ప్రచార ఆర్భాటంగా హామీల వరాల జల్లులు..మరీ గెలిస్తే హామీలు నేరవేరుస్తారో లేదో?

ప్రచార ఆర్భాటంగా హామీల వరాల జల్లులు..మరీ గెలిస్తే హామీలు నేరవేరుస్తారో లేదో?
x
Highlights

ఓట్ల కోసం వేలం పాటలా హామీల వర్షం కురిపిస్తున్నాయి ప్రధాన రాజకీయ పార్టీలు. అధికార సింహాసనమే పరమావధిగా, పోటాపోటీగా ఆకాశానికి నిచ్చెనలేసేస్తున్నాయి....

ఓట్ల కోసం వేలం పాటలా హామీల వర్షం కురిపిస్తున్నాయి ప్రధాన రాజకీయ పార్టీలు. అధికార సింహాసనమే పరమావధిగా, పోటాపోటీగా ఆకాశానికి నిచ్చెనలేసేస్తున్నాయి. వాగ్దానాల అమలు, ఆదాయ-వ్యయాలేవీ లెక్కలోకి తీసుకుండా, మేనిఫెస్టోల్లో వరాలు కురిపిస్తున్నాయి. మరి ఓటర్లు, ఆకర్షణ వలలో చిక్కుతారా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా, ప్రధాన పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నాయి. మేనిఫెస్టోల్లో పథకాల పంట పండిస్తున్నాయి. చావోరేవో అన్నట్టుగా, పోటాపోటీగా వాగ్దానాలు చేస్తున్నాయి.
రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్న రైతులను ప్రసన్నం చేసుకునేందుకు, అటు ప్రజాకూటమి, ఇటు టీఆర్ఎస్‌ మేనిఫెస్టోల్లో అత్యధిక ప్రాధాన్యమిచ్చాయి. అధికారంలోకి వస్తే, రైతులకు ఒకే దఫాలో రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రజాకూటమి ప్రకటిస్తే, లక్ష మాఫీ చేస్తామని టీఆర్ఎస్‌ వాగ్దానమిచ్చింది. రైతుబంధు కింద ఏడాదికి ఎకరాకు అందిస్తున్న సాయం రూ.8 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని కేసీఆర్‌ చెబితే, ప్రజాకూటమి దాదాపు అంతే ప్రకటించింది. కానీ కౌలు రైతులనూ ఇందులో చేర్చి, ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. మరి రైతాంగం ఎవరి హామీని నమ్ముతారో చూడాలి.

రుణమాఫీ, రైతు బంధు తర్వాత పార్టీలు దృష్టిపెట్టిన వర్గం, ముసలీముతక, వికలాంగులు, మరికొన్ని వర్గాల పెన్షన్లు. అన్ని రకాల ఆసరా పింఛన్లు రూ.వెయ్యి నుంచి రూ.2,016కి పెంచుతామని టీఆర్ఎస్ ప్రకటించింది. వికలాంగుల పింఛన్లు రూ.1,500 నుంచి రూ.3,016కి పెంచుతామంది. ఇక ప్రజాకూటమి మరో అడుగు ముందుకేసింది. నాలుగు వేలు పెన్షన్‌ ఇస్తామని తెలిపింది. ఇంట్లో ఎందరున్నా ఇస్తామని తెలిపింది. నిరుద్యోగులకు నెలకు రూ.3000 చొప్పున భృతిని అమలు చేస్తామని టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ రెండూ ప్రకటించాయి. అయితే అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే లక్ష ఉద్యోగాల భర్తీ ప్రజాకూటమి ప్రకటించింది. 25 వేల డీఎస్సీ పోస్టులు భర్తీ చేస్తామని తెలిపింది.

ఇదే సమయంలో, ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వయసును 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచుతుతామని, మేనిఫెస్టోలో తెలిపింది టీఆర్ఎస్. దీనికి సమాంతరంగా నిరుద్యోగులకు ఎక్కువ అవకాశాలు కల్పించడం కోసం ఉద్యోగాల నియామకాల్లో గరిష్ఠ వయోపరిమితిని మూడేళ్లకు పెంచనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులకు సబబైన, సముచితమైన రీతిలో వేతన సవరణ. పింఛనర్ల కోసం ప్రత్యేక డైరెక్టరేట్‌ ఏర్పాటు. ప్రజాకూటమి కూడా ఉద్యోగులకు అనేక హామీలిచ్చింది. ఉద్యోగులకు పాత పింఛను విధానం అమలు చేస్తామంది. ప్రజల సొంతింటి కలను, ఓట్లు రాల్చే కార్యక్రమంగా మలచుకునేందుకు ప్రధాన పార్టీలు ప్రణాళిక వేశాయి. ప్రస్తుత పద్ధతిలో రెండు పడకగదుల నిర్మాణం కొనసాగిస్తూనే, సొంత స్థలం ఉన్న అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షల నుంచి రూ. 6 లక్షలు అందిస్తామని టీఆర్ఎస్ ప్రకటించింది. అయితే, సొంత స్థలం ఉంటే ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల గ్రాంటు, ఇందిరమ్మ లబ్ధిదారులు అదనపు గది వేసుకోవడానికి రూ.2 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ కూటమి. ఎస్సీ, ఎస్టీలకు ఆరు లక్షలు ఉచితమని తెలిపింది. మరి జనం ఎవరి హామీ నమ్ముతారో చూడాలి.

మహిళలకు అన్ని పార్టీలూ వరాలు కురిపిస్తున్నాయి. తెల్లకవారు ఉన్నవారికి ఏడాదికి ఆరు గ్యాస్‌ సిలిండర్లను ఉచితంగా ప్రకటిస్తామంది కాంగ్రెస్ కూటమి. అలాగే డ్వాక్రా గ్రూపులకు 50 వేల వరకు రుణమాఫీ చేస్తామని తెలిపింది. ప్రతి గ్రూప్‌కూ లక్ష వరకూ గ్రాంట్‌ ఇస్తామంది. ఇవేకాదు, మరెన్నో సంక్షేమ పథకాల హామీలు కురిపిస్తున్నాయి. పోటాపోటీగా ఆకర్షణీయ హామీలు గుప్పిస్తున్నాయి టీఆర్ఎస్, ప్రజాకూటమి. వాటి సాధ్యాసాధ్యాలు, రాష్ట్ర ఆదాయ వ్యయాలను మాత్రం, పరిగణలోకి తీసుకోవడం లేదు. ఇప్పటికి గట్టెక్కితే చాలన్నట్టుగా, వాగ్దానాల వర్షం కురిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories