తిరుగులేని నటన నుంచి... తిరుగులేని నాయకత్వం దాకా

తిరుగులేని నటన నుంచి... తిరుగులేని నాయకత్వం దాకా
x
Highlights

ప్రజలే దేవుళ్లు-సమాజమే దేవాలయం... ఈ ఒక్క మాట చాలు ఎన్టీఆర్ ఏంటో అర్థం చేసుకోవడానికి. నటుడిగా అన్నీ చూసేసిన రామారావు.. ప్రజలకు సేవ చేయాలని తలచి 1982...

ప్రజలే దేవుళ్లు-సమాజమే దేవాలయం... ఈ ఒక్క మాట చాలు ఎన్టీఆర్ ఏంటో అర్థం చేసుకోవడానికి. నటుడిగా అన్నీ చూసేసిన రామారావు.. ప్రజలకు సేవ చేయాలని తలచి 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించారు. కేవలం 9 నెలల్లోనే.. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి అందరూ అవాక్కయ్యేలా చేశారు. అప్పుడు అర్థమైంది అందరికీ.. ఎన్టీఆర్ నటుడిగానే కాదు.. నాయకుడిగానూ నెంబర్ వన్ అని.

1978లో ఆంధ్రప్రదేశ్‌లో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అంతర్గత కుమ్ములాటలతో అపకీర్తి పాలైంది. ఐదేళ్ల కాలంలో నలుగురు ముఖ్యమంత్రులు మారడంతో.. ప్రభుత్వం అప్రతిష్ట పాలైంది. ఆ సమయంలోనే.. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. ప్రచారానికి తన పాత చెవ్రోలెటు వ్యానును బాగు చేయించి, దానిని ఒక కదిలే వేదికగా తయారు చేయించాడు. దానిపై నుంచే ఆయన తన ప్రసంగాలు చేసేవాడు. దానికి ఆయన చైతన్యరథం అని పేరు పెట్టాడు. దానిపై.. తెలుగుదేశం పిలుస్తోంది, రా.. కదలి రా.. అనే నినాదం రాయించాడు. తరువాతి కాలంలో భారత రాజకీయాల్లో పరుగులెత్తిన ఎన్నో రథాలకు.. ఎన్టీఆర్ చైతన్యరథమే స్ఫూర్తి.

ఆంధ్రుల ఆత్మగౌరవ పరిరక్షణ అనే ఒక ఉద్వేగభరితమైన అంశాన్ని తీసుకుని ప్రజల మనోభావాలను తీవ్రంగా ప్రభావితం చేశారు. కాంగ్రెస్ అధికారాన్ని కూకటివేళ్ళతో పెకలించివేసిన ప్రచార ప్రభంజనమది. 1983 జనవరి 7న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో.. 199 సీట్లతో తెలుగుదేశం బంపర్ మెజారిటీతో గెలిచింది. 97 ఏళ్ళ సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెసు పార్టీ 9 నెలల తెలుగుదేశం పార్టీ చేతుల్లో చిత్తుగా ఓడిపోయింది. ఏపీకి తొలి కాంగ్రెసేతర సీఎంగా.. పరిపాలనలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకొని.. పరిపాలనను ప్రజల ముంగిట నిలిపిన సీఎం ఎన్టీఆర్. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అంటూ ప్రజాసేవలో తరించారు. తెలుగుజాతికి - తెలుగుభాషకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్‌. ప్రభుత్వానికి ఖర్చు తప్ప ఎందుకూ పనికిరాదని శాసనమండలిని రద్దు చేశారు. స్త్రీలకు ఆస్తి హక్కునిచ్చారు. తెలంగాణలో గ్రామీణ జీవితాన్ని ఫ్యూడల్‌ శక్తుల కబంధ హస్తాల నుంచి విడిపించేందుకు పటేల్-పట్వారీ వ్యవస్థను రద్దుపరచి బడుగు, బలహీనవర్గాలకు ప్రజాస్వామ్య వ్యవస్థలను దగ్గరకు చేర్చారు తారకరామారావు.

పేదవాడి కడుపు నింపే 2 రూపాయలకు కిలోబియ్యం, సగం ధరకే చేనేత వస్త్రాలు, రైతన్నకు సబ్సిడీపై విద్యుత్‌ వంటి ప్రజాకర్షక, ప్రజాసంక్షేమ పథకాలు తిరుగులేని విజయాన్ని అందించాయి. ప్రభుత్వ ఖజానాకు ఎంత భారం పడినా కూడా ఎన్టీఆర్ తన హామీలను అమలుపరిచారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు చుక్కలు చూపించిన ఎన్‌టిఆర్‌.. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలను ఐక్యపథంలో నడిపించి నేషనల్‌ ప్రంట్‌ ఏర్పాటు చేశారు. కేంద్రంలో తొలి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు చేయించారు. ఒక ప్రాంతీయ పార్టీని దేశ రాజకీయాలకు దిక్సూచిగా మార్చారు. తెలుగుదేశంను కేవలం రాజకీయపార్టీగానే కాకుండా.. సాంఘిక విప్లవం తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన ఉద్యమంగా ఆయన చెప్పారు. భౌతికంగా ఆయన దూరమైనా.. చరిత్ర ఉన్నంత కాలం.. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతారు ఎన్టీఆర్.

Show Full Article
Print Article
Next Story
More Stories