Top
logo

విషాదాన్ని మిగిల్చిన ఆగస్టు నెల

X
Highlights

ఈ ఆగస్ట్ నెల దేశంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రెండు దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేని విధంగా అనేక మందిని మనకు...

ఈ ఆగస్ట్ నెల దేశంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రెండు దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేని విధంగా అనేక మందిని మనకు దూరం చేసింది. నిన్న మరణించిన నందమూరి హరికృష్ణే కాదు పలువురు రాజకీయ, క్రీడా, సాహితీ ప్రముఖులు ఈ నెలలోనే కన్నుమూశారు. అగస్టులో ఈ లోకాన్ని విడిచిన ప్రతి ఒక్కరూ వారివారి రంగాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.

ఈ ఆగస్టు నెలలో మొదట మరణించిన ప్రముఖుడు డీఎంకే అధినేత కరుణానిధి. ద్రవిడ రాజకీయాల్లో మేరునగధీరుడిగా ప్రసిద్ధికెక్కిన కరుణానిధి ఆగస్టు 7న 94ఏళ్ల వయసులో కన్నుమూశారు. వయసుతో పాటు వచ్చిన తీవ్ర అనారోగ్య సమస్యల కారణంగా ఆస్పత్రిలో చికిత్స సపొందుతూ మరణించారు. సుమారు 50 ఏళ్ల పాటు డీఎంకే అధినేతగా కొనసాగిన కరుణానిధి తమిళనాడుకు ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు.

కరుణానిధి మరణించిన కొద్దిరోజులకే ఆగస్టు 10న బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌‌ ఛైర్మన్‌ శేఖర్‌ బజాజ్‌ కుమారుడు, సంస్థ ఎండీ అనంత్‌ బజాజ్‌ చనిపోయారు. తీవ్ర గుండెపోటు రావడంతో 41 ఏళ్లకే ఆయన కన్నుమూశారు. 1999లో బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌లో ప్రాజెక్ట్‌ కో-ఆర్డినేటర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన అనంత్‌ బజాజ్‌ కంపెనీలో కీలక బాధ్యతలు చేపట్టేవరకూ ఎదిగారు.

ఈ ఆగస్టు 12న నోబెల్‌ సాహిత్య పురస్కార గ్రహీత వీఎస్‌. నైపాల్‌ కూడా కన్నుమూశారు. 85ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో పదమపదించారు. భారత సంతతికి చెందిన నైపాల్‌ పూర్తి పేరు విద్యాధర్‌ సూరజ్‌ ప్రసాద్‌ నైపాల్‌. ఆయనకు 2001లో నోబెల్‌ సాహిత్య పురస్కారం లభించింది. వీఎస్‌ నైపాల్‌ ‘ఎ బెండ్‌ ఇన్‌ ది రివర్‌’,‘ ది ఎంజిమా ఆఫ్‌ ఎరైవల్‌’,‘ఫైండింగ్‌ ది సెంటర్‌’ వంటి పుస్తకాలు రచించారు.

ఈ ఆగస్టులో చనిపోయిన మరో రాజకీయ ప్రముఖుడు సోమ్‌నాథ్‌ ఛటర్జీ. దేశ రాజకీయాల్లో కమ్యూనిస్టు యోధుడిగా ‌ఉత్తమ పార్లమెంటేరియన్‌గా కీర్తి ప్రతిష్ఠలు పొందిన సోమ్‌నాథ్‌ ఛటర్జీ 90 ఏళ్ళ వయసులో ఈ నెల 13న కన్నుమూశారు. 10 సార్లు లోక్‌ సభ సభ్యుడిగా పని చేసిన సోమనాథ్‌ ఛటర్జీ లోక్‌సభ స్పీకర్‌‌గా కూడా వ్యవహరించారు. సోమ్‌నాథ్‌ ఛటర్జీ అయనకు వచ్చిన తీవ్ర అనారోగ్య సమస్యలతో చనిపోయారు.

భారత మాజీ టెస్ట్‌ కెప్టెన్‌, చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ వాడేకర్‌ కూడా ఈ ఆగస్టు 15న కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబయిలోని జస్‌లోక్‌ ఆస్పత్రిలో 77 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. క్రీడా రంగంలో ఆయన ప్రతిభకు గాను భారత ప్రభుత్వం 1967లో అర్జున అవార్డు, 1972లో పద్మశ్రీలతో గౌరవించింది. సీకే నాయుడు లైఫ్ టైమ్ ఎచ్చీవ్ మెంటు పురస్కారం కూడా అజిత్‌ వాడేకర్‌ అందుకున్నారు.

ఇక ఈ ఆగస్టులో బీజేపీ రాజకీయ దిగ్గజం. మాజీ ప్రధాని అటల్‌ బిహార్‌ వాజ్‌పేయి కన్ను మూశారు. కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న బీజేపీ రాజకీయ కురువృద్ధుడు, వాజ్‌పేయి ఆగస్టు 16న తుది శ్వాస విడిచారు. 1999లో జరిగిన ఎన్నికల్లో గెలుపొంది వాజ్ పేయి ఐదేళ్ల పాటు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. భారత దేశానికి ఆయన చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 2015లో దేశ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’తో గౌరవించింది.

విజయవాడ మాజీ ఎంపీ, ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి చెన్నుపాటి విద్య ఈ ఆగస్టు 18న చనిపోయారు. చెన్నుపాటి విద్య కాంగ్రెస్‌ పార్టీ తరఫున రెండుసార్లు విజయవాడ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. చెన్నుపాటి విద్య సంఘ సంస్కర్త గోపరాజు రామచంద్రరావు : గోరా కుమార్తె. తండ్రి భావాలను పుణికి పుచ్చుకున్న మాజీ ఎంపీ విద్య వాస్తవికత, విలక్షణ వ్యక్తిత్వంతో మహిళా భ్యుదయానికి, పిల్లల సంక్షేమానికి విశేషంగా కృషి చేశారు.

ఈ నెలలో తుది శ్వాస విడిచిన మరో ప్రముఖుడు కుల్‌దీప్ నయ్యర్. ప్రముఖ జర్నలిస్ట్‌, మేధో దిగ్గజంగా గుర్తింపు పొందిన కులదీప్‌ నయ్యర్‌ ఈనెల 23న మరణించారు. 95ఏళ్ల నయ్యర్‌ అనారోగ్య సమస్యలతో ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈయన బ్రిటన్‌ మాజీ హైకమిషనర్‌గా పని చేశారు. నయ్యర్‌ బియాండ్ ‌ద లైన్స్’, ‘ఇండియా ఆఫ్టర్‌ నెహ్రూ’ వంటి ఎన్నో ప్రముఖ రచనలు చేశారు. చనిపోవడానికి కొద్ది రోజుల ముందు వరకు ప్రముఖ తెలుగు దిన పత్రికలల్లో నయ్యర్ వ్యాసాలు రాశారు.

దేశ విదేశాల్లో పేరు తెచ్చుకున్న ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్‌, నోబెల్‌ శాంతి బహుమతి పురస్కార గ్రహీత కోఫీ అన్నన్‌ కూడా ఈ నెలలోనే చనిపోయారు. 80ఏళ్ల వయసులో తీవ్ర అనారోగ్యం కారణాలతో స్విట్జర్లాండ్‌లోని ఓ ఆసుపత్రిలో ఈ నెల 18న కన్నుమూశారు. ఆఫ్రికా ఖండం నుంచి ఐక్యరాజ్య సమితికి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన మొట్టమొదటి నల్లజాతీయుడు కోఫీ అన్నన్‌. 2001లో ఆయనకు నోబెల్‌ శాంతి బహుమతి వచ్చింది.

మరో నాలుగు రోజుల్లో పుట్టిన రోజు జరుపుకోవాల్సిన నందమూరి హరికృష్ణ నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కన్ను మూశారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పడంతో డ్రైవింగ్ చేస్తున్న హరికృష్ణ సీటు బెల్టు పెట్టుకోని కారణంగా రోడ్డు పక్కన పడిపోయారు. తలకు తీవ్రంగా దెబ్బలు తగలడంతో కొద్దిసేపటికే తుది శ్వాస విడిచారు. తెలుగు భాసను అమితంగా అభిమానించే హరికృష్ణ తెలుగు భాషా దినోత్సవం రోజే చనిపోయారు.

ఈ ఆగస్టులో చనిపోయిన ప్రముఖులంతా వారి వారి రంగాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నవారే. ఈ నెల మొదటి వారంలో మనకు దూరమైన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి నుంచి నిన్న కన్నుమూసిన నందమూరి హరికృష్ణ వరకూ ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్న వారే. వీరంగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వారే.

Next Story