జన సైనికుల జాడేది? సమర సన్నాహాలా? సైలెంట్ వ్యూహాలా?

జన సైనికుల జాడేది? సమర సన్నాహాలా? సైలెంట్ వ్యూహాలా?
x
Highlights

తెలంగాణ సమరంలో తలపడతామన్నాడు. జనసైనికులు యుద్దానికి సిద్దంగా ఉన్నారన్నాడు. తెలంగాణలో సుడిగాలి పర్యటనలు చేసి, ఇక కాస్కోండని తొడగొట్టాడు. మరిప్పుడు ఆయన...

తెలంగాణ సమరంలో తలపడతామన్నాడు. జనసైనికులు యుద్దానికి సిద్దంగా ఉన్నారన్నాడు. తెలంగాణలో సుడిగాలి పర్యటనలు చేసి, ఇక కాస్కోండని తొడగొట్టాడు. మరిప్పుడు ఆయన సైలైంటయ్యాడు. ఎన్నికల కురుక్షేత్రంలో అన్ని పార్టీలూ, అస్త్రశస్త్రాలు దూస్తుంటే, ఏపీ గట్టుమీద నిలబడి, నిశ్శబ్దంగా చూస్తున్నాడు. ముందస్తు వస్తుందని ముందే ఊహించలేదన్న జనసేనాని, ఫుల్‌ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నామంటున్నాడు. అయితే అభ్యర్థులకు మద్దతివ్వడమో, లేదంటే ఏదో ఒక పార్టీకి సపోర్ట్‌ ఇవ్వడమో, ఏదీ లేదంటూ ఎన్నికలకు దూరంగా ఉండటమో చేస్తామంటున్నాడు.

తెలంగాణ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హడావుడి కనిపించడంలేదు. అసెంబ్లీ రద్దయినా, పోలింగ్ షెడ్యూల్‌ విడుదలైనా, ఇంతవరకూ ఎన్నికలపై స్పందించలేదు పవన్. ఇంతకీ ఆయన పార్టీ, పోటీ చేస్తుందా లేదా అన్నది ఎవరికీ బోధపడ్డంలేదు. ఈ నేపథ్యంలో, పశ్చిమ గోదావరి పర్యటనలో పవన్‌ చేసిన వ్యాఖ్యలు, ఆ‍యన వైఖరి ఏంటో చెప్పకనే చెప్పాయి. తెలంగాణ ఎన్నికలకు సంబంధించి, పార్టీ నేతలతో పవన్‌ చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారట. తెలంగాణలోనూ జనసేనకు బలముందని, ఖమ్మం, గ్రేటర్‌ హైదరాబాద్‌ సహా పలు ప్రాంతాల్లో 20కి పైగా అభ్యర్థుల పేర్లు సైతం నిర్దారించుకున్నామని అన్నారు పవన్. అయితే 2019 ఎన్నికల దృష్టితో, తెలంగాణపై దృష్టి పెట్టలేదని, పార్టీ నిర్మాణం ప్రారంభించలేదని చెప్పారట. ముందస్తు ఎన్నికల ఎఫెక్ట్‌తో సిద్దంగా లేముకాబట్టి, ఇప్పటికప్పుడు ఏం చెయ్యాలో గందరగోళంగా ఉందని, పార్టీ నేతలతో అన్నారట. అయితే, పోటీ చేయకపోయినా, ఏదో ఒక పార్టీకి మద్దతివ్వడమో, లేదంటే కొందరు అభ్యర్థులను సపోర్ట్‌ చేయడమో చేస్తామన్నారట. దీంతో జనసేన నేతలు, ఒక్కసారిగా షాక్‌ అయ్యారట. ఒకప్పుడు ఖమ్మం, కరీంనగర్‌లో విస్తృతంగా తిరిగి, అభిమానులు సహా అనేకమందికి పార్టీలో సభ్యత్వం ఇప్పించి, ఎన్నికల్లో పోటీ చేస్తామన్న పవన్, ‌ఇప్పుడెందుకు పోటీకి ఆసక్తిగా లేరన్న విషయం, చర్చనీయాంశమైంది.

పవన్‌ కన్‌ఫ్యూజన్‌ వెనక సుడులు తిరుగుతున్న చాలా కారణాలున్నాయి. అందులో మొదటిది, తెలంగాణలో జనసేనకు నిర్మాణమే లేదు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారమే లక్ష్యంగా, అక్కడే మొత్తం దృష్టిపెట్టిన పవన్‌, తెలంగాణలో పోటీ గురించి, ఆవేశంలో నాడు అన్నారు కానీ, సంస్థాగతంగా పార్టీ నిర్మాణంపై ఏనాడూ ఆలోచించలేదు. అభిమానులున్నారు కానీ, వాళ్లు పార్టీ కార్యకర్తలుగా, ఓటర్లుగా మారతారన్న గ్యారంటీ లేదు. ఒకవైపు బలమైన టీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌ల మహాకూటమి, ఇంకోవైపు బీజేపీలు పోటీపడుతున్న తరుణంలో, పోటీ చేసినా జనసేనకు దక్కేదంటూ ఏమీలేదని పవన్‌ గ్రహించారని తెలుస్తోంది. అందుకే ఇక్కడ అనసవరంగా పోటీ చేసి, ఏపీలో చులకనకావడం కంటే, ఎన్నికల్లో తలపడకపోవడమే మేలని పవన్‌ ఆలోచించినట్టున్నారు.

తెలంగాణలో జనసేన కన్‌ఫ్యూజన్‌ సర్కిల్‌లో నిలబడింది. ఏ పార్టీతోనూ వెళ్లలేరు. దేనికీ మద్దతివ్వలేరు. సొంతంగా పోటీ చేయలేరు. అలాగని పార్టీలకు అతీతంగా, తనకు నచ్చిన అభ్యర్థులను సపోర్ట్‌ చేస్తే, నైతికంగా సరైంది కాదు. తెలంగాణలో పోటీ చేసి, పవన్‌ ప్రభావం ఏమీలేదని అనిపించుకోవడం ఎందుకు, ప్రత్యర్థులకు అస్త్రం కావడం ఎందుకని జనసేనాని మథనపడుతున్నారు. ఎలాగూ తన లక్ష్యం ఆంధ్రప్రదేశ్‌ కాబట్టి, తెలంగాణను లైట్‌ తీసుకోవాలని డిసైడయ్యారరని, జనసేన వర్గాల్లో చర్చ జరుగుతోంది. చూడాలి, మున్ముందు ఇంకా, తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తారో, లేదంటే దూరంగా ఉంటారో, అదీలేదంటే ఏదైనా పార్టీకి, లేదంటే అభ‌్యర్థులకు సపోర్ట్‌ చేసే విషయమై, అధికారిక ప్రకటన చేేస్తారో. వెయిట్‌ అండ్‌ సి.

Show Full Article
Print Article
Next Story
More Stories