మహా యుద్ధం సమీపిస్తోంది. ఎన్నికల రణక్షేత్రంలో విజేతలెవరో పరాజితులెవరో తేలిపోయే సమయం వచ్చేసింది. మరి ఎన్నికల యుద్ధంపై రాష్ట్రం ఏమంటోంది? మారే లెక్కలు...
మహా యుద్ధం సమీపిస్తోంది. ఎన్నికల రణక్షేత్రంలో విజేతలెవరో పరాజితులెవరో తేలిపోయే సమయం వచ్చేసింది. మరి ఎన్నికల యుద్ధంపై రాష్ట్రం ఏమంటోంది? మారే లెక్కలు జరిగే పరిణామాలు సరికొత్త సమీకరణలు. ఈ ఎన్నికల్లో ఏ ట్రెండ్‌ను సెట్ చేయబోతున్నాయి? దక్షిణ తెలంగాణలో ఉన్న నాలుగు జిల్లాల రాజకీయం ఏం చెబుతోంది? తెలంగాణలో మహా ఎన్నికలు జరగబోతున్నాయి. ఎవరెక్కడ గెలుస్తారు? ఎవరెక్కడ ఆధిక్యంలో ఉన్నారు? ఏ ప్రాంతంలో మూడ్ ఎలా మారుతోంది ఆధిక్యం ఎవరిది? ఆధిపత్యం ఎవరిది? తీరిన ఆశల మాటేమిటి..? గల్లంతైన ఆశలెవరివి? దక్షిణ తెలంగాణలో ఉన్న రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో పట్టు దక్కేదెవరికి? పట్టు సడలించేదెవరు?
తెలంగాణలో ఏ మూలను వదిలకుండా ఏ వీధిని వీడకుండా కీలకంగా, ప్రతిష్ఠాత్మకంగా భావించే దక్షిణా తెలంగాణలో పట్టెవరికి? నల్లగొండ, మెదక్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి ఈ నాలుగు జిల్లాల్లో ఉన్న నియోజకవర్గాల్లో అంచనాలు ఎలా ఉన్నాయి? ప్రజల నాడి ఏమంటోంది? ఆధిపత్యం ఎవరిదో ఆశలు గల్లంతెవరికో పాలకు పాలు.. నీళ్లకు నీళ్లులా తేటతెల్లమయ్యే సమయం ఆసన్నమైన వేళ తెలంగాణ రాజకీయంగా ఉడుకుతోంది. 2014 ఎన్నికల్లో అలవోకగా నెగ్గిన నియోజకవర్గాల్లో ఇప్పుడు హోరాహోరి పోరు నెలకొంది. మరి అస్త్రశస్త్రాలు లేకుండా మాటే ఆయుధాలుగా, ప్రసంగాలే అస్త్రాలుగా సాగుతున్న హోరాహోరి ఎన్నికల యుద్దంలో ప్రజలు ఏమనుకుంటున్నా పార్టీల అంచనాలు మాత్రం ఆకాశంలో ఉన్నాయి.
దక్షిణ తెలంగాణపై పట్టు కోసం పార్టీలన్నీ వ్యూహాలు రచిస్తున్నాయి. పట్టు జారకుండా ఒకరు ఉనికి కోసం ఇంకొకరు వైభవం కోసం మరొకరు ఇలా సౌత్‌లో సత్తా చాటేందుకు నాయకులు పెద్ద ఎత్తుగడే వేస్తున్నారు. ప్రభావం చూపించే అభ్యర్థుల అంచనాలను బేరీజు వేసుకుంటూ పట్టు సడలకుండా ఉండేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు ఓట్లను ఒడిసిపట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు.తెలంగాణ ఎన్నికల బరిలో విజయం కోసం పార్టీలు నువ్వా-నేనా అన్నట్టుగా తలపడుతున్నాయి. సుడిగాలి పర్యటనలతో మాటలే అస్త్రాలుగా అగ్ర నేతలు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. భారీ సభల్లో ప్రసంగిస్తూ ఓటరును ప్రసన్నం చేసుకునేందుకు చెమటొడుస్తున్నారు. దక్షిణ తెలంగాణలో ఉన్న నల్లగొండ, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఈ నాలుగు జిల్లాల్లో పట్టు సాధించి ఉనికి కాపాడుకోవాలన్నదే అన్ని పార్టీల వ్యూహం. నాయకుల లక్ష్యం.
దక్షిణ తెలంగాణలో అంతంత మాత్రంగా ఉన్న పట్టును ఈసారి మరింత పటిష్టం చేసుకోవాలన్నది టీఆర్ఎస్ వ్యూహం. కిందటిసారి ఎన్నికల కంటే మెజారిటీ స్థానాలను దక్కించుకొని అజేయంగా నిలిచి ఆధిపత్యం చూపించాలన్నది గులాబీ ఆలోచన. అదే సమయంలో కాంగ్రెస్ కూడా ఎన్నికల గేమ్ ప్లాన్‌ను అమలు చేస్తోంది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్న ప్రచారంతో ప్రజలకు చేరువై పట్టు సాధించాలన్నది హస్తం పార్టీ ఎత్తుగడ. నాలుగున్నరేళ్ల కాలంలో ప్రజల కోసం ప్రభుత్వం చేపట్టిన పథకాలే అస్త్రాలుగా కారు పార్టీ జోరు మీదుంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకునే ఆలోచనలో కాంగ్రెస్ కదంతొక్కతోంది. దక్షిణ తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 అసెంబ్లీ స్థానాలను మినహాయిస్తే ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో 41 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ నియోజకవర్గాల్లో 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచిన స్థానాలు 23. కాంగ్రెస్ 14, టీడీపీ 3, సీపీఐ ఒకచోట విజయం సాధించింది. తర్వాతి రాజకీయ పరిణామాల్లో తెలుగుదేశం నుంచి గెలిచిన ముగ్గురిలో ఇద్దరు , సీపీఐ నుంచి గెలిచిన ఒకరు, కాంగ్రెస్ నుంచి గెలిచిన వారిలో ముగ్గురు కారెక్కశారు. సెప్టెంబరు 6న అంటే శాసనసభను రద్దు వరకు దక్షిణ తెలంగాణలోని ఈ జిల్లాల్లో ఉన్న 41 స్థానాల్లో 29 స్థానాలు గులాబీ గుప్పిట్లోనే ఉన్నాయి. మహాకూటమి ఏర్పడిన తర్వాత ఎక్కువ స్థానాల్లో ఈ కూటమి అభ్యర్థులే గట్టి పోటీ ఇస్తుండటంతో ఈ సీట్లను తిరిగి దక్కించుకోవడం టీఆర్ఎస్‌కు సవాలేనంటున్నారు విశ్లేషకులు.
సౌత్ తెలంగాణలో హోరాహోరిగా...నువ్వా నేనా అన్నట్టుగా ఉంది ఎన్నికల క్షేత్రం. ఎక్కువ సీట్లు సాధించాలన్న ఎత్తుగడలో ఉన్న టీఆర్ఎస్ కూటమి అభ్యర్థుల నుంచి నెక్ టు నెక్ పోటీనే ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాలుగు జిల్లాల్లో వాస్తవ పరిస్థితులు ఏం చెబుతున్నాయో చూద్దాం.
ఉమ్మడి పాలమూరు జిల్లా. ఈ జిల్లాలో స్వతహాగా గెలిచిన, తర్వాత ఇతర పార్టీల నుంచి గెలిచి చేరిన వారి స్థానాలతో పాటు అదనంగా సీట్లు పొందడానికి ఈ జిల్లాలో మంచి అవకాశం ఉందని కారు పార్టీ భావిస్తున్నా కూటమి నుంచి నువ్వా నేనా అన్నట్లుగా పరిస్థితి మారింది.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 14 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ 7, కాంగ్రెస్ 5, టీడీపీ 2 సీట్లు దక్కించుకున్నాయి. జిల్లాలో రెండు చోట్ల త్రిముఖ పోటీ ఉండగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్న చోట టీఆర్ఎస్ మంచి పోటీ ఇస్త్తోంది. దీనికి తోడు చాల నియోజకవర్గాల్లో కమలం పార్టీ మంచి పోటీనే ఇస్తోంది. ఒక చోట మాత్రమే విజయానికి తగ్గట్టుగా పోరాడుతుంది. మిగిలిన చోట్ల బీజేపీకి పెరిగిన ఓట్లు ఎవరికి నష్టం కలిగిస్తాయన్నదే చర్చనీయాంశం.
ఇక నల్గొండ. ఈ జిల్లా కాంగ్రెస్ యోధుల సమరభూమి. గత ఎన్నికల్లో 50 శాతం సీట్లను సాధించిన టీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఇంకా ఎక్కువ సీట్లను గెల్చుకోవాలన్న పట్టుదలతో ఉంది. పోయిన సీట్లలో కొన్ని మళ్లీ కైవసం చేసుకోవాలన్నద ఆలోచన కాంగ్రెస్‌ది. పీసీసీ అధ్యక్షుడు, శాసనసభా పక్ష నేత సహా కాంగ్రెస్‌కు చెందిన ముఖ్య నాయకులంతా ఈ జిల్లాలో ఉండటంతో అభ్యర్థుల బలాబలాలను అనుసరించి గెలుపుపై అంచనాలు మొదలయ్యాయి. జిల్లాలోని 12 స్థానాల్లో టీఆర్ఎస్ 6 చోట్ల గెలిచింది. తర్వాత కాంగ్రెస్ నుంచి ఒకరు, సీపీఐ నుంచి ఒకరు కారెక్కడంతో ఆ సంకయ ఇప్పుడు ఎనిమిదికి చేరింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీజేపీ, సీపీఎం కూడా పలు నియోజకవర్గాల్లో పట్టు సాధించాయి. ఈ పార్టీలకు వచ్చే ఓట్లు ఇతర పార్టీలను దెబ్బతీసే అవకాశం ఉంది. తెలుగుదేశం, సీపీఐతో పొత్తు వల్ల ఈ జిల్లాలో కాంగ్రెస్‌కు కొంత అదనపు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. గత ఎన్నికల కంటే కాంగ్రెస్ ఒకటి,రెండు సీట్లు ఎక్కువగా పొందే అవకాశం ఉందని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఉమ్మడి మెదక్ జిల్లా. ఇది టీఆర్ఎస్‌కు కంచుకోట. ఆంధోల్ ఒక్కటి తప్పిస్తే మిగిలిన అన్ని స్థానాల్లో టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యేలున్న ఈ జిల్లాల్లో గత వైభవం కోసం కారు పార్టీ కదంతొక్కుతుంది. అటు వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పాగా వేయాలన్నది హస్తం వ్యూహం. ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలుండగా, ఇందులో పటాన్‌చెరు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉంది. మిగిలిన 9 నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్, మంత్రి హరీశ్‌రావు బరిలో ఉన్న సిద్దిపేట ఉన్నాయి. ఈ బీజేపీ, బీఎల్‌ఎప్ ఓట్లు కలసి వస్తాయన్నది టీఆర్ఎస్ ఆలోచన. ఆరు నియోజకవర్గాల్లోనూ టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ముఖాముఖి పోటీ కనిపిస్తోంది.
ఇక రంగారెడ్డి జిల్లా. సెటిలర్లు ప్రభావితం చూపించే ఈ జిల్లాలో ఉన్న నియోజకవర్గాలు 14. ఇందులో 8 స్థానాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండగా ఆరు నియోజకవర్గాలు రంగారెడ్డి గ్రామీణ జిల్లాలో ఉన్నాయి. ఇందులో అన్ని స్థానాల్లోనూ నెక్ టు నెక్ కనిపిస్తోంది. విజయం కోసం అన్ని పార్టీలు చెమటోడాల్సిన పరిస్థితులే ఉన్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఇద్దరు గెలిచినా ఒకరు టీఆర్‌ఎస్‌లో చేరడంతో అసెంబ్లీ రద్దయ్యే సమయానికి కాంగ్రెస్‌కు ఒక ఎమ్మెల్యే మాత్రమే ఉండటంతో రాజకీయ పరిణామాలు ఎటు నుంచి ఎటువైపు మళ్లుతాయన్న ఆసక్తి కనిపిస్తోంది. ప్రభుత్వ పథకాల పట్ల సానుకూలత, ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకత ఈ ఎన్నికల్లో కీలకం కానున్నాయి. ఈ రెండింటిలో ఎవరి ఆధిపత్యం వారిదే. కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఐ, టీజేఎస్ పార్టీలు ప్రజాకూటమిగా ఏర్పడిన తర్వాత ఎక్కువ స్థానాల్లో అభ్యర్థులు టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇస్తున్నారు.
అభ్యర్థుల జాతకాలు, పార్టీల తలరాతలు మార్చే ఈ ఎన్నికల మహాయుద్ధంలో అన్ని పార్టీలకు దక్షిణ తెలంగాణ దడ పుట్టిస్తుంది. హోరాహోరిగా సాగుతున్న ఎన్నికల సమరంలో అంతిమ విజేత ఎవరో తేలాలంటే ఆఖరు నిమిషం వరకు వేచి చూడాల్సిందే.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire