Top
logo

జూబ్లీహిల్స్‌లో టగ్‌ ఆఫ్‌ వార్...కీలకంగా మారిన...

X
Highlights

రాజధానిలోనే అత్యంత ధనవంతుల నియోజకవర్గం. అన్ని ప్రాంతాల ప్రజల నివాసముండే ఏరియా. అక్కడ ఓటరు తీర్పు భిన్నం....

రాజధానిలోనే అత్యంత ధనవంతుల నియోజకవర్గం. అన్ని ప్రాంతాల ప్రజల నివాసముండే ఏరియా. అక్కడ ఓటరు తీర్పు భిన్నం. అందుకే ఆ నియోజకవర్గం ఓటర్ల నాడి, తెలీక పార్టీలు తలలు పట్టుకుంటున్నాయి. ఇంతకీ ఏదా నియోజకవర్గం రేసులో ఉన్న ప్రత్యర్థులెవరు?

గ్రేటర్ హైదరాబాద్‌లో అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గాల్లో జూబ్లీహిల్స్‌ ఒకటి. సుమారు మూడు లక్షల ఓట్లు ఉన్న నియోజకవర్గంలో, పాగా వేసేందుకు ప్రధాన రాజకీయ పక్షాలు వ్యూహప్రతివ్యూహాలు వేస్తున్నాయి. అయితే, ఇక్కడి ఓటర్లు మాత్రం ఎప్పటికప్పుడు విభిన్నంగా తీర్పిస్తూ, రాజకీయ పార్టీలనే ఆశ్చర్యపరుస్తుంటారు. జూబ్లీహిల్స్‌లో ఆంధ్రా సెటిటర్లు, ఇతర రాష్ట్రాలవాళ్లు, బీసీలు, మైనారిటీలు కీలకం. ఈ వర్గాలే, ఓడేదెవరో, గెలిచేదెవరో డిసైడ్‌ చేస్తాయి.

2009 నుంచి ఓటరు తీరును పసిగట్టడంలో, విశ్లేషించడంలో పార్టీలు ఎప్పుడూ విఫలమే. 2009లో కాంగ్రెస్‌ నుంచి పి. విష్ణువర్ధన్‌రెడ్డి, టీడీపీ నుంచి మహ్మద్‌ సలీంలు తలపడ్డారు. ప్రజారాజ్యం కూడా రేసులో నిలిచింది. రాష్ట్రేతరులు, మైనారిటీలు టీడీపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని అందరూ భావించారు. అంచనాలను తారుమారు చేస్తూ, ఓటర్లు విష్ణువర్ధన్‌రెడ్డికి పట్టంకట్టారు. ఇక 2014లో బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్‌, కాంగ్రెస్‌ నుంచి విష్ణువర్ధన్‌ రెడ్డి, ఎంఐఎం నుంచి నవీన్‌యాదవ్‌లు పోటీ పడ్డారు. వైసీపీ కూడా బరిలో ఉంది. ఓటర్లు ఈసారి టీడీపీ పక్షాన నిలబడ్డారు. రెండోస్థానంలో ఎంఐఎం, కాంగ్రెస్‌ మూడోస్థానంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ తరువాత జరిగిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో మాగంటి గోపీనాథ్‌ టీఆర్‌ఎస్‌ గూటికి చేరారు.

ఈసారి సిట్టింగ్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కే టికెట్‌ ఇచ్చారు కేసీఆర్. దీంతో ఆయన ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసి, తాను చేసిన అభివృద్ధి పనులను వివరిస్తున్నారు. పార్టీ చేపట్టిన కార్యక్రమాల గురించి తెలిపి, ఓటు తనకే వేయాలని కోరుతున్నారు. పగలు పాదయాత్రలు రాత్రి కార్యకర్తల సమావేశాలు, పార్టీ కార్యాలయాలు ప్రారంభం చేస్తూ హడావిడి చేస్తున్నారు మాగంటి గోపీనాథ్‌. అయితే, మహాకూటమి నుంచి ఎవరు బరిలోకి దిగుతారన్నది ఇంకా తేలలేదు. కానీ కాంగ్రెస్‌ నుంచి పీజేఆర్‌ వారసుడు, మాజీ ఎమ్మెల్యే పి. విష్ణువర్దన్‌రెడ్డి రేసులో ఉన్నారు. గతంతో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో దాదాపు విష్ణువర్ధన్‌రెడ్డికే టికెట్‌ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో విష్ణు ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించారు. బస్తీల్లో పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. అయితే, టీడీపీ ఈ సీటు విషయంలో రాజీ పడేలా కనిపించడ లేదు. ఎంఐఎం కూడా పోటీపై ఇంకా స్పష్టతనివ్వలేదు.

మరోవైపు బీజేపీలో చేరిన స్వామి పరిపూర్ణానంద జూబ్లీహిల్స్‌ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో పోరు, మరింత రసవత్తరంగా మారడం ఖాయం. పరిపూర్ణానంద జూబ్లీహిల్స్‌ను ఎంచుకోవడం వెనక వ్యూహాత్మక ఆలోచనలున్నాయి. ఎందుకంటే, జూబ్లీహిల్స్‌లో సెటిలర్లు అధికంగా ఉన్నారు. తన ఓటు కూడా ఇక్కడే ఉంది. దీంతో జూబ్లీహిల్స్‌, సేఫ్‌ ల్యాండింగ్‌గా భావిస్తున్నారు పరిపూర్ణానంద. మొత్తానికి విలక్షణ తీర్పునిచ్చే జూబ్లీహిల్స్‌ నియోజవర్గంలో, ఈసారి పోటీ ఉత్కంఠను పెంచుతోంది. మూడు పార్టీల నుంచి బలమైన అభ్యర్థులు పోరులో ఉండటంతో, ఓటర్లు ఎవరికి పట్టంకడతారన్నది ఆసక్తిగా మారింది.

Next Story