పరిపూర్ణ కాషాయ అస్త్రం వెనుక ఖతర్నాక్‌ కథ!!

పరిపూర్ణ కాషాయ అస్త్రం వెనుక ఖతర్నాక్‌ కథ!!
x
Highlights

ఇప్పటి వరకు ఆధ్యాత్మిక ప్రవచనాలు. ఇక నుంచి అసలుసిసలు రాజకీయ ప్రసంగాలు. నిన్నటి వరకు శాంతి మాటలు...నేటి నుంచి ప్రత్యర్థులను ఉడికించే మంటలు. పరలోక...

ఇప్పటి వరకు ఆధ్యాత్మిక ప్రవచనాలు. ఇక నుంచి అసలుసిసలు రాజకీయ ప్రసంగాలు. నిన్నటి వరకు శాంతి మాటలు...నేటి నుంచి ప్రత్యర్థులను ఉడికించే మంటలు. పరలోక ప్రాప్తి కోసమే మొన్నటి మార్గోపదేశం..ఇహలోకంలోనే జీవితం స్వర్గమయం చేస్తామనే నేటి వాగ్దానం....సన్యాసం నుంచి రాజకీయ సమరభేరి మోగించారు, శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద. తెలంగాణ ఎన్నికల టైంలో, కమలదళంలో చేరి, ఇక శంఖారావం పూరిస్తామంటున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆధ్యాత్మిక ప్రవచనాలు చెబుతూ, ఎంతో పేరు తెచ్చుకున్న పరిపూర్ణానంద పార్టీలోకి రావడం సంతోషంగా ఉందన్నారు అమిత్‌ షా. దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి ఆయన కృషి చేస్తారని చెప్పారు.

దేశం కోసం, ధర్మం కోసం ఏ సూత్రాలను, సిద్ధాంతాలను ఆరెస్సెస్‌ కొనసాగిస్తూ వచ్చిందో, వాటిని రాజకీయ కోణంలో సమాజానికి మరింత చేరువ చేసే దిశగా బీజేపీ కృషిచేస్తోందన్నారు పరిపూర్ణానంద. మోడీ నేతృత్వంలో దేశం అభివృద్ధి చెందుతోందన్న స్వామిజీ....బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని చెప్పారు. ఏదీ ఆశించి తాను బీజేపీలో చేరడంలేదన్నారు. పార్టీ ఏ బాధ్యతలను తనకు అప్పగిస్తే, చేయడానికి సిద్దంగా ఉన్నానని తెలిపారు పరిపూర్ణ. స్వామి పరిపూర్ణానందను, తామే పార్టీలోకి ఆహ్వానించామని చెప్పారు, బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్. ఆయన సేవలను బీజేపీ ఉపయోగించుకుంటుందని, దక్షిణాదిలో పార్టీ బలోపేతం అయ్యేలా, ఆయన కృషి చేస్తారని చెప్పారు.

మొత్తానికి తెలంగాణ ఎన్నికల సమయంలో, స్వామిజీ రాకతో, బీజేపీలో సరికొత్త ఉత్తేజం వస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. హిందూత్వ అజెండాను భుజాన వేసుకున్న, పరిపూర్ణానంద ఫేస్‌తో, ఎన్నికల్లోకి వెళితే బాగుంటుందని బీజేపీ భావిస్తోంది. రాబోయే రోజుల్లో స్వామిజీతో ఉధృతంగా ప్రచారం చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. తెలంగాణ సీఎం అభ్యర్థిగా పరిపూర్ణానందను ప్రకటిస్తారని, కొన్నాళ్లుగా ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం ఆ విషయాలేవీ చెప్పలేదు. కానీ తెలంగాణకే పరిమితం చేయకుండా, అటు ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, కేరళ, తమిళనాడులోనూ పరిపూర్ణానంద అభిమానులు, అనుచరులు ఉన్నందున, మొత్తం దక్షిణాదిలోనే పార్టీ బలోపేతానికి ఉపయోగించుకోవాలని, బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

పరిపూర్ణానంద పార్టీలో చేరాడో లేదో అప్పుడే ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నదానిపై ప్రచారం మొదలైంది. సెటిలర్లు అధికంగా ఉండే, జూబ్లీహిల్స్‌ నుంచి పరిపూర్ణానంద పోటీ చేస్తారని, పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే, పార్టీ అధిష్టానం ఏం చెబితే అలా నడచుకుంటానని పరిపూర్ణానంద చెప్పారు. చూడాలి...కాషాయదళం సంధిస్తున్న స్వామిజీ అస్త్రం ఎలా దూసుకెళుతుందో...ఎలాంటి ఫలితం రాబడుతుందో...యోగిలా మరో చరిత్ర సృష్టిస్తాడో...రాజకీయ ఉద్దండుల యుద్ధంలో అభిమన్యుడిలా మిగిలిపోతాడో....కాలమే సమాధానం చెప్పాలి...

Show Full Article
Print Article
Next Story
More Stories