Top
logo

7జోన్ల తెలంగాణ

7జోన్ల తెలంగాణ
X
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయత్నాలు ఫలించాయి. ఎన్నాళ్ల నుంచో అపరిష్కృతంగా ఉన్న నూతన జోనల్‌ వ్యవస్థకు సమస్యకు...

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయత్నాలు ఫలించాయి. ఎన్నాళ్ల నుంచో అపరిష్కృతంగా ఉన్న నూతన జోనల్‌ వ్యవస్థకు సమస్యకు తెరపడింది. తెలంగాణలో నూతన జోనల్ విదానానికి రాష్ట్రపతి ఆమోద ముద్రవేశారు. ఏడు జోన్లు రెండు మల్టీ జోన్లతో కేంద్రహోంశాఖ గెజిట్ విడుదల చేసింది. కొత్త జోనల్ వ్యవస్థతో స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు దక్కనున్నాయి.

రాష్ర్టంలో కొత్త జోనల్ విధానానికి కేంద్రం ఆమోదం తెలుపుతూ గెజిట్ విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న రెండు జోన్ల స్థానంలో ఏడు కొత్త జోన్లు ఏర్పడనున్నాయి. మొదటి నాలుగు జోన్లను ఒక మల్టీ జోన్ గా మిగిలిన మూడు జోన్లను మరో మల్టీ జోన్‌గా ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకూ అమల్లో ఉన్న విధానం ప్రకారం 70 శాతం పోస్టులను స్థానికులకు కేటాయించారు. 30 శాతం పోస్టులు ఓపెన్ కెటగిరీ పరిధిలోకి ఉంచేవారు. దీంతో స్థానిక అభ్యర్ధులు నష్టపోతున్నారనే భావనంతో 95 శాతం పోస్టులను స్థానికులకు కల్పించే విధంగా కేసీఆర్ సర్కార్ నూతన జోన్ల విధానానికి రూపకల్పన చేసింది. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేలా ప్రధాని మోడీ సహా కేంద్ర మంత్రులతో చర్చలు జరిపి ఒప్పించారు సీఎం కేసీఆర్.

కొత్తగా ఏర్పడిన జోన్లలో కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి, యాదాద్రి, చార్మినార్, జోగులాంబ జోన్లు ఉన్నాయి. అంతే కాదు రెండు మల్టీ జోన్లు ఉన్నాయి. అందులో కాళేశ్వరం, బాసర, సిరిసిల్ల, భద్రాద్రి జోన్లను ఒక మల్టీ జోన్ గా.. యాదాద్రి, చార్మినార్, జోగులాంబ మరో మల్టీ జోన్ గా పరిగణిస్తూ ఆమోదం తెలుపుతూ కేంద్రం గెజిట్ జారీ చేసింది.

కాళేశ్వరం జోన్ పరిధిలోకి భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిపాబాద్, పెద్ద పల్లి జిల్లాలను చేర్చారు. రాజన్న జోన్‌ లోకి కరీంనగర్‌, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్‌ జిల్లాలను కలిపారు. బాసర జోన్ పరిధిలో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలను చేర్చారు. కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాలను భద్రాద్రి జోన్ గా విభజించారు. సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాలను కలుపుతూ యాదాద్రి జోన్ పరిధిలోకి చేర్చారు.

హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాలను చార్మినార్ జోన్ గా మార్చారు. ఇక జోగులాంబ జోన్‌ పరిధిలోకి మహబూబ్‌నగర్‌, గద్వాల, నాగర్‌కర్నూలు, వికారాబాద్‌ జిల్లాలను కలిపారు. కాళేశ్వరం, బాసర, సిరిసిల్ల, భద్రాద్రి జోన్లను ఒక మల్టీ జోన్ గా....యాదాద్రి, చార్మినార్‌, జోగులాంబ జోన్లను మరో మల్టీ జోన్ గా పరిగణిస్తూ కేంద్రం ఆమోదం తెలిపింది.

కొత్త జోనల్ విధానంలో ఉద్యోగాలను జిల్లా, జోనల్ మల్టీ జోనల్, రాష్ట్ర స్తాయి కేడర్లుగా పరిగణించనున్నారు. మొదటి మూడింటిని ప్రత్యక్ష నియామకాల ద్వార భర్తీ చేయనున్నారు. వీటికి 95 శాతం స్థానిక రిజర్వేషన్లు ఐదు శాతం స్థానికేతర రిజర్వేషన్లు ఇస్తారు. ఇప్పటి వరకు రాష్ర్ట స్థాయి పోస్టులకు అందరూ పోటీ పడుతుండే వారు. కొత్త విధానంలో రాష్ర్ట స్థాయి పోస్టులకు ప్రత్యక్ష నియామకాలను నిలిపివేసి పదోన్నతుల ద్వారానే భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం నాలుగు నుంచి పది తరగతుల్లో నాలుగేళ్లపాటు చదివినవారిని స్థానికులుగా గుర్తిస్తున్నారు. కొత్త జోనల్ విధానంలో ఒకటి నుంచి ఏడు తరగతుల్లో వరుసగా నాలుగేళ్లు చదివితేనే స్థానికులవుతారు. జిల్లా, జోన్లు, బహుళజోన్లు, రాష్ట్రస్థాయిలో ఎక్కడ వరుసగా నాలుగేళ్లు చదివితే అక్కడే వారు స్థానికులు కానున్నారు.

Next Story