తిరుమల చుట్టూఈ రాజకీయమేంటి... కోస్తా కర్ణాటక వ్యూహమేంటి?

తిరుమల చుట్టూఈ రాజకీయమేంటి... కోస్తా కర్ణాటక వ్యూహమేంటి?
x
Highlights

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి సాక్షిగా, రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తిరుమల వేదికగా పొలిటికల్‌ హీట్‌ పెరుగుతోంది. రమణదీక్షితులు ఆరోపణలు, వాటి వెనక...

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి సాక్షిగా, రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తిరుమల వేదికగా పొలిటికల్‌ హీట్‌ పెరుగుతోంది. రమణదీక్షితులు ఆరోపణలు, వాటి వెనక బీజేపీ ఉందన్న టీడీపీ ప్రత్యారోపణలు, సీబీఐ ఎంక్వయిరీ వేయాలన్న డిమాండ్లతో, గోవిందుడి పుణ్యక్షేత్రం రగులుతోంది. ఈ రాజకీయం మరో మలుపు తిరిగేట్టుగా, టీడీపీ మరో ఆరోపణ చేసింది. కోస్టల్‌ కర్ణాటక వ్యూహాన్ని, ఏపీలో అమలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న ఆ ఆరోపణ, ఆసక్తిగా మారింది. దీనికి బలం చేకూర్చేవిధంగా, ఆదివారం వీహెచ్‌పీ ఆధ్వర్యంలో స్వామిజీలు సమావేశం కావడం, తిరుమల అపచారాలపై ఉద్యమం చేస్తామనడం వివాదాన్ని పరాకాష్టకు చేరుస్తోంది.

గోవిందుడు అందరి వాడు. కానీ కొందరిపరం చేసేందుకు కుట్ర జరుగుతోందన్నది బీజేపీ ఆరోపణ. ఆభరణాలు చోరీ చేశారని, స్వామి కైంకర్యాల్లో అపచారం జరిగిందని, ఇలా ఎన్నో విమర్శలు. అటు టీడీపీ కూడా కూడా స్ట్రాంగ్‌గా రియాక్ట్‌ అవుతోంది. యాదృచ్చికం ఏమోకానీ, తెలుగుదేశం, బీజేపీ మధ్య ఎప్పుడైతే విభేదాలు మొదలయ్యాయో, అప్పటి నుంచి గోవిందుడి పుణ్యక్షేత్రంలో వివాదాలు రగడ మొదలైంది. ఒకదాని తర్వాత ఒకటి, రోజుకో గొడవ, ఒక పరిణామ క్రమం అన్నట్టుగా తన పరిధిని పెంచుకుంటూపోతోంది.మొదట, టీటీడీ నూతన పాలక మండలి నియామకం వివాదాలకు కేంద్రబిందువైంది. ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్ క్రైస్తవుడన్న విషయం పెనుదుమారం రేపింది.

ఈ గొడవ చల్లారకముందే, పాలక మండలిలో సభ్యురాలు పాయకరావు పేట ఎమ్మెల్యే అనిత వ్యాఖ్యలు కలకలం రేపాయి.
తాను క్రిస్టియన్‌ అని స్వయంగా ఆమె చెప్పుకోవడం వివాదమైది. చంద్రబాబు ప్రభుత్వం ఇతర మతస్తులని పాలకమండలిలో నియమిస్తోందని, బేజేపీ సహా అనేక హిందూ ధార్మిక సంస్థలు విమర్శలు చేయడం సంచలనమయ్యాయి. ఇక తాజాగా, తిరుమల ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు ఆరోపణలు, తిరుమల గిరుల నుంచి హస్తిన వరకు కలకలం రేపాయి. నిక్షేపాల కోసం శ్రీవారి పోటులో కొందరు తవ్వకాలు జరిపారని, గులాబీ వజ్రం అదృశ్యమైందంటూ, చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు చేసి, తిరుమల గిరులను మండించారు రమణదీక్షితులు.

స్వామిజీలు సమావేశం కావడం, హిందూ ధర్మం, ఆలయాలు, సేవ వంటి విషయాలపై చర్చించడం మామూలే. విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో ధర్మాచార్యులు భేటి కావడం కూడా గతం నుంచి జరుగుతున్నదే. కానీ ఈ సమావేశం మాత్రం కాస్త ప్రత్యేకమన్నది వినిపిస్తున్న మాట. ఎందుకంటే, తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీవారి ఆభరణాల మాయం, రమణదీక్షితుల ఆరోపణల నేపథ్యంలో, ఈ మీటింగ్‌ జరిగిందని తెలుస్తోంది. అంటే వీరి ప్రధాన అజెండా, తిరుమల.
ఆభరణాల మాయం, పాలకమండి నియామకాలు, శ్రీవారికి కైంకర్యాల్లో అపచరాలపై ఏపీలో జిల్లాజిల్లా తిరిగి, ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రణాళికలు రచిస్తారని తెలుస్తోంది. స్థూలంగా జూన్ 9 డిక్లరేషన్‌ సారాంశమిదేనని అర్థమవుతోంది.

అయితే స్వామిజీల సమావేశం వెనక, పెద్ద వ్యూహమే ఉందన్నది తెలుగుదేశం నేతల అనుమానం. ఎందుకంటే, వీహెచ్‌పీ బీజేపీకి వెన్నుదన్నుగా నిలిచే సంస్థ. తిరుమలలో తాజా పరిణామాల వెనక బీజేపీ ఉందని ఆరోపిస్తున్న తెలుగుదేశం, తదుపరి వ్యూహంలో భాగంగానే, స్వామిజీలనూ రంగంలోకి దింపుతోందని, వీహెచ్‌పీతో ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహించి, క్షేత్రస్థాయిలో ఒక భిన్నమైన వాతావరణానికి వేదిక కల్పిస్తోందని ఆరోపిస్తోంది. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్‌లో, కోస్తా కర్ణాటకలో అమలు చేసిన వ్యూహాన్ని, పక్కాగా బీజేపీ దించేస్తోందనడానికి, జరుగుతున్న పరిణామాలే నిదర్శనమని, టీడీపీ వర్గాలు ఆరోపించడం సరికొత్త చర్చకు దారి తీస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories