వచ్చే ఎన్నికల్లో ఎర్రోళ్లకి టికెట్టు హుళక్కేనా?

వచ్చే ఎన్నికల్లో ఎర్రోళ్లకి టికెట్టు హుళక్కేనా?
x
Highlights

ఎట్టకేలకు ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు పదవి దక్కింది. ఆయన్ను ఎస్సీ ఎస్టీ కమీషన్ చైర్మన్‌గా నియమిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. అయితే ఎంపీ, ఎమ్మెల్యే...

ఎట్టకేలకు ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు పదవి దక్కింది. ఆయన్ను ఎస్సీ ఎస్టీ కమీషన్ చైర్మన్‌గా నియమిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. అయితే ఎంపీ, ఎమ్మెల్యే కావాలనుకున్న ఎర్రోళ్ల ఈ పదవితోనే సరిపెట్టుకోవాలా అన్న చర్చ పార్టీలో మొదలైంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ నిరాకరించేందుకే.. మూడున్నరేండ్ల తర్వాత శ్రీనివాస్‌కు ఈ పదవి కట్టబెట్టారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు ఎట్టకేలకు పదవి దక్కింది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయనకు మంచి పదవి ఇస్తారని అంతా ఆశించారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్ధి, యువకులను సమీకరించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. TRSV అవిర్భావ అధ్యక్షుడిగా పని చేసారు. పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా సేవలందించారు. అయితే గత ఎన్నికల్లో ఎర్రోళ్ల శ్రీనివాస్‌ ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటి చేయాలని భావించారు. పార్టీలో మొదటి నుంచి ఉన్నందున ఆయనకు ఖచ్చితంగా టికెట్ వస్తుందనుకున్నారు. కాని మంత్రి హరీష్ రావు ప్రధాన అనుచరుడిగా పేరున్న ఎర్రోల్లకు పోటి చేసే అవకాశం దక్కలేదు. ఇక ఉప ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఎర్రోళ్ల పేరు తెరమీదకు వచ్చింది. నారాయణఖేడ్ అసెంబ్లీ, వరంగల్ ఎంపీ టికెట్ వచ్చినట్టే వచ్చి చేజారింది. ఎమ్మెల్సీ పదవి వస్తుందనుకున్న రాలేదు. ఆర్టీసీ చైర్మన్ పదవి వరిస్తుందనుకున్నా వర్క్ అవుట్ కాలేదు. పార్టీలో చేరిన వెంటనే చాలా మంది మంచి పదవులు దక్కించుకున్నాఎర్రోళ్ల కు మాత్రం దక్క లేదు. అయినా ఏ మాత్రం నిరాశ చెందకుండా ఓపిగ్గా నిరిక్షించారు. హరీష్ రావు మనిషన్న ఏకైక కారణంతోనే ఆయన్ను దూరం పెట్టారనే అభిప్రాయం పార్టీలో మెజారిటీ నేతల్లో ఉంది. ఇక ఆయనకు పదవులు రావనుకుంటున్న సమయంలో ఆయనకు పదవి దక్కడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఉద్యమ కారుడికి ఎట్టకేలకు న్యాయం జరిగిందని అనుకుంటున్నా ఎర్రోళ్లకు పదవి దక్కడం వెనక చాలా వ్యూహం ఉన్నట్లు అధికార పార్టీలోనే చర్చ జరుగుతోంది.

ఎర్రోళ్లని ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరం చేసేందుకే చివర్లో పదవి కట్టబెట్టారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ నిరాకరించేందుకే మూడున్నరేండ్ల తర్వాత శ్రీనివాస్‌కు ఈ పదవి ఇచ్చారంటున్నారు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కమీషన్ చైర్మన్ గా నియమించడంతో లోలోన మథనపడుతున్నారు. పదవి వచ్చిందని సంతోషపడాలో లేక వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదని బాధపడాలో తెలియని గందరగోళంలో ఎర్రోళ్ల ఉన్నట్లు తెలుస్తోంది. ఎలాంటి పదవి లేని ఎర్రోళ్లకు వచ్చే ఎన్నికల్లోనూ టికెట్ నిరాకరిస్తే.. పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికి అన్యాయం జరుగుతోందనే సంకేతాలు వెలువడే అవకాశం లేకపోలేదు. మరో వైపు మంత్రి కేటీఆర్ కు అనుచరులుగా ఉన్న అందరికి ఎంపీ నుంచి కార్పోరేషన్ చైర్మన్ల వరకు పదవులిచ్చి హరీష్ రావు మనుషులకు ఎలాంటి పదవులు ఇవ్వకపోతే తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉంది. అందుకే హరీష్ రావు ప్రధాన అనుచరుడిగా ఉన్న ఎర్రోల్లకు పదవి ఇచ్చినట్లే ఇచ్చి అన్యాయం చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories