జపాన్‌ శాస్త్రీయత మనకు పనిచేయదా? నిర్లక్ష్యం ఎక్కడుంది?

జపాన్‌ శాస్త్రీయత మనకు పనిచేయదా? నిర్లక్ష్యం ఎక్కడుంది?
x
Highlights

ప్రకృతి బీభత్సాలపై అలసత్వం ప్రజలకు పెనునష్టాన్ని మిగులుస్తున్నాయి. కొందరు సర్వస్వం కోల్పోయి రోడ్డుపై పడితే, మరికొందరు ప్రాణాలను, ఇంకొందరు కుటుంబ...

ప్రకృతి బీభత్సాలపై అలసత్వం ప్రజలకు పెనునష్టాన్ని మిగులుస్తున్నాయి. కొందరు సర్వస్వం కోల్పోయి రోడ్డుపై పడితే, మరికొందరు ప్రాణాలను, ఇంకొందరు కుటుంబ సభ్యులు, సన్నిహితులను కోల్పోవాల్సి వస్తోంది. ఏటా పంటలు చేతికి వచ్చే అక్టోబర్‌, నవంబర్‌ మాసాల్లో వరుస తుపాన్లు సంభవిస్తున్నాయి. తుపాన్లు సంభవించి కుంభవృష్టి కురిసిన తర్వాతి సంగతి అటుంచితే అసలు తుపాన్ల వల్ల భారీ నష్టం కలుగకుండా తీసుకోవాల్సిన చర్యలను మన ప్రభుత్వాలు ఇంతవరకూ పట్టించుకున్నది లేదు. గత ఐదు దశాబ్దాల చరిత్ర చూస్తే.... మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌లోనే తుపాను బీభత్సం లక్షలాది కోట్ల నష్టాన్ని సృష్టించింది.

గత వందేళ్లలో ఏపీలో 75 తుపాన్లు సంభవించగా వాటిలో అత్యధికంగా అక్టోబర్‌ నెలలోనే 30 తుపాన్లు ఏర్పడ్డాయి. నవంబర్‌ నెలలో 19 తుపాన్లు, సెప్టెంబర్‌లో ఎనిమిది, జూన్‌, డిసెంబర్‌ మాసాల్లో మూడు చొప్పున తుపాన్లు వచ్చాయన్నది వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్న నిజాలు. 2011లో జపాన్‌ను సునామీ అతలాకుతలం చేసింది. ఇక జపాన్‌ కోలుకోవడమే కష్టమని పలువురు అంచానాకు వచ్చారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ జపాన్‌ కేవలం 11 నెలల కాలంలోనే పూర్తిగా కోలుకుంది. ఎంతటి ప్రళయం వచ్చినా దానిని తట్టుకోగల శక్తిని కూడగట్టుకుంది. ఒక పెనునష్టం నుంచి జపాన్‌ ప్రభుత్వం నేర్చుకున్నంత వేగంగా మన పాలకులు గుణపాఠం నేర్వడం లేదు. సునామీ జపాన్‌కు 14.70 లక్షల కోట్ల రూపాయల ఆస్తినష్టాన్ని కలిగించింది. ఇంతటి నష్టం చవిచూసిన జపాన్‌ త్వరగానే కోలుకుంది. అంతే వేగంగా పునర్నిర్మాణ చర్యలు చేపట్టింది. అంతటితో ఆగకుండా ఎంతటి ప్రళయాన్నైనా తట్టుకునేలా సముద్రానికి అడ్డంగా భారీ కరకట్ట నిర్మించింది. తుపాను తీవ్రత కరకట్టను దాటుకునే జపాన్‌లోకి ప్రవేశిస్తుంది. అంటే తుపాన్ల బారినుంచి కట్ట ఆ దేశాన్ని రక్షిస్తోంది. మన దేశంలోని సముద్రతీర ప్రాంతాల్లో కరకట్టలు నిర్మించాలని నిపుణులు సూచించారు. ఆ సూచనలను ప్రభుత్వాలు పెడచెవిన పెట్టాయి.

ద్వీపకల్పమైన మన దేశానికి మూడు వైపులా అరేబియా సముద్రం, బంగాళాఖాతం ఉన్నాయి. వాటిలో తరచూ తుపాన్లు సంభవిస్తుంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో 982 కిలోమీటర్ల సముద్రతీర ప్రాంతం ఉంది. ఇంతటి సుదీర్ఘ సముద్రతీర ప్రాంతం వల్ల భారీగా ఆదాయం కూడా సమకూరుతోంది. అలాగే తరచూ సంభవించే తుపాన్లు భారీ నష్టాలు మిగులుస్తున్నాయి. ప్రభుత్వం కనుక మేల్కొని జపాన్‌ మాదిరిగా పటిష్టమైన కరకట్టల నిర్మాణానికి పూనుకుంటే భారీ ఆస్తినష్టం, జననష్టం నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరిచి తుపాన్ల వల్ల కలిగే నష్టనివారణకు చర్యలు చేపట్టాలి. అలాగే బాధితులను ఆదుకోవడంలో, వారికి పరిహారం అందించడంలో పిసినారి తనాన్ని ప్రదర్శించకుండా వాస్తవ నష్టాన్ని గుర్తించి ఆదుకునే చర్యలు చేపట్టాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories