లోకేష్ ప్రకటనపై తీవ్ర అసంతృప్తిలో తండ్రీ కొడుకులు...ఇతర పార్టీలవైపు చూపు

x
Highlights

పార్టీలో ఉన్న వారిని కాదని ఫిరాయింపు నేతలకు చినబాబు పెద్ద పీట వేయడంపై టీడీపీలో రచ్చ జరుగుతోంది. నాలుగేళ్లు కష్టపడి అసెంబ్లీ సీటు కోసం ప్రయత్నిస్తున్న ...

పార్టీలో ఉన్న వారిని కాదని ఫిరాయింపు నేతలకు చినబాబు పెద్ద పీట వేయడంపై టీడీపీలో రచ్చ జరుగుతోంది. నాలుగేళ్లు కష్టపడి అసెంబ్లీ సీటు కోసం ప్రయత్నిస్తున్న టిజి కుటుంబం చినబాబు తీరుపై మండి పడుతోంది. బట్ పైకి ఏమాత్రం తేలకుండా లోపల వారి ప్రయత్నాల్లో వారున్నారు.

కర్నూలులో టీడీపీ అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది అందుకు కారణం చినబాబు లోకేష్ చేసిన హడావుడి. ఒకప్పుడు తెలుగు దేశానికి కంచుకోటగా ఉన్న కర్నూలు జిల్లాకు పునర్వైభవం తేవాలన్న లోకేష్ తపన వివాదానికి దారి తీసింది. లోకేష్ అనూహ్యంగా చేసిన ఈ ప్రకటన స్థానిక నేతల మధ్య చిచ్చు పెట్టింది. ఇటీవల కర్నూలు పర్యటనకు వెళ్లిన లోకేష్ అక్కడ ఏకంగా అభ్యర్ధులను ప్రకటించేశారు.

లోకేష్ ప్రకటనతో వలస నేతలకు పెద్ద పీట వేస్తూ పార్టీ నేతలను పక్కన పెడుతున్నారన్న ఆగ్రహం నష్టపోతున్న నేతల్లో వ్యక్తమవుతోంది. ఏపి విభజన సమయంలో కాంగ్రెస్ పై కోపంతో టి.జి.వెంకటేష్ టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. సహజంగా వాణిజ్యవేత్త, అనేక సేవా కార్యక్రమాలు కూడా ఉండటంతో టిజి వెంకటేష్ పార్టీ మార్పుపై స్థానికంగా పెద్ద వ్యతిరేకత వ్యక్తం కాలేదు.. అప్పటినుంచి టీడీపీ లోనే ఉంటున్న టిజి తన వారసత్వ రాజకీయాలకు బాటలు వేసుకుంటూ వచ్చారు. జిల్లాలో తనకంటూ ఓ మార్క్ చాటుకున్న టిజి ఇప్పుడు తన కుమారుడి భవిష్యత్తే ధ్యేయంగా పావులు కదుపుతున్నారు.

తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ అటు భరత్ కూడా కర్నూలు అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు. అనేక సందర్భాల్లో కర్నూలు నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు కూడా అంతేకాదు టీడీపీ పరిస్థితి పైనా,తనపై నగర ప్రజలకున్న అభిప్రాయాలపైనా ఎప్పటికప్పుడు సర్వేలు, ప్రజాభిప్రాయ సేకరణ, ప్రజాసంఘాల సలహాలు, సూచనలను తీసుకుంటూ అడుగు ముందుకేస్తున్నారు. నగరంలో ఏ చిన్న కార్యక్రమం ఉన్నా వెనకా ముందూ చూడకుండా భరత్ అక్కడకు చేరుకుంటున్నారు. భరత్ లో ఈ ఉత్సాహం చూసిన వారంతా టీడీపీ ఎమ్మెల్యే భరతేననే భావనకు వచ్చేశారు. కానీ లోకేష్ నగర పర్యటన టి.జి. వెంకటేష్, భరత్ ల ఉత్సాహంపై నీళ్లు చల్లింది. తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్లు పరిస్థితి మారిపోడంతో వారు కంగుతిన్నారు.

నియోజక వర్గంపై ఏకాగ్రతతో ముందునుంచి ఒక పథకం ప్రకారం గెలుపుకోసం బాటలు వేసుకుంటున్న భరత్ ఇప్పుడు అడుగు వెనక్కు వేసే ప్రసక్తే లేదంటున్నారు. ఆరునూరైనా, ఎవరేమనుకున్నా తాను మాత్రం పోటీచేసి తీరతానని తన సన్నిహితుల దగ్గర చెప్పడం చూస్తుంటే ఈ సమస్య అంత సులభంగా పరిష్కారం కాదని తేలిపోయింది. ఇంత దూరం వచ్చేశాక ఇక తాడో పేడో తేల్చుకోవాల్సిందేననే ఉద్దేశానికి తండ్రీ, కొడుకులు వచ్చేశారు. టీడీపీ టిక్కెట్ రాకపోయినా నష్టంలేదని తమకు అన్ని పార్టీల నుంచి ఆఫర్లున్నాయని వారు సన్నిహితుల దగ్గర చెబుతున్నారు. ఇప్పటికే వైసీపీ, బీజేపీ, జనసేన కూడా తమవైపు చూస్తున్నాయని వారు చెప్పుకుంటున్నారు. లోకేష్ ఇంత హడావుడిగా ఇలాంటి ప్రకటన ఎందుకు చేశారన్న అంశం ఇప్పుడు జిల్లాలో పెద్ద చర్చగా మారింది. అసలు లోకేష్ ఏ వ్యూహంతో ఈ ఎత్తుగడ వేశారనే విమర్శలు కూడా టీడీపీ నేతలు చేస్తున్నారు.

వాస్తవానికి 2014లోనే కర్నూలు అసెంబ్లీ సీటుపై టి.జి. భరత్ కన్నేశాడు కానీ అప్పట్లో కల నెరవేరలేదు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అవకాశం వదులుకోరాదన్న పట్టుదలతో భరత్ ఉన్నాడు. అందుకే తమతో టచ్ లో ఉన్న ఇతర నేతలు, పార్టీలతో గుట్టు చప్పుడు కాకుండా రాయబారాలు జరుపుతున్నారు. మరోవైపు తొందర పడవద్దంటూ టి.జి. వెంకటేష్ ను సన్నిహితులు వారిస్తున్నారు. చంద్రబాబుతో మాట్లాడే వరకూ ఏ నిర్ణయం తీసుకోవద్దని వేచి చూడాలని సన్నిహితులు, స్థానిక నేతలు సలహా ఇస్తున్నారు. లోకేష్ టూర్ మొదటి రోజు హుషారుగా కనిపించిన టిజి వెంకటేష్, టిజి భరత్ లు స్టేజిపై బాహాటంగా లోకేష్ ప్రకటన చూశాక విస్తుబోయారు. దాంతో సాయంకాలపు భేటీకి ఇద్దరూ డుమ్మా కొట్టారు. అసలు అభ్యర్ధుల ఎంపిక విషయంలో చివరి వరకూ ఆచి తూచి వ్యవహరించే చంద్రబాబు చినబాబు ప్రకటనపై ఎలా స్పందిస్తారోనని జిల్లా ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. మొత్తానికి కర్నూలులో అధికార పార్టీలో ముసలం పుట్టే అవకాశం కనిపిస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories