రియల్‌ మోత.. ప్రజలకు తప్పదా వాత?

రియల్‌ మోత.. ప్రజలకు తప్పదా వాత?
x
Highlights

హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్ బూమ్‌. చుక్కలు తాకుతోంది ల్యాండ్ రేటు. ఒకవైపు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పుంజుకుంటోందని వ్యాపారులు సంతోషిస్తుంటే, మరోవైపు...

హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్ బూమ్‌. చుక్కలు తాకుతోంది ల్యాండ్ రేటు. ఒకవైపు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పుంజుకుంటోందని వ్యాపారులు సంతోషిస్తుంటే, మరోవైపు సామాన్యులకు అందకుండా రేట్లు పెరుగుతాయేమోనని కామన్‌ మ్యాన్ టెన్షన్ పడుతున్నాడు. ఇంతకీ సడన్‌గా భాగ్యనగరంలో రియల్‌ ఎస్టేట్ పుంజుకోవడానికి కారణమేంటి...బ్యాంకుల్లో నగదు కొరతకు, దీనికి ఏమైనా లింకుందా...ఉందంటున్నారు కొందరు నిపుణులు.

బ్యాంకుల్లో డబ్బులు వెయ్యాలంటే, నీరవ్ మోడీ, మాల్యాల భయం. ఇంట్లో దాచాలంటే దొంగల భయం. ప్రభుత్వం లెక్కాపత్రం అడుగుతుందేమోనని మరో భయం. మరేం చెయ్యాలి....ఇందుకోసం జనం మూడు మార్గాలు ఎంచుకున్నారు, ఒకటి ఇంట్లోనే దాచుకుని, భవిష్యత్తు అవసరాలకు వాడుకోవడం, రెండోది బంగారం కొనడం, మూడోది భూముల కొనుగోలు. వీటిలో మూడోదానివైపే జనం మొగ్గుచూపుతున్నారా...క్యాషంతా పోగేసుకుని ల్యాండ్‌ కొనేస్తున్నారా....మార్కెట్‌ రేటుకు, బహిరంగ మార్కెట్‌ రేటుకు మధ్య వ్యత్యాసంలో బ్లాక్‌మనీ చొరబడుతోందా?

హెచ్ఎండీఏ ప్లాట్ల వేలంలో అనూహ్య స్పందన రావడంతో అనేక చోట్ల, మార్కెట్ రేట్ల కంటే రెండు మూడు రెట్ల ధరలు పెంచి ఈ-వేలం వేయడంతో ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది వేలంలో పాల్గొన్నారు. దీంతో పదివేలు..ఇరవై వేలుగా ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ విలువ ఉన్న స్థలాలు, అమాంతం నాలుగైదు రెట్లు పెరిగాయి. ఈ-వేలమే ఇలా ఉంటే, ఓపెన్‌ మార్కెట్‌లో వేలంవెర్రిగా దళారులు పెంచే రేట్లు ఏ రేంజ్‌లో ఉంటాయి...మరి ప్రభుత్వానికి చెప్పని ఈ లెక్కామొత్తం బ్లాక్‌మనీగా మారుతోందా...నల్లధనం కట్టడికి ఎన్ని చట్టాలు తెచ్చినా, తమదైన మార్గాల్లో వైట్‌మనీగా కొందరు అక్రమార్కులు మార్చుకుంటున్నారా?

రియల్‌ ఎస్టేట్‌లో బ్లాక్‌మనీ విషయం పక్కనపెడితే, హైదరాబాద్‌లో భూముల రేట్లు పెరగడానికి, అనేక సానుకూలాంశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. భాగ్యనగరంలో పెట్టుబడి పెడితే, భవిష్యత్తులో పదింతల వృద్ది ఖాయమన్న నమ్మకం, వినియోగదారులకు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని అంటున్నారు.. అయితే రియల్‌ ఎస్టేట్‌లో బ్లాక్‌మనీ కట్టడి చేయడానికి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి...ప్రభుత్వమే స్థలాల రేట్లు నిర్ణయించి, పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు తీసుకోలేదా?

Show Full Article
Print Article
Next Story
More Stories