160 గజాల మేడ...బంగారు పంటల మేళా

x
Highlights

ఆలోచన ఉండాలే కాని నేలమీదే కాదు...ఎక్కడైనా పంటలు పండించవచ్చని నిరూపిస్తున్నారు భాగ్యనగరవాసి. వ్యవసాయ స్థలం లేకపోయినా మేడ మీద ఉన్న 160 గజాల స్థలం చాలు...

ఆలోచన ఉండాలే కాని నేలమీదే కాదు...ఎక్కడైనా పంటలు పండించవచ్చని నిరూపిస్తున్నారు భాగ్యనగరవాసి. వ్యవసాయ స్థలం లేకపోయినా మేడ మీద ఉన్న 160 గజాల స్థలం చాలు ఇంటికి కావాల్సిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పండించుకోవచ్చని నిరూపిస్తున్నారు. నారపల్లికి చెందిన రఘోత్తమరెడ్డి చేపట్టిన వైవిద్యభరితమైన వ్యవసాయ కృషి మనల్ని అబ్బురపరుస్తుంది. అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.

కాంక్రీట్ జంగిల్‌లా మారిన హైదరాబాద్‌లో ఇప్పుడిప్పుడే గార్డెనింగ్ కల్చర్‌కు డిమాండ్ పెరుగుతోంది. ఇంటి పంటలను పెంచుకునేందుకు నగరవాసులు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండించుకునేందుకు మక్కవు చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా, నారపల్లి గ్రామానికి చెందిన తుమ్మేటి రఘోత్తమ్ రెడ్డి తన ఇంటిని ఉద్యాన వనంగా మార్చేశారు. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఇక్కడ చూస్తున్న ఈ గార్డెన్ ఏ పార్కులో ఉన్నదో కాదు. రఘోత్తమరెడ్డి ఇంటిపైన ఉన్నదే 160 గజాల్లో నిర్మించిన ఇంటిపైన మొక్కలను పెంచుతున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పెంపొందిస్తున్నారు.
బిల్డింగ్ గార్డెనింగ్‌తో రఘోత్తమరెడ్డి అందరినీ ఆకర్షిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలను పెంచుతున్నానని చెబుతున్న రఘోత్తమ రెడ్డి గార్డెనింగ్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెబుతున్నారు. ఇంటిపైన ఖాళీ స్థలం లేకపోవడం వల్లనే మేడ మీద పంటలు పండిస్తున్నామని చెబుతున్నారు.

గత ఏడు సంవత్సరాలుగా ఇంటి పైకప్పు మేడపై కుటుంబానికి సరిపడా కూరగాయలను, కొన్ని పండ్లను, పువ్వులను,ఆకుకూరలు పండిస్తున్నారు. వీటన్నింటికి ఎలాంటి హానికర రసాయన ఎరువులు వేయకుండా వర్మికంపోస్ట్‌తో సాగు చేస్తున్నామంటున్నారు. ఇంటిమీద మొక్కలు పెంచడం వల్ల ఇంట్లో చల్లని వాతావరణ ఏర్పడుతోంది. వేసవి కాలంలో ఏసీ ఖర్చుతగ్గుతోంది. కూరగాయలు బయటకొనే ఇబ్బంది తప్పిందంటున్నారు.

రూఫ్ గార్డెన్‌ను కేవలం ఫలసహాయం కోసం మాత్రమే కాక సేదతీరడానికి పార్క్‌లా రూపొందించడంలో చాలా కృషి ఉంది. వ్యవసాయం అన్ని సంస్కృతులకు మూలం అయితే రఘోత్తమ్, వ్యవసాయం మానవ జీవితానికి అవసరమయ్యే విలువల్ని నేర్పుతుందంటారు. శ్రమ విలువను అర్థమయ్యేలా చేసి, శ్రమ పట్ల గౌరవాన్ని పెంచుతుందంటారు.

రఘోత్తమరెడ్డిది వ్యవసాయ కుటుంబ నేపథ్యమే అయినా వ్యవసాయంలో స్థిరపడలేదు. గణితంతో ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేయకుండానే సింగరేణి బొగ్గు గనిలో కార్మికుడిగా జీవితం ప్రారంభించి కొనసాగారు. అయితే ఆయనకు చిన్నపటి నుంచి వ్యవసాయం పట్ల మక్కువ. తన ఆసక్తిని ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు. భూమిలోని బొగ్గును పైకి తీసారు, ఇప్పుడు మేడపైన పూలు, పండ్లు, కూరగాయలనూ తీసి చూపిస్తున్నారు.

ప్రతి ఇంటా రూఫ్ గార్డెన్ వ్యవసాయంతో శారీరక వ్యాయామం, మంచి ఆహారం, ఆరోగ్యం లభిస్తాయి. పచ్చని ఆలోచనల సృజనకాంతులు విరజిమ్ముతాయని ఆయన అంటారు. వారి రూఫ్ గార్డెన్‌లో టమాట, వంకాయ, కాలీఫ్లవర్, క్యాబేజీ, ఉల్లి, దొండ, నేతిబీర, మిరప, మునగ, చేమగడ్డ వంటి కూరగాయలు.. కరివేపాకు పుదినా వంటి సుంగధ ద్రవ్యాలు.. తోటకూర, బచ్చలి, గంగవాయిలి కూర వంటి ఆకు కూరలు, సీతాఫలం, రామాఫలం, అల్లనేరేడు, జామ, నిమ్మ, బత్తాయి, దానిమ్మ, పంపర పనస, సపోటా, బొప్పాయి, మామిడి ఇలా పండ్ల మొక్కలు, ఇంటిలోని కోళ్ల కోసం కొర్ర, సజ్జ, జొన్న వంటి గింజనిచ్చే మొక్కలు పెంచుతున్నారు.

ఇక పూల విషయానికొస్తే ములకబంతి, నిత్య వరహాలు, చంద్రకాంతలు, సీతజడలు, బిళ్లగన్నేరు, మల్లి, రంగు రంగుల మందారాలు, గులాబీ, జాజి, రంగు రంగుల బోగస్ విలియాలు పెంచుతున్నారు. 160 గజాల మేడ స్థలంలో తీగల పందిరి సహకారంతో సాగును కొత్త అడుగులు వేయిస్తున్నారు. ఇంటి అవసరాలకు ఉపయోగించుకుంటూ, ఎక్కువ వచ్చిన ఫలసాయాన్ని ఇరుగుపొరుగులతో పంచుకుంటున్నారు. ఈ పనిని ఆయన సొంత అభిరుచి, స్వయం కృషితో కొనసాగిస్తున్నారు. ఎవరి నుంచి ఎటువంటి సహకారం తీసుకోలేదు. అయితే ఉద్యానశాఖ వారు ఇటువంటి రూఫ్‌గార్డెన్‌లు పెంచాలనుకునే వారికి సహకారం అందిస్తున్నారు.

మట్టి ఆరోగ్యంతోనే మనిషి ఆరోగ్యం ఇది అందరికీ తెలుసుకు రఘోత్తమరెడ్డి మరొక అడుగు ముందుకు వేసి మట్టి, పర్యావరణ ఆరోగ్యాలతో కేవలం మనిషే కాదు సమస్త విశ్వ ఆరోగ్యం అని అంటారు. అందుకే పంటల సాగుకు ఎలాంటి రసాయన పురుగుమందులు వాడకుండా కేవలం ప్రకృతిలో లభించే ఎరువులనే వినియోగిస్తున్నరు. అరోగ్యకరమైన ఆహారాన్ని పండిస్తున్నారు.

పంటలకు రసాయన పురుగు మందులు, ఎరువులు వాడకుండా పశువుల పెంట, మేక పెంట, కోళ్ల పెంట వంటివి ఎరువులుగా వినియోగిస్తున్నారు. వేరుపురుగు, తెల్ల చీమలు వంటి వాటికి వేపపిండి, వేపనూనె వినియోగిస్తున్నారు. ఇంక ఇతరత్రా పురుగులను ఎప్పటికప్పుడు చేతితో ఏరివేయడం ద్వారా మొక్కలను సంరక్షిస్తున్నారు. ఎండిపోయిన, రోగంతో వడలిపోయిన వాటిని తుంచి తొలగిస్తున్నారు.

ఇంటి నిర్మాణ సమయంలోనే, రూఫ్ గట్టిదనం, వాలు గురించి శ్రద్ధ తీసుకున్నారు. ఇవి సాధారణంగా అందరూ తీసుకునే జాగ్రత్తలే. రైతు కుటుంబం నుంచి వచ్చిన వారుకావడంతో వ్యవసాయోత్పత్తులు క్రిమిసంహారక మందులతో ఎంత విషతుల్యం అవుతున్నాయో తెలుసుకున్నారు. ఇంటర్ చదివే రోజుల్నుంచే కూరగాయల పెంపకం పట్ల ఆసక్తిని పెంచుకున్నారు.

7 సంవత్సరాల క్రితం రూఫ్ గార్డెన్‌ని మిద్దె మీద ప్రారంభించారు. సుమారు 20వేల రూపాయలు ఖర్చు చేశారు. అప్పటి నుంచి బయట మార్కెట్‌లో కూరగాయలు కొన్న ప్రసక్తే లేదు. రసాయన ఎరువులు పరుగు మందులు లేని కూరగాయల్ని పొందుతున్నారు.

ప్రస్తుతం ఆహారం ఎంత కలుషితమవుతుందో, దాన్ని ఉత్పత్తి చేసే క్రమంలో ఎన్ని విషాలను క్రిమిసంహారక మందుల పేరుతో ఉపయోగిస్తున్నారో అందరికీ తెలుసు. తినేవాళ్ల ఆరోగ్యం చెడిపోవడమే కాదు, ఆయుష్షు తగ్గిపోతోంది. అన్నీ తెలిసిన వాళ్లు, వనరులు ఉన్నవాళ్లు స్థలం లేకపోయినా రూఫ్ గార్డెన్‌లను ఏర్పాటు చేసుకొని, మంచి కూరగాయాలను, పండ్లను పండించుకోవచ్చు. తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా, సమాజ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్లు అవుతారంటారు రఘోత్తమరెడ్డి.

ఇంటి పైభాగంలో మొక్కలు పెంచుకోవడం మధ్య యుగాల సాంప్రదాయంలోను ఉన్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. అయితే, నేడు ఒక అవసరంగా రూఫ్ గార్డెన్‌ను చేపట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇల్లు కొత్తగా కట్టుకునే వారు రూఫ్ గార్డెన్ పెంచే దృష్టితో గార్డెన్ వల్ల మేడపై వచ్చే అదనపు బరువును దృష్టిలో పెట్టుకుని కట్టుకుంటే మంచిది. అయితే, తేలికపాటి కుండీలు, వనరులతో పరిమితంగా రూఫ్ గార్డెన్‌ను ఏర్పాటు చేసుకోవాలంటారు రఘోత్తమరెడ్డి.

పట్టణ ప్రాంతాలలో జనాభా పెరుగుదలతో ఎక్కువ భూమిని ఇంటి నిర్మాణానికి వినియోగిస్తున్నారు. అందువల్ల కూరగాయలు, అవసరమైన మొక్కలు పెంచడానికి స్థలం ఉండడం లేదు. ప్రత్యేకంగా బహుళ అంతస్తుల భవనాలలో కుండీలను ఉపయోగించి కూరగాయలను, పండ్ల మొక్కలను పెంచుకోవడం ఒక్కటే మార్గం. 40-50 చదరపు మీటర్ల స్థలంలో నలుగురు సభ్యులున్న కుటుంబానికి సరిపడా కూరగాయలను పండించుకోవచ్చు. మొక్కల పెంపకం చేపట్టే ముందు ప్రణాళిక తయారు చేసుకోవడం చాలా అవసరం.

రూఫ్‌ గార్డెన్ ఏర్పాటు వల్ల మొక్కలు ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి. ప్రకృతికి దగ్గరయ్యే అవకాశం కలుగుతుంది. మొక్కలను సంరక్షించుకుంటూ మానసిక ఉల్లాసం పొందవచ్చు. ఒత్తిడి, అలసట నుంచి బయట పడవచ్చు. ఇంటిపైన స్థలాన్ని సమర్థవంతంగా వినియోగించవచ్చు. కుటుంబానికి, ఇరుగుపొరుగుకు అవసరమైన కూరగాయలను పండించవచ్చు. సంవత్సరం పొడవునా సేంద్రియ పద్ధతిలో పండించిన పండ్లు, కూరగాయలు లభ్యమవుతాయి. ఖర్చు తగ్గుతుంది. సాధారణంగా దొరకని కూరగాయలను పండించుకోవచ్చు. పచ్చదనాన్ని కాపాడుకుంటూ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించుకోవచ్చు.

డాబా పైకప్పు బలంగా మొక్కల బరువు మోయగలిగేలా ప్రణాళిక చేసుకోవాలి. పైకప్పు కారకుండా ఉండాలి. మురుగునీటి పారుదల సౌకర్యం తప్పనిసరిగా ఉండాలి. ప్రణాళికా బద్ధంగా మొక్కలు నాటాలి. కుండీల్లో నింపే మిశ్రమం తేలికపాటి బరువు ఉండేలా చూసుకోవాలి. నీళ్ల ట్యాంక్‌ను పైనే అందుబాటులో ఉండేలాగా చూసుకోవాలి. గాలి వేగాన్ని తగ్గించే మొక్కలను చుట్టూ పెంచాలి.

కుండీలను సూర్యరశ్మి సోకే విధంగా ఏర్పాటు చేయాలి. లోతుగా పెరిగే వేర్లుఉన్న మొక్కలను పెద్ద కుండీలలో, పైపైన పెరిగే వేర్లున్న మొక్కలను చిన్నకుండీలలో పెంచాలి. బరువైన పెద్ద కుండీలను భవనం బలమైన భాగాలలో ఉంచాలి. కుండీలో తేమ పరిస్థితులను బట్టి అవసరమైనప్పుడు నీరందించాలి. ఎల్లప్పుడూ కుండీలలో కలుపు మొక్కలు, మొక్కలపై పురుగులు, తెగుళ్లు ఆశించకుండా చూడాలి. కుండీలను గాలిసొకే విధంగా ఒకదానికొకటి ఎడంగా ఉండేటట్లు అమర్చాలి. ఇలాంటి ఆలోచనలు ముందుకు తీసుకుపోవడంలోనే మనందరి భవిష్యత్తు, శ్రేయస్సు, మనుగడ ముడిపడి ఉన్నాయంటున్న రఘోత్తమరెడ్డి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

గాలి, నీరు, మట్టి, శబ్దం, తినే ఆహారం అన్నీ కలుషితమైపోతున్నాయి. సమస్త ప్రాణకోటికి ముప్పు వాటిల్లుతోంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు సర్వసాధారణమయిపోయాయి. ఇటువంటి తరుణంలో రఘోత్తమ్ రూఫ్ గార్డెన్ ల ప్రత్యామ్నాయాన్ని ఎంతో సృజనాత్మకంగా ఆవిష్కరిస్తున్నారు.ఈ పరిస్థితుల్లో నగర ప్రాంతాల్లోని ప్రజలు ఇటువంటి రూఫ్ గార్డెన్ వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతో ఉంది.
వివరాలకు ఫోన్‌ నెంబర్‌ 9000184107

Show Full Article
Print Article
Next Story
More Stories