గ్రామ కార్యదర్శుల నియామకానికి అడ్డంకులు

x
Highlights

గ్రామ కార్యదర్శుల నియామకం తెలంగాణ ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఒకవైపు నిబంధనలు మరోవైపు సమయం అడ్డంకిగా మారాయి. అలాగే పరీక్ష నిర్వహణకు ఏ ప్రభుత్వ...

గ్రామ కార్యదర్శుల నియామకం తెలంగాణ ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఒకవైపు నిబంధనలు మరోవైపు సమయం అడ్డంకిగా మారాయి. అలాగే పరీక్ష నిర్వహణకు ఏ ప్రభుత్వ ఏజెన్సీ కూడా ముందుకు రాకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

తెలంగాణలో గ్రామ కార్యదర్శుల నియామకం ప్రభుత్వానికి సవాలుగా మారింది. మొత్తం 9వేల 355 పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం తెలిపినా పలు నిబంధనలు అడ్డంకిగా మారాయి. ముఖ్యంగా ఏ ప్రాతిపదికన నియామకాలు చేపట్టాలనే విషయమై తర్జనభర్జనలు పడుతున్నారు. 31 జిల్లాల ప్రకారం నియామకాలు చేపట్టాలని సీఎం కేసీఆర్ సూచించినా రాష్ట్రపతి ఉత్తర్వులో మార్పు చేయకుండా కొత్త జిల్లాల ప్రాతిపదికన పోస్టుల భర్తీ చేపట్టలేమని అధికారులు తేల్చిచెప్పారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన ఇచ్చిన ఉపాధ్యాయ నోటిఫికేషన్‌‌ను హైకోర్టు కొట్టివేయడాన్ని గుర్తుచేస్తున్నారు.

పంచాయతీ కార్యదర్శుల నియామకాలకు ప్రభుత్వం ఇచ్చిన గడువు మరో సమస్యగా మారింది. రెండు నెలల్లోపే నియామకాలు చేపట్టడం సాధ్యం కాదని పరీక్ష నిర్వహించే ప్రభుత్వ ఏజెన్సీలు అంటున్నాయి. దాంతో వివిధ రిక్రూట్‌మెంట్‌ బోర్డులతో సీఎస్‌ చర్చించారు. అయితే పరీక్ష నిర్వహణకు 6నెలల గడువు కోరిన జేఎన్టీయూ అప్లికేషన్‌ తయారీకే 6 వారాల టైమ్‌ పడుతుందని చెప్పింది. అయితే జేఎన్టీయూ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేసిన సీఎస్‌ పరీక్ష నిర్వహించడం ఇష్టంలేకే ఎక్కువ గడువు కోరారంటూ మండిపడినట్లు చెబుతున్నారు. దాంతో పంచాయతీరాజ్‌ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలోనే పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక పంచాయతీ కార్యదర్శులను ఇప్పటివరకూ 4 గ్రేడుల్లో నియమించారు. అయితే గ్రేడ్‌-4 కార్యదర్శులకు డిగ్రీ అర్హతగా ఉంది. అయితే ఇప్పుడు కొత్త నియామకాలకు అర్హత ఇంటర్మీడియటా? లేక డిగ్రీయా? అంటూ తర్జనభర్జన పడుతున్నారు. దాంతో గ్రేడ్‌-4 కార్యదర్శులుగా కాకుండా జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టులుగా నియామకాలు చేపట్టాలని భావిస్తున్నారు. ఈ సమస్యలన్నింటిపై ముఖ్యమంత్రితో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఏదిఏమైనా ప్రభుత్వం చెబుతున్నట్లుగా రెండు నెలల్లో నియామకాలు సాధ్యంకానే కాదని చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories