ఇందూరు రాజకీయం ఏం చెబుతోంది!!

ఇందూరు రాజకీయం ఏం చెబుతోంది!!
x
Highlights

క్లీన్ స్వీప్ చేయాలనే ఆరాటం ఒకరిది.. కారు స్పీడుకు బ్రేకులు వేయాలనే పోరాటం ఇంకొకరిది.. ఒక్క ఛాన్స్ ఇవ్వండంటూ ఇంకొకరు... ఇలా ప్రధాన పార్టీలు ఓటర్లను...

క్లీన్ స్వీప్ చేయాలనే ఆరాటం ఒకరిది.. కారు స్పీడుకు బ్రేకులు వేయాలనే పోరాటం ఇంకొకరిది.. ఒక్క ఛాన్స్ ఇవ్వండంటూ ఇంకొకరు... ఇలా ప్రధాన పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎన్నికల సమరంలో హోరాహోరిగా తలపడుతున్నాయి. విలక్షణ తీర్పుతో పార్టీలకు కంగు తినిపించే నిజామాబాద్ జిల్లా ఓటర్లు.. మరో సారి తమ తీర్పుకు సిద్దమవుతున్నారు. అభివృద్ది నినాదంతో టీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్తుంటే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్ ... ఉనికిని చాటుకునేందుకు బీజేపీ ప్రజల్లోకెళ్తన్నాయి. రాజకీయ ఉద్దండులు బరిలో ఉన్న నిజామాబాద్ జిల్లా ఓటర్లు ఏమనుకుంటున్నారు? ఎవరు అధికారంలోకి వస్తే అభివృద్దికి దిక్సూచిగా ఉంటుదనుకుంటున్నారు? 9 నియోజకవర్గాల మాటేమిటి?

తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 2014 ఎన్నికల్లో ఓటర్లు ఉద్యమ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం ఇచ్చారు. జిల్లాలోని 9 నియోజకవర్గాలను టీఆర్ఎస్ క్లీన్‌స్వీప్ చేసింది. అదే ఫలితాలను రిపీట్ చేయాలని టీఆర్ఎస్ ఉవ్విళ్లూరుతుంటే.. పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ ఆరాటపడుతోంది. ఇటు బీజేపీ సైతం పట్టు కోసం సర్వశక్తులు ఒడ్డుతోంది. ఉమ్మడి జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో ఈ ఎన్నికలు నరలు తెగే ఉత్కంఠగా సాగుతున్నాయి. కొన్ని చోట్ల ముఖాముఖి పోరు ఉండగా.. మరికొన్ని నియోజకవర్గాల్లో త్రిముఖ పోరు కొనసాగుతోంది. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం. ఇక్కడ త్రిముఖ పోరు నెలకొంది. టీఆర్ఎస్ అభ్యర్ధి బిగాల గణేష్ గుప్తా, బీజేపీ అభ్యర్ది ఎండల లక్ష్మినారాయణ, కాంగ్రెస్ అభ్యర్ధి తాహెర్ బిన్ హందాన్‌ల మధ్య రసవత్తర పోరు కొనసాగుతోంది. ముగ్గురికి ఒక్కొ బలం కలిసొస్తుండటం అభ్యర్ధుల గెలుపు అంచనాలకు చిక్కడం లేదు.

నిజామాబాద్ రూరల్. ఈ నియోజకవర్గంలోనూ త్రిముఖ పోరే. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మాస్ లీడర్ బాజిరెడ్డి గోవర్ధన్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలో ఉండగా.. ఉద్యమ నేతగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్ధి డాక్టర్ భూపతిరెడ్డి గట్టి పోటీనిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి ఆనంద్‌రెడ్డి చాపకిందనీరులా బలం పెంచుకుంటుడటం ఆసక్తికరంగా మారింది. మరో కీలకమైన ఆర్మూర్. ఈ నియోజకవర్గంలో మూడు పార్టీల మధ్య పోరు హోరాహోరిగా సాగుతోంది. టీఆర్ఎస్ నుంచి జీవన్‌రెడ్డి బరిలో ఉండగా.. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ ఆకుల లలిత, బీజేపీ నుంచి టీఆర్ఎస్ టికెట్టు ఆశించి భంగపడ్డ అసమ్మతి నేత వినయ్ రెడ్డి ఢీ అంటే ఢీ అంటున్నారు. లోకల్ నినాదంతో.. ఇద్దరు అభ్యర్ధులకు గట్టి పోటీనిస్తున్నారు.

బాల్కొండ. ఈ నియోజకవర్గంలో పాత ప్రత్యర్ధుల మధ్య ఫైట్ ఉత్కంఠ రేపుతోంది. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈ సెగ్మెంట్ నుంచి బీఎస్పీ అభ్యర్ధి ప్రధాన పార్టీలకు గట్టి పోటీనిస్తుండటం ఫలితాలపై ఆసక్తి నెలకొంది. టీఆర్ఎస్ అభ్యర్ధిగా వేముల ప్రశాంత్‌రెడ్డి బరిలో ఉండగా.. కాంగ్రెస్ అభ్యర్దిగా ఈరవత్రి అనిల్, టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ ముత్యాల సునీల్‌రెడ్డి.. బీఎస్పీ నుంచి బరిలో నిలిచి ఢీ అంటే ఢీ అంటున్నారు. దీంతో బాల్కొండ లో కింగ్ మేకర్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. బోధన్‌లో ముఖాముఖి పోరు కొనసాగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్ధి షకీల్, కాంగ్రెస్ అభ్యర్ధి సుదర్శన్‌రెడ్డిల మధ్య ఢీ అంటే ఢీ అన్నట్లుగా పోరు కొనసాగుతోంది. బీజేపీ నుంచి అల్జాపూర్ శ్రీనివాస్ అభ్యర్ధిగా బరిలో ఉన్నా.. ఆయన ప్రభావం అంతంత మాత్రంగా ఉంది. ఏడోసారి శాసన సభకు పోటీ చేస్తున్న సుదర్శన్‌రెడ్డి తన పట్టును నిరూపించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.

రాష్ట్రం దృష్టిని ఆకర్శిస్తున్న నియోజకవర్గం బాన్సువాడ. ఇక్కడ నుంచి ఐదుసార్లు గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్ నుంచి బరిలో ఉండగా.. పోచారం చేతిలో రెండుసార్లు ఓటమి పాలైన కాసుల బాలరాజు కాంగ్రెస్ అభ్యర్ధిగా మరోసారి తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. బీజేపీ నుంచి నాయుడు ప్రకాష్ బరిలో ఉన్నా.. ఆయన ప్రభావం అంతంత మాత్రంగా ఉంది. జిల్లాలో ఏకైన ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం జుక్కల్. ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు ప్రధాన పార్టీల నుంచి తలపడుతున్నారు. మాజీ ఎమ్మెల్యేల పోరు ఆసక్తికరంగా సాగుతోంది. టీఆర్ఎస్ నుంచి హన్మంత్ షిండే బరిలో ఉండగా.. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే గంగారాం పోటీకి సై అంటున్నారు. కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే అరుణాతార ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ అభ్యర్ధిగా బరిలో నిలిచారు.

ఎల్లారెడ్డి ఓటర్లు తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్ధి రవీందర్‌రెడ్డి మరోసారి బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన నల్ల మడుగు సురేందర్ కూటమి తరపున కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలో నిలిచారు. బీజేపీ నుంచి బాణాల లక్ష్మారెడ్డి బరిలో ఉన్నా.. ఆయన ప్రభావం అంతంత మాత్రంగా ఉంది. ప్రధాన పోటీ టీఆర్ఎస్ - కాంగ్రెస్‌ల మద్య కొనసాగుతోంది. ద్విముఖ పోరులో ఎల్లారెడ్డి కోటపై ఎవరి జెండా ఎగురుతుందోనన్న ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గం కామారెడ్డి. ఇక్కడ నుంచి మరోసారి సీనియర్లు తలపడుతున్నారు. గత ఎన్నికల్లో పోటీపడ్డ గంప గోవర్ధన్ టీఆర్ఎస్ నుంచి బరిలో ఉండగా.. శాసన మండలి విపక్ష నేత షబ్బీర్ అలీ కూటమి తరపున కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి మాజీ జడ్పీ ఛైర్మన్ వెంకట రమణారెడ్డి టీఆర్ఎస్ -కాంగ్రెస్ అభ్యర్ధులకు గట్టి పోటీనిస్తున్నారు.

నిజామాబాద్ జిల్లాలో పొలిటికల్ ఫైట్ రాష్ట్రం దృష్టిని ఆకర్షిస్తోంది. ఎంపీ కవితకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. టీఆర్ఎస్ అభ్యర్ధుల విజయాన్ని తన భుజస్కందాలపై వేసుకుని కారును పరుగెత్తిస్తుండగా.. టీఆర్ఎస్ ఓటమి లక్ష్యంగా మాజీ పీసీసీ ఛీఫ్ డీఎస్ పావులు కదుపుతున్నారు. ప్రజా కూటమితో బలం పెంచుకున్న కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో కారు స్పీడుకు బ్రేకులు వేస్తుందా.. గత ఎన్నికల మాదిరిగా క్లీన్ స్వీప్ చేసి టీఆర్ఎస్ రికార్డు సృష్టిస్తుందా.. బీజేపీ తన ఉనికిని చాటుకుంటుందా అన్నది మరికొన్ని రోజుల్లో తేలనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories