logo

బీజేపీని వణికిస్తున్న కొత్త భవనం...బీజేపీకి టీడీపీ దూరం కావడానికి...

బీజేపీని వణికిస్తున్న కొత్త భవనం...బీజేపీకి టీడీపీ దూరం కావడానికి...

కొద్ది నెలల క్రితం జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమికి కారణమేంటి..? కర్ణాటకలో కమలనాథుల పరాజయానికి కారణమేంటి..? బీజేపీకి టీడీపీ దూరం కావడానికి..జమ్ములో పీడీపీతో సంకీర్ణం విచ్ఛిన్నం కావడానికి కారణమెవరు..? శివసేన - బీజేపీ శత్రువులు అవ్వడం వెనుకున్న రీజన్ ఏంటి..? కమలదళం మదిలో మెదులుతున్న సెంటిమెంట్ వింటే ఎవరైనా ఆశ్చర్య పోవాల్సిందే..!


దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయం. దీనదయాళ్‌ ఉపాధ్యాయ్‌ మార్గ్‌-6..లో ఉన్న ఐదు అంతస్తుల విలాసవంతమైన భవనంలో అధునాతన హంగులు, సకల సౌకర్యాలు, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నాయి. ఏడాదిన్నరలోనే నిర్మాణం పూర్తిచేసి సాక్షాత్తూ ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ ఏడాది ఫిబ్రవరి 18న ప్రారంభించారు. కానీ ఈ భవంతి గురించే బీజేపీలో ఇప్పుడు హాట్ డిబేట్ నడుస్తోంది. ఢిల్లీలోని హెడ్ క్వార్టర్స్ అచ్చిరాలేదని అధికార పార్టీ నేతలు తెగ బాధపడుతున్నారు. ఆ భవనంలోకి మారాక వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయట. అందుకే ఈ భారీ భవనం గురించి తలచుకుంటే బీజేపీ పెద్దలకు ఓటమి భయం వెంటాడుతోందట.

కొద్ది నెలల కిందట జరిగిన యూపీలోని గోరఖ్‌పూర్‌, ఫూల్‌పూర్‌, కైరానా లోక్‌సభ స్థానాల ఉపఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం పాలైంది. తర్వాత కర్ణాటకలో అతిపెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధించలేక చతికిలబడింది. అంతకుముందే ఎన్డీఏ కూటమికి టీడీపీ గుడ్ బై చెప్పేసింది. ఆ తర్వాత జమ్మూకశ్మీర్లో పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవలసి వచ్చింది. అలాగే మిత్రపక్షం శివసేన తెగదెంపులకు సిద్ధమైంది. కొత్త కార్యాలయంలో అడుగుపెట్టాకే ఈ ఎదురుదెబ్బలన్నీ తగిలాయని బీజేపీ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. అందుకే కొత్త కార్యాలయంలో కొనసాగే విషయంలో కమలనాథులు పునరాలోచనలో పడ్డారు.

వచ్చే ఏడాది లోక‌ సభ ఎన్నికల్ని ఎదుర్కోవలసిన సమయంలో బీజేపీని కొత్త కార్యాలయం సెంటిమెంట్ భయపెడుతోంది. సార్వత్రిక ఎన్నికలకు ‘వార్‌రూం’ను కొత్త కార్యాలయంలో ఏర్పాటు చేయొద్దని పార్టీ నాయకత్వంపై ఒత్తిడి వస్తోంది. అగ్రనాయకత్వం కూడా ఇదే అభిప్రాయం ఉండడంతో మళ్లీ అశోకా రోడ్‌-11లోని పాత కార్యాలయానికి మకాం మార్చాలని భావిస్తున్నారు. బీజేపీ 2019 ఎన్నికల వార్‌రూం త్వరలోనే ప్రారంభం కాబోతోంది. 300 మందితో 24 గంటలు పనిచేసే వార్ రూం ద్వారా 30 కోట్ల మంది ఓటర్లను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అసలే మోడీ ప్రాభవం తగ్గుతోందని సర్వేలు చెబుతున్న వేళ వార్ రూంను ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త కార్యాలయంలోకి ఏర్పాటు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

arun

arun

Our Contributor help bring you the latest article around you


లైవ్ టీవి

Share it
Top