logo
జాతీయం

రాజ్యసభకే వన్నె తెచ్చిన మాస్టర్ సచిన్ టెండుల్కర్

రాజ్యసభకే వన్నె తెచ్చిన మాస్టర్ సచిన్ టెండుల్కర్
X
Highlights

భారత క్రికెట్ దేవుడు మాస్టర్ సచిన్ టెండుల్కర్ మరోసారి తన పెద్దమనసును చాటుకొన్నాడు. ప్రపంచ మేటి క్రికెటర్ గా...

భారత క్రికెట్ దేవుడు మాస్టర్ సచిన్ టెండుల్కర్ మరోసారి తన పెద్దమనసును చాటుకొన్నాడు. ప్రపంచ మేటి క్రికెటర్ గా మాత్రమే కాదు రాజ్యసభ సభ్యుడిగా కూడా భారత పార్లమెంట్ కే వన్నె తెచ్చాడు. పెద్దల సభలో సభ్యుడిగా ఆరేళ్ల తన ఇన్నింగ్స్ ను ఘనంగా ముగించాడు. కోట్లకు పడగలెత్తిన పార్లమెంట్ సభ్యులకే ఆదర్శంగా నిలిచాడు.

సచిన్ రమేశ్ టెండుల్కర్ మొన్నటి, నిన్నటి, నేటితరాల క్రికెట్ కమ్ క్రీడాభిమానులకు అత్యంత సుపరిచితమైన పేరు. 45 సంవత్సరాల క్రితం ముంబైలోని బాంద్రాలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన సచిన్ 15 ఏళ్ల చిరుప్రాయంలోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ప్రభంజనం సృష్టించాడు. 16 ఏళ్ల వయసులోనే భారత టెస్ట్ జట్టులో చోటు సంపాదించాడు.

ఆ తర్వాత నుంచి 22 సంవత్సరాల పాటు ఏకబిగిన అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ కొనసాగించి రికార్డుల మోత మోగించాడు. ఇన్ స్టంట్ వన్డే క్రికెట్, సాంప్రదాయ టెస్ట్ క్రికెట్ అన్నతేడాలేకుండా భారత, ప్రపంచ క్రికెట్ కే మూలవిరాట్టుగా నిలిచాడు. తన ఆటతీరు, ఎదిగినకొద్దీ ఒదిగి ఉండాలనే తత్వం, అంతకుమించి అసాధారణ వ్యక్తిత్వంతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకొన్నాడు. జనసంమోహక క్రికెటర్ గా నీరాజనాలు అందుకొన్నాడు. సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో 200 టెస్టులు, 51 సెంచరీలు, టన్నుల కొద్దీ పరుగులు, వన్డే క్రికెట్లో 443 వన్డేలు , 49 శతకాలు, 15వేలకు పైగా పరుగులు సాధించి ఈఘనత సాధించిన ఒకే ఒక్కడిగా నిలిచాడు.

మానవసాధ్యంకాని ఎన్నో రికార్డులు నమోదు చేసి ప్రపంచ క్రికెట్ సూపర్ మ్యాన్ గా గుర్తింపు తెచ్చుకొన్నాడు. రెండు దశాబ్దాల నాన్ స్టాప్ క్రికెట్ కెరియర్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన సచిన్ క్రికెటేతర క్రీడల ప్రమోటర్ గా, ఫ్యామిలీ మ్యాన్ గా మాత్రమే కాదు రాజ్యసభ సభ్యుడిగాను కొత్త ఒరవడి సృష్టించాడు. ఆరేళ్ల క్రితం రాష్ట్రపతి విచక్షణ కోటా కింద రాజ్యసభ్యుడిగా బాధ్యతలు చేపట్టిన సచిన్ తనవంతుగా విలక్షణ సేవలు అందించాడు. మొత్తం 397 రోజుల రాజ్యసభ సమావేశాలలో కేవలం 29 రోజులు మాత్రమే హాజరై విమర్శలు ఎదుర్కొన్నాడు. తన పదవీ కాలంలో వివిధ అంశాలపై సచిన్ 22 ప్రశ్నలు మాత్రమే సంధించగలిగాడు.

రాజ్యసభకు సచిన్ హాజరు శాతం తక్కువగా ఉన్న అసమాన సేవలు అందించాడు. రాజ్యసభ సభ్యుడిగా తన పదవీకాలం ఆరేళ్లలో అందుకొన్న మొత్తం 86 లక్షల 23 వేల 266 రూపాయల వేతనాన్ని
ప్రధానమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చి దటీజ్ సచిన్ టెండుల్కర్ అనిపించుకొన్నాడు. అంతేకాదు సచిన్ దొడ్డమనసును చూసి ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఫిదా అయిపోయారు. సచిన్ విరాళంగా ఇచ్చిన ప్రతిరూపాయిని జాగ్రత్తగా ఖర్చు చేస్తామని ఆపన్నులకు అందేలా చూస్తామని ప్రకటించారు.

భారత పార్లమెంట్ సభ్యుల్లో చాలామంది కోట్లకు పడగలెత్తినవారు ఉన్నారు. అయితే ఇప్పటి వరకూ ఏ ఒక్కరూ సచిన్ లా తమ మొత్తం వేతనం, భత్యాలను విరాళంగా ఇచ్చిన పాపానపోలేదు. సచిన్ అంతటితోనే ఆగిపోలేదు. రాజ్యసభ సభ్యుడిగా తనకు హక్కుగా వచ్చిన మొత్తం 30 కోట్ల రూపాయల నిధుల్లో 97 శాతాన్ని దేశంలోని వివిధ రాష్ట్రాలలో అభివృద్ధి పనుల కోసం వినియోగించాడు. దేశంలోని మారుమూల ప్రాంతాలలో కనీస సదుపాయాలకు నోచుకోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం 7 కోట్ల 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు.

ఇక సంసద్ గ్రామ్ ఆదర్శ యోజన పథకం కింద ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాకు చెందిన పుట్టంరాజు కండ్రిక, మహారాష్ట్రలోని డోంజా గ్రామాలను దత్తత తీసుకొని ఆయా గ్రామాల రూపురేఖలనే సమూలంగా
మార్చి వేశాడు. సంసద్ గ్రామ్ ఆదర్శ యోజన పథకాన్ని అత్యంత సమర్థవంతంగా అమలు చేసి నిధులను ఖర్చు పెట్టిన పార్లమెంటు సభ్యులలో సచిన్ నంబర్ వన్ స్థానంలో నిలిచాడు. సచిన్ రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టక ముందే క్రికెటర్ గా ఉన్న సమయంలోనే తన కుటుంబసభ్యుల సహకారంతో అప్నాలయ్ సంస్థ ద్వారా ముంబై మహానగరంలోని మురికివాడల పిల్లల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాడు. లక్షలాదిమంది బాలలకు బలవర్థక ఆహారం, దుస్తులు, విద్యాసౌకర్యాలను తన ట్రస్టు ద్వారా కల్పిస్తూ వస్తున్నాడు. వేలాదిమందికి ఉచితంగా గుండె, కంటి ఆపరేషన్లు చేయిస్తూ తనవంతు సేవ చేస్తున్నాడు.

క్రికెట్ నుంచి సచిన్ రిటైరైనా క్రికెటేతర క్రీడలతో తన అనుబంధం కొనసాగిస్తున్నాడు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ మెంటార్ గా, ఇండియన్ సాకర్ లీగ్ లో కేరళ బ్లాస్టర్స్ కోఓనర్ గా, ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ లో ముంబై జట్టు సహయజమానిగా ఉన్న సచిన్ క్రికేటతర క్రీడాకారులకు తనవంతుగా సేవలు అందిస్తున్నాడు. కుటుంబం కోసం పూర్తిసమయం కేటాయిస్తున్న సచిన్ నేటితరంలోనూ ఎందరో యువక్రికెటర్లకు స్ఫూర్తి ప్రదాతగా ఉంటూ తన ప్రత్యేకతను కాపాడుకొంటున్నాడు. జీవించి ఉండగానే భారత రత్న పురస్కారం అందుకొన్న ఒకే ఒక్కడు సచిన్ మాత్రమే .

ఏదిఏమైనా సచిన్ లాంటి అసాధారణ క్రికెటర్ రిటైర్మెంట్ జీవితాన్ని తన విలక్షణ సేవా కార్యక్రమాలతో పునీతం చేసుకొంటున్నాడు. రాజ్యసభ సభ్యుడిగా సచిన్ తన ఉదారత్వాన్ని, చాటుకొన్నట్లే దేశంలోని మిగిలిన పార్లమెంట్ సభ్యులూ చాటుకోగలిగితే భారత ప్రజాస్వామ్యంలో సరికొత్త అధ్యాయానికి తెరతీసినట్లే అవుతుంది.

sachin tendulkar modi

Next Story