స్వామి వర్సెస్ జేసీ బ్రదర్స్... ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు...ఎక్కడి నుంచి పోటీకి...

స్వామి వర్సెస్ జేసీ బ్రదర్స్... ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు...ఎక్కడి నుంచి పోటీకి...
x
Highlights

ప్రబోధానంద స్వామి రాజకీయ ప్రకటన ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. నిన్నటి దాకా ఖాకీ వర్సెస్ జేసీ అన్నట్టు సాగిన రాజకీయం ఇప్పుడు స్వామి వర్సెస్ జేసీ...

ప్రబోధానంద స్వామి రాజకీయ ప్రకటన ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. నిన్నటి దాకా ఖాకీ వర్సెస్ జేసీ అన్నట్టు సాగిన రాజకీయం ఇప్పుడు స్వామి వర్సెస్ జేసీ బ్రదర్స్ అన్నట్టు మలుపు తిరిగింది. జేసీ సోదరులు కుట్ర పూరితంగా తమ ఆశ్రమంపై దాడి చేశారని ఆరోపిస్తూ స్వామి ఓ వీడియో విడుదల చేశారు. ఇక తానే స్వయంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. అయితే, ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు..? ఎక్కడి నుంచి పోటీకి దిగుతారన్న దాన్నది జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఇక ప్రబోధానంద స్వామి కూడా రాజకీయాల్లోకి వచ్చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అనంతపురం జిల్లాలోని చిన పొలిమెడ గ్రామంలో వినాయక నిమజ్జనం సందర్భంగా వివాదం ప్రబోధానందను రాజకీయాల వైపు మళ్లించింది. దీనికంతటికీ కారణమేంటి..? ప్రబోధానంతను ఆ దిశగా అడుగులు వేయించడానికి కారకులెవరు? జేసీ బ్రదర్సేనా.. లేక పోలీసులా. నిమజ్జన రోజు వివాదానికి మాత్రం పోలీసులే కారణమని స్వామీజీ చెబుతున్నారు. జేసీ సోదరుల ప్రోద్బలంతో ఊరేగింపును ఆశ్రమం ముందుకు తీసుకొచ్చి తమ శిష్యులపై దాడికి దిగారని, దీంతో రక్షణ కోసం తమ వారు కూడా దాడి చేశారని చెప్పారు. కావాలని తాము ఎవరిపైనా దాడి చేయలేదని ప్రబోధానంద చెప్పారు.

అక్రమాలకు పాల్పడితే ఆశ్రమంలో సీసీ కెమెరాలు ఎందుకు ఏర్పాటు చేస్తామన్న ప్రబోధానంద మొత్తం 64 సీసీ కెమెరాలు ఆశ్రమంలో ఉన్నాయని చెప్పారు. త్రైత సిద్ధాంతం శ్రీకాకుళం, ఒడిశా, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు వరకూ వ్యాపించిందని, ఇది మీడియాకు తెలియకపోవడం విచిత్రమన్నారు. ప్రతి నెలా 10వేల మంది తక్కువ కాకుండా వచ్చి జ్ఞానాన్ని పొందుతున్నారని, ఇక్కడ చెడు జరుగుతుంటే ఇంతమంది ఎందుకొస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఏదైనా అక్రమాలు, అసాంఘిక కార్యక్రమాలు జరిగే ప్రభుత్వం, ఇంటెలిజెన్స్ విభాగం చర్యలు తీసుకుంటుంది కదా, ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారాయన.

1993లో జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బరిలో ఉంటే బయట నుంచి 300 మంది కార్యకర్తలు తాడిపత్రి వస్తే ఆశ్రమంలో వారికి ఆశ్రయం కల్పించామన్నారు. జేసీ బ్రదర్స్‌కి బయపడి ఎవరూ వారికి నీరు, ఆహారం కూడా ఇవ్వలేదని, మేము ఇచ్చామన్న కోపంతో జేసీ బ్రదర్స్‌ మాపై కక్ష గట్టారని చెప్పారు ప్రబోధానంద. అప్పట్లో ఊరు విడిచి కర్ణాటక ప్రాంతానికి కూడా వెళ్లమని, ఆ తర్వాత 2003లో తిరిగి ఆశ్రమాన్ని ప్రారంభించామని, జేసీ దివాకర్‌రెడ్డిని పిలిచి కృష్ణమందిరం ప్రారంభించామని గుర్తు చేశారు. అయితే, కొంత డబ్బులు ఆశించారని, వారి వద్దకు వెళ్లి చేతులు కట్టుకుని నిలబడాలని ఆంక్షలు పెట్టారని, అందుకు వ్యతిరేకించడంతో ఎన్నో వేధింపులకు గురిచేశారని చెప్పారు ప్రబోధానంద.

అధికారం, ధనం ఉందన్న అహంకారంతో జేసీ బ్రదర్స్‌ ఎవరినైనా ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని, నేనెప్పుడైనా ఎవరినైనా దూషించానా అని ప్రశ్నించారు ప్రబోధానంద. తాను ఎందరినో ఆదరించి కులాంతర వివాహాలు జరిపించినట్టు చెప్పారు. అలాగే. తాను దేవుళ్లను దూషించినట్టు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయమే పరిష్కారమని భావిస్తున్న ప్రబోధానంద.. ఎన్నికల్లో పోటీకి సిద్ధమైపోయారు. మరి ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా? లేక ఎవరికైనా మద్దతిస్తా అన్నది వేచి చూడాలి. మొత్తానికి ప్రబోధానంద ప్రకటనతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories