శరన్నవరాత్రుల్లో అమ్మ ఏ రోజు ఏ అవతారంలో దర్శనమిస్తారంటే

Highlights

బెజవాడ ఇంద్రకీలాద్రిపై జరిగే దసరా ఉత్సవాలకు చారిత్రక, పురాణ, ఇతిహాస విశేషాలున్నాయి. ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం వందల ఏళ్ళుగా ఈ ఉత్సవాలు నిరాటంకంగా...

బెజవాడ ఇంద్రకీలాద్రిపై జరిగే దసరా ఉత్సవాలకు చారిత్రక, పురాణ, ఇతిహాస విశేషాలున్నాయి. ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం వందల ఏళ్ళుగా ఈ ఉత్సవాలు నిరాటంకంగా జరుగుతున్నాయ్. కీలుడనే యక్షుడు చేసిన తపస్సుకు మెచ్చిన జగన్మాత అతడికి వరం ఇవ్వటం, ఆ వర ప్రభావంతో కీలుడు ఇంద్రకీలాద్రిగా మారటం, కీలాద్రిపై అమ్మ దుర్గాదేవిగా అవతరించటం.. ఇలా ఒకదాని వెంట ఒకటి జరగడంతో దేవీ వైభవం ఎల్లెడెలా వ్యాపించింది. మొత్తంగా శరన్నవరాత్రుల్లో అమ్మ ఏ రోజు ఏ అవతారంలో సాక్షాత్కరిస్తుందో చూడండి.

ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా జరగనున్న దసరా శరన్నవరాత్రులకు భక్తులు పోటెత్తుతున్నారు. తొలి రోజున దుర్గమ్మ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవికి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ప్రాచీనకాలంలో ఆదిశక్తి అనుగ్రహం కోసం కీలుడనే యక్షుడు తపస్సు చేయగా అమ్మవారు ప్రత్యక్షమైంది. తన హృదయంలో శాశ్వతంగా ఉండాలని కీలుడు కోరాడు. దుర్గాసురిడిని, మహిషాసురిడిని వధించిన తర్వాత కోటి కనకప్రభలతో కనకదుర్గాదేవిగా కనిపిస్తానని కీలుడికి అభయమిస్తుంది.

శరన్నవరాత్రుల్లో రెండో రోజు అమ్మవారు బాలాత్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తారు. బాలాదేవి ఎంతో మహిమాన్వితమైనది. శ్రీ బాలా మంత్రం సమస్త దేవీ మంత్రాల్లో గొప్పది. అందుకే శ్రీ విద్యోపాసకులకు మొదటి బాలా మంత్రాన్ని ఉపదేశిస్తారు. బాలాదేవి అనుగ్రహం పొందుతేనే మహా త్రిపురసుందరీ దేవి అనుగ్రహాన్ని పొందగలం. దసరా రోజుల్లో భక్తులకు పూర్ణఫలం అందించే తోలి అలంకారం శ్రీ బాలాదేవి.

శరన్నవరాత్రుల్లో మూడో రోజున అమ్మవారు గాయత్రీదేవిగా దర్శనమిస్తారు. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా వేద మాతగా ప్రసిద్ధి చెందింది గాయత్రిమాత. ముక్తా, విద్రుమ, హేమనీల, ధవళ వర్ణాలతో ప్రకాశించే పంచముఖాలతో దర్శనమిచ్చే దేవత గాయత్రీదేవి. గాయత్రీ దేవి శిరస్సలో బ్రహ్మ, హృదయంలో విష్ణు, శిఖలో రుద్రుడు ఉంటారని నమ్ముతారు. అందుకే త్రిమూర్తి స్వరూపంగా గాయత్రిని కొలుస్తారు. గాయత్రీని దర్శిస్తే ఆరోగ్యంతో పాటు సకల మంత్ర సిద్ధి ఫలాన్ని పొందుతారని ప్రతీతి.

దసరా ఉత్సవాల్లో నాలుగో రోజున అమ్మవారు అన్నపూర్ణ దేవిగా దర్శనమిస్తారు. అన్నపూర్ణమ్మ అన్నాన్ని ప్రసాదించే మూర్తి స్వరూపం. అన్నం పర:బ్రహ్మ స్వరూపం అంటారు. అన్నం సకల జీవకోటికి సర్వ జీవనాధారం. అన్నం లేనిదే జీవులకు మనుగడ లేదు. అన్ని దానాల్లో కన్నా అన్నదానం గొప్పదని ఒక్కసారి అన్నపూర్ణ దేవి అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శిస్తే అన్నాదుల లోపం లేకుండా ఇతరులకు అన్నదానం చేసే సౌభాగ్యం పొందవచ్చని చెబుతారు.

ఐదో రోజు నుంచి ఉత్సవాలు మరింత జోరందుకుంటాయ్‌. నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతుంది. ఐదో రోజు నుంచీ ప్రతీ రోజూ అమ్మవారు అద్భుతమైన రూపాల్లో భక్తులకు కనువిందు చేస్తుంది.

ఐదో రోజున అమ్మవారు లలితా త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ అమ్మవారు శ్రీ చక్ర అధిష్టాన శక్తిగా పంచదశాక్షరీ మహా మంత్రాధిదేవతగా ఉండి తనని కొలిచే భక్తులను అనుగ్రహిస్తుంది. శ్రీలక్ష్మీదేవి, శ్రీ సరస్వతిదేవి ఇరువైపులా ఉండగా ఈ అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చే సమయంలో పరమేశ్వరుడిని త్రిపురేశ్వరుడుగా, అమ్మవారు త్రిపుర సుందరీ దేవిగా భక్తులు కొలుస్తారు.

ఆరో రోజున దసరా ఉత్సవాలలో అమ్మవారు శ్రీ మహాలక్ష్మిగా దర్శనమిస్తారు. మంగళప్రదమైన దేవతగా మహాలక్ష్మి అవతారాన్ని చెబుతారు. జగన్మాత మహాలక్ష్మి అవతారంలో దుష్ట రాక్షస సంహారాన్ని చేసింది. మూడు శక్తుల్లో ఒక శక్తైన శ్రీ మహాలక్ష్మి అమితమైన పరాక్రమాన్ని చూపి హాలుడు అనే రాక్షసుడిని సంహరించిందని పురాణాలు చెబుతున్నాయి. మహాలక్ష్మిని దర్శిస్తే భక్తులకు ఐశ్వర్య ప్రాప్తి, విజయం లభిస్తాయని నమ్మకం.

ఏడో రోజున సరస్వతి అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలానక్షత్రం. ఈ రోజున అమ్మవారు సరస్వతి దేవీ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. బంగారు వెండిని చేత బట్టుకుని చదువుల తల్లిగా దుర్గమ్మ భక్తులకు ఆశీస్సులను అందిస్తుంది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా త్రిశక్తి స్వరూపాలతో దుష్ట సంహారం చేసిన దుర్గాదేవి తన నిజ స్వరూపంలో దర్శనమివ్వటమే మూలా నక్షత్రం రోజున సర్వస్వతి దేవి అలంకారం ప్రాధాన్యంగా చెబుతారు. ఈ రోజున సుమారు 3 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ ఒక్కరోజు దుర్గమ్మ తెల్లవారుజామున 3 నుంచి రాత్రి 1.30 గంటల వరకు భక్తులకు దర్శనమిస్తుంది.

ఎనిమిదో రోజున కనకదుర్గమ్మ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తుంది. మహా భక్తుడైన కీలుడు పర్వత రూపం దాల్చి అమ్మవారి పాదస్పర్శ కోసం ఎదురుచూస్తుండగా లోకకంఠుడైన దుర్గమాసురుడిని వధించి దుర్గాదేవిగా కీలాద్రిపై స్వయంగా ఆవిర్భవించింది. దుర్గాదేవి దర్శనం శ్రేయోదాయకంగా చెబుతారు.

తొమ్మిదో రోజున దుర్గమ్మ మహిషాసుర మర్ధినిగా భక్తులకు దర్శనమిస్తారు. అష్టభుజాలతో అవతరించి సింహవాహినై దుష్టుడైన మహిషాసురుడిని సంహరిస్తుంది దుర్గాదేవి. దేవతలు, రుషులు, మానవుల కష్టాలను తొలిగించి మహిషాసుర మర్ధినిగా కొలువవుతుంది. ఈ అవతారాన్ని దర్శిస్తే ధైర్య, స్థైర్య విజయాలు సిద్ధిస్తాయని చెబుతారు.

చివరి రోజైనా దసరా ఉత్సవాల్లో దుర్గమ్మ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. వామహస్తంలో చెరుకుగడను ధరించి దక్షణ హస్తంతో అభయాన్ని ప్రసాదించే రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించడం వల్ల సకల శుభాలు, విజయాలు చేకూరతాయని ప్రతీతి.

దసరా మహానవరాత్రులలో చివరి రోజు అమ్మవారు హంసవాహనంపై ‌శ్రీ మల్లేశ్వరస్వామి సమేతంగా కృష్ణానదిలో విహరిస్తుంది. ఈ వేడుకను చూడటానికి వేలాదిగా భక్తులు కృష్ణానది తీరానికి తరలి వస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories