన్న యానాం ప్రాంతానికి అధికారులు ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేశారు. అంటే ముప్పు తప్పదని, అప్రమత్తంగా ఉండాలన్నది దాని అర్ధం. తమిళనాడు, పుదుచ్చేరి, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, జార్ఖండ్‌ ప్రాంతాలపైనా ప్రభావం ఉంటుందని వివరించారు.
పెథాయ్‌ తుపాను సూచనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సహాయ, పునరావాస చర్యలపై దృష్టి పెట్టింది. ఏపీ సీఎం చంద్రబాబు జిల్లాల కలెక్టర్లు, వివిధశాఖల అధికారులతో సమీక్షించారు. తిత్లీ అనుభవాల నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రభావిత ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆర్టీజీఎస్‌ ద్వారా నివేదికలు తెప్పించుకుంటున్న సీఎం నష్టనివారణ చర్యలపై ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories