అరకు హత్యాకాండలో కీలకపాత్రధారి కలకలం...ఎప్పుడేం జరుగుతుందోనన్న...

అరకు హత్యాకాండలో కీలకపాత్రధారి కలకలం...ఎప్పుడేం జరుగుతుందోనన్న...
x
Highlights

దుబ్బపాలెం... తూర్పుగోదావరి జిల్లాలోని ఓ గిరిజన కుగ్రామం. చుట్టూ కొండలు మధ్యలో ప్రశాంత వాతావరణంలో ఉండే దుబ్బపాలెంలో ప్రస్తుతం అలజడి నెలకొంది. అక్కడి...

దుబ్బపాలెం... తూర్పుగోదావరి జిల్లాలోని ఓ గిరిజన కుగ్రామం. చుట్టూ కొండలు మధ్యలో ప్రశాంత వాతావరణంలో ఉండే దుబ్బపాలెంలో ప్రస్తుతం అలజడి నెలకొంది. అక్కడి గిరిజనులంతా భయం గుప్పెట్లో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఎందుకంటే అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమపై మావోయిస్టులు కాల్పులు జరిపి హతమార్చిన ఘటనలో ప్రధాన నిందితుడైన జలుమూరి శ్రీనివాస్ అలియాస్ రైనో, అలియాస్ సునీల్‌ స్వగ్రామం అది. పోలీసులు ఆ గ్రామంపై ప్రత్యేక నిఘా పెట్టడంతో ఎప్పుడేం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన దుబ్బపాలెంలో ఆందోళన నెలకొంది. అరకు ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమను హత్య చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు తమ కుమారుడని తెలియగానే శ్రీనివాస్ తల్లిదండ్రులు పుట్టెడు దు:ఖంలో మునిగిపోయారు. ఇప్పటికే ఒక కొడుకు గతంలోనే ఎన్‌కౌంటర్‌లో చనిపోగా, రెండో కొడుకు శ్రీనివాస్ కోసం ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.

నడలేని స్థితిలో ఉన్న తల్లిదండ్రులను గ్రామానికి సర్పంచ్‌గా ఉన్న మరో కుమారుడు జలుమూరి నాగేశ్వరరావు దగ్గరుండి చూసుకుంటున్నారు. తన ఇద్దరు తమ్ముళ్లూ దళంలోకి వెళ్లిపోవడంతో తల్లిదండ్రుల బాధ్యతను ఆయనే చూస్తున్నారు. అయితే, తమ సోదరుడు శ్రీనివాస్‌ను 2006లో చివరిసారిగా చూశానని, ఆ తర్వాత ఇంటికి రాలేదని శ్రీనివాస్ సోదరుడు నాగేశ్వరరావు చెబుతున్నారు. అంతకు ముందు 2015లో మరో తమ్ముడు ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడని నాగేశ్వరరావు చెప్పారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల కోసం శ్రీనివాస్ ఎక్కడున్నా ఇంటికి వచ్చేయాలని నాగేశ్వరరావు, ఆయన సోదరి కోరుతున్నారు. మొత్తానికి మావోయిస్టు అగ్రనేత శ్రీనివాస్‌ స్వగ్రామంపై పోలీసులు నిఘా పెట్టడంతో కుటుంబ సభ్యులతోపాటు, స్థానికుల్లో ఆందోళన నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories