రైతుకు పట్టాభిషేకం... ఇదీ రైతుబంధు లక్ష్యం

రైతుకు పట్టాభిషేకం... ఇదీ రైతుబంధు లక్ష్యం
x
Highlights

కేసీఆర్ కలల పథకం. గులాబీ సారథి మదిలో మెదిలిన అపూర్వ ఆలోచనకు ఆచరణ రూపం. తెలంగాణ చరిత్రలోనే కాదు, భారతదేశ రైతాంగ చరిత్రలోనే అపూర్వఘట్టమని చెప్పుకోదగ్గ...

కేసీఆర్ కలల పథకం. గులాబీ సారథి మదిలో మెదిలిన అపూర్వ ఆలోచనకు ఆచరణ రూపం. తెలంగాణ చరిత్రలోనే కాదు, భారతదేశ రైతాంగ చరిత్రలోనే అపూర్వఘట్టమని చెప్పుకోదగ్గ ప్రస్థానం. కోటి ఎకరాల మాగాణం దిశగా ప్రయాణం. పెట్టుబడి ఇబ్బందులతో విసిగివేసారుతూ, కష్టాల సేద్యంతో అల్లాడిపోతున్న రైతన్నలకు వరం. అవును. అది రైతు బంధు పథకం. అన్నదాతలకు ఆర్థిక భరోసానిచ్చే అద్భుతమైన పథకం. రెండేళ్లుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పంటకు సాయమందించే కార్యక్రమం. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ పథకం ప్రారంభోత్సవానికి సర్వంసిద్దమైంది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌ మండలం ధర్మరాజుపల్లిలో ఈ బృహత్తర పథకం పట్టాలెక్కుతోంది. మరి నిజంగా రైతు బంధు, కర్షకులను పెట్టుబడి కష్టాల నుంచి గట్టెక్కిస్తుందా?

వానాకాలం రాగానే, అన్నదాత దుక్కిదున్ని నేలను సిద్దం చేసుకుంటాడు. కానీ విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులకు మాత్రం చేతిలో చిల్లిగవ్వ ఉండదు. ఆస్తులు తనఖాపెట్టో, భార్య పుస్తెలు తాకట్టుపెట్టో, పెట్టుబడి తెచ్చుకుంటాడు. ఈ అప్పులు తీర్చలేక ఒక్కోసారి ఉరికొయ్యకు వేలాడతాడు. పురుగుల మందులు తాగి ప్రాణాలు తీసుకుంటాడు. పెట్టుబడి కోసం ఇన్ని కష్టాలుపడుతున్న అన్నదాతను ఆదుకునేందుకు, రైతు బంధు పథకాన్ని తెచ్చామంటోంది కేసీఆర్ ప్రభుత్వం. ఇక అప్పుల తిప్పలు, రుణాల భారాలు ఉండవని భరోసా ఇస్తోంది.

దాదాపు లక్ష మంది ఆదివాసీ గిరిజన రైతులకు కూడా ఈ సాయం లభిస్తుంది. రైతు బంధు పథకం ద్వారా రైతులకు అందించనున్న నిధులను బ్యాంకుల్లో సిద్ధంగా ఉంచినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన చెక్కులను బ్యాంకుల ద్వారా వెంటనే నగదుగా మార్చుకోవడానికి ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించారు. మే ఒకటో తేదీ నాటికి రాష్ట్రంలోని వివిధ బ్యాంకుల్లో ఉన్న నగదు రూ.4,114.62 కోట్లు. మరో రూ.2 వేల కోట్ల నగదును ఈ గత రెండు, మూడురోజుల్లోనే ఆర్బీఐ, బ్యాంకులకు చేర్చినట్టు తెలుస్తోంది.

ఎస్‌బీఐ, తెలంగాణ గ్రామీణ బ్యాంకు, గ్రామీణ వికాస్‌ బ్యాంకు, కెనరా బ్యాంకు, ఐఓబీ, కార్పొరేషన్‌ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకు, సిండికేట్‌ బ్యాంకుల్లో నగదు అందుబాటులో ఉంటుందని, ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రైతుల కోసం సిద్ధంగా ఉంచిన డబ్బును బ్యాంకర్లు ఇతర అవసరాలకు ఎట్టి పరిస్థితుల్లో వాడొద్దని, బ్యాంకులకు సీఎం ఇప్పటికే స్పష్టంచేశారని వెల్లడించారు. ఈ చెక్కులను మూడు నెలల్లో ప్రభుత్వం సూచించిన బ్యాంకుల్లో డ్రా చేసుకోవచ్చు. సకాలంలో చెక్కులు తీసుకోలేనివారు ఆయా ఎమ్మార్వో కార్యాలయాల్లో తీసుకోవచ్చు.

ఆధార్‌ కార్డు అనుసంధానం చేసిన 52 లక్షల 72 వేల 779 మందికి చెక్కులు, పాస్‌ పుస్తకాలు పంపిణీ చేస్తారు. ఎండలు తీవ్రంగా ఉండడం వల్ల పంపిణీ కార్యక్రమాన్ని ఉదయం 7 గంటల నుంచి 11 గంటల మధ్య, సాయంత్రం 5–7.30 గంటల మధ్య నిర్వహిస్తారు. రైతుకు ముందస్తు పెట్టుబడి సమకూర్చడం ప్రపంచంలోనే మొదటి ప్రయత్నమని కేసిఆర్ అంటున్నారు. వ్యవసాయ రంగంలో ఇది చరిత్రాత్మక మలుపని టిఆర్‌ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. పొలం ఉన్నా.. వ్యవసాయం చేసే ఆర్థిక స్థోమత లేని రైతులకు ఈ పథకం వరంలా మారనుందని అంటున్నాయి.

మొత్తానికి రైతు బంధు పథకం, ప్రారంభోత్సవాన్ని ఒక పండగలా నిర్వహించాలనుకుంటోంది కేసీఆర్ ప్రభుత్వం. దేశం దృష్టిని ఆకర్షించేలా ఈ విప్లవాత్మక పథకానికి అంకురార్పణ చేస్తామంటోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories