మోడీకి తానేమీ తీసిపోను అంటూ రాహుల్‌ నిరూపణ..

మోడీకి తానేమీ తీసిపోను అంటూ రాహుల్‌ నిరూపణ..
x
Highlights

2014 పార్లమెంట్‌ ఎన్నికల్లో, బీజేపీ ఘనవిజయం సాధించింది. కేవలం మోడీ మానియాతోనే, పువ్వు వికసించిందని బీజేపీ నేతలు మనసావాచా నమ్మారు. ఇక మోడీ, అమిత్...


2014 పార్లమెంట్‌ ఎన్నికల్లో, బీజేపీ ఘనవిజయం సాధించింది. కేవలం మోడీ మానియాతోనే, పువ్వు వికసించిందని బీజేపీ నేతలు మనసావాచా నమ్మారు. ఇక మోడీ, అమిత్ షాలైతే, తమ ఛరిష్మా, వ్యూహాలతోనే గెలిచామని ప్రచారం చేసుకున్నారు. ఆ తర్వాత జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ, స్థానిక నాయకులు కాకుండా, కేవలం మోడీ, షా అంతా తామై నడిపారు. లోకల్‌ సమస్యలేవీ పట్టించుకోకుండా, జాతీయ అంశాలే ప్రాతిపదికగా మోడీ ముఖం చూసి ఓట్లేయమన్నారు. చేతగాని రాహుల్‌పై విమర్శలు కురిపించారు. దీంతో రాష్ట్రాల ఎన్నికల్లోనూ రాహుల్ వర్సెస్ మోడీగా మార్చేశారు బీజేపీ నేతలు.

మోడీ ప్రధాని అయిన తర్వాత జరిగిన ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలన్ని కూడా, మోడీ రాహుల్‌గానే సాగాయి. కాంగ్రెస్ ‌ముక్త్ భార‌త్‌ అంటూ, కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు, మహారాష్ట్ర నుంచి ఈశాన్య మణిపూర్‌ వరకూ, హోరెత్తించారు మోడీ. రాహుల్‌కు సబ్జెక్ట్ లేదని, మాట్లాడ్డం రాదని, ఒక రేంజ్‌లో విమర్శలు కురిపించారు. కాషాయ కరసేవకులు రాహుల్‌ను పప్పూగా అభివర్ణిస్తూ, సోషల్ మీడియాలో చెలరేగిపోయారు.

ఆయా రాష్ట్రాల్లో విజయం సాధించి, ఆ క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు మోడీ. కాంగ్రెస్‌ను తుడిచిపెట్టేస్తున్న ఘనత తనదేనని చెప్పుకున్నారు. తన మాటే శాసనమని, జనాలకు ఆమోదయోగ్యమన్నట్టుగా మాట్లాడారు. తాజాగా జరిగిన మధ‌్యప్రదేశ్‌, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల్లోనూ, ఇవే మాటలు అన్నారు. స్థానిక సమస్యలు పెద్దగా ప్రస్తావించకుండా, ఈ ఎన్నికలు తనకూ, రాహుల్‌ గాంధీకి మధ్య అన్నట్టుగా చిత్రీకరించారు. ఇప్పుడు ఈ మూడు రాష్ట్రాల్లోనూ కాషాయం ఓడింది. పువ్వును నలిపేశారు రాహుల్. దేశాన్ని పాలించే అర్హత, మోడీకి లేనేదలేదని విమర్శించారు.

మరి 2014 నుంచి 2017 వరకూ, ఆయా రాష్ట్రాల విజయాన్ని మోడీ తన ఖాతాలో వేసుకున్నప్పుడు, ఈ మూడు రాష్ట్రాల విజయం రాహుల్‌ది కాదా అంటున్నారు విశ్లేషకులు. కాషాయ పార్టీకి కంచుకోటల్లాంటి హిందీ హార్ట్‌ ల్యాండ్‌ స్టేట్స్‌ను కొల్లగొట్టి, రాహుల్‌ తన నాయకత్వానికి పూర్తి ఆమోద యోగ్యత సాధించుకున్నారని విశ్లేషిస్తున్నారు.

రాహుల్‌ ఐరన్‌ లెగ్‌ అని, ప్రతి ఒక్కరూ విమర్శించారు. యూపీ, బీహార్, హర్యానా, మహారాష్ట్ర ఇలా ఏ రాష్ట్రంలో అడుగుపెట్టినా, కాంగ్రెస్‌కు పరాజయమే ఎదురవుతోందని ఎత్తిపొడిచారు. 2004లో రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి రాహుల్‌ గాంధీ అనేక అవమానాలను భరించారు. పప్పు అని.. రాజకీయ అజ్ఞాని అని అనేక మంది ఎద్దేవా చేశారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దాడులు మరింతగా పెరిగాయి. రాహుల్‌ వీటన్నింటినీ తట్టుకొని నిలబడ్డారు. అయితే, గుజరాత్‌ ఎన్నికల నుంచి రాహుల్‌ రూటే మారింది. మోడీపై గట్టిగా వాగ్భాణాలు వదిలారు. గుజరాత్‌లో దాదాపు విజయం వరకూ వచ్చి, ఓడిపోయినా, నైతికంగా గెలిచారని అనిపించుకున్నారు. ఆ తర్వాత కర్ణాటకలోనూ మోడీ వర్సెస్ రాహుల్‌గా సాగిన పోరులో, చాణక్యంతో, తిరిగి రాష్ట్రాన్ని దక్కించుకున్నారు.
రోజులు గడుస్తున్నకొద్దీ, సరికొత్తగా మారుతూ, మోడీకి తానేమీ తీసిపోను అని ప్రూవ్ చేసుకుంటున్నారని, రాజకీయ పండితులు ఎనలైజ్ చేస్తున్నారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మోడీపై ప్రతిదాడి చేశారు రాహుల్. ఐదు రాష్ట్రాల్లో 82 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. 7రోడ్‌ షోలు నిర్వహించారు. తెలంగాణ, మిజోరం తప్పించి, మిగతా మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇప్పటి దాకా మోడీకి ప్రత్యామ్నాయం లేదనే భావన ఈ ఎన్నికలతో పటాపంచలైందన్న ప్రశంసలు అందుకున్నారు రాహుల్. అయితే... కేంద్రంలో మోడీ కోటను బద్దలుకొట్టేందుకు ఇది సరిపోదనే విశ్లేషణలు కూడా వెలువడుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో విజయంతోనే రాహుల్‌ పూర్తిస్థాయి నాయకుడవుతారని అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories