logo

రైతుబంధు... ఎంతమందికి ఆపద్బంధు

రైతుబంధు... ఎంతమందికి ఆపద్బంధు

రైతే రాజు అంటోంది టిఆరెస్.. పెట్టుబడి లేక వ్యవసాయం చేయలేని రైతుల పాలిట వరంగా మారే రైతు బంధు పథకాన్ని ప్రారంభించబోతోంది తెలంగాణ ప్రభుత్వం.. రెండు విడతలుగా ఎకరాకు నాలుగు వేలు చొప్పున అందే ఈ సాయంతో రైతు సమస్యలు తీరతాయా? వ్యవసాయం మళ్లీ పండగలా మారబోతోందా? తెలంగాణ రైతన్నకు శుభవార్త అందిస్తోంది టిఆరెస్ ప్రభుత్వం. రైతుకు ముందస్తు పెట్టుబడి సమకూర్చడం ప్రపంచంలోనే మొదటి ప్రయత్నమని కేసిఆర్ అంటున్నారు.. వ్యవసాయ రంగంలో ఇది చరిత్రాత్మక మలుపని టిఆరెస్ శ్రేణులు చెబుతున్నాయి. పొలం ఉన్నా.. వ్యవసాయం చేసే ఆర్థిక స్థోమత లేని రైతులకు ఈ పథకం వరంలా మారనుంది. ఈనెల10వ తేదీన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని ధర్మరాజు పల్లి నుంచి ఈ పథకానికి శ్రీకారం చుడుతున్నారు.. మండలంలోని ఇందిరానగర్ శివారులో జరిగే సభలో ముఖ్యమంత్రి కేసిఆర్ చేతుల మీదుగా ఈ గ్రామరైతులు మొదట పట్టాదార్ పాస్ పుస్తకాలు, పెట్టుబడి సాయం చెక్ లను అందుకోనున్నారు.

భూ రికార్డుల ప్రక్షాళనలో నూటికి నూరు శాతం ధర్మరాజు పల్లి భూ సమస్యలే లేని గ్రామంగా గుర్తింపు పొందింది.అందువల్ల ఈ గ్రామం నుంచే రైతు బంధు పథకం అమలు చేయాలని నిర్ణయించారు. పంట పెట్టుబడి సాయం కింద ఏడాదికి రెండు విడతలలో ఎకరానికి ఎనిమిది వేల రూపాయల పంట సాయాన్ని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.దీనివల్ల యాసంగిలోనూ రైతులందరికీ పెట్టుబడి సొమ్ము అందుతుంది. మండలం యూనిట్ గా వారం రోజులపాటూ చెక్కుల పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పథకం ద్వారా నేరుగా రైతు చేతికే చెక్కు అందుతుంది. కుటుంబ సభ్యులు మధ్యవర్తులకు కూడా చెక్ ఇవ్వరు.ఒకవేళ రైతు అనారోగ్యంతో ఉంటే సంబంధిత అధికారి నేరుగా ఇంటికే వెళ్లి రైతుకు ఆ చెక్కును అందిస్తారు. అలాగే పట్టాదార్ పాస్ పుస్తకాలు లేని వారికి ఆధార్ కార్డును తప్పనిసరి చేశారు. ఆధార్ కార్డు జెరాక్స్ కాపీ ఇస్తే వారికి చెక్కును ఇస్తారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా దాదాపు1.43 కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయం అందుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 58.34 లక్షల మందికి చెక్కులు అందిస్తారు.

భూ రికార్డుల ప్రక్షాళన సమయంలోనే గ్రామాలకు వచ్చిన రెవిన్యూ బృందాలకు రైతులు తమ ఆధార్ కార్డు కాపీలు అందచేశారు. అయితే కొంతమంది కి సాంకేతిక కారణాల వల్ల ఆధార్ సీడింగ్ జరగలేదు.. అలా జరగని వారి ఫొటోలు వారి ఖాతాకు లింక్ కాలేదు.. అందుకే వారికి ఆధార్ జెరాక్స్ అందిస్తే చెక్కు అందచేసేలా నిర్ణయం తీసుకున్నారు.ఇప్పటికే పాస్ పుస్తకాలను జిల్లాలనుంచి మండలాలకు చేర్చారు. మొత్తం ఆరుగురు సభ్యులున్న బృందం రైతుల వివరాలు సరిచూసుకుని పాస్ పుస్తకం, చెక్కును ఒక కవర్లో ఉంచి వారికి అందిస్తారు. రైతు బంధు పథకం ప్రారంభానికన్నా ముందే టిఆరెస్ ప్రభుత్వం రైతుల్లో అవగాహన కల్పిస్తోంది. రైతుకు ఆర్థిక భరోసా కల్పించే ఈ పథకంతో సమస్యలన్నీ తీరిపోతాయా? వందల ఎకరాల్లో సాగు చేసే రైతులకు లాభసాటిగా మారే ఈ పథకం చిన్న, సన్న కారు రైతులకు ఉపయోగపడుతుందా? రైతు బంధుతో రైతు ఆత్మహత్యలు ఆగుతాయా? పంట దిగుబడి పెరుగుతుందా? పంటకు పెట్టుబడి సాయం చేస్తే సమస్యలన్నీ తీరిపోతాయా?

santosh

santosh

Our Contributor help bring you the latest article around you


లైవ్ టీవి

Share it
Top