ఎంపీపీ ఇంటికి నిప్పు

x
Highlights

తెలంగాణలో అధికార పార్టీ నాయకులను వివాదాలు వీడటం లేదు. వరంగల్‌ అర్బన్ జిల్లాకు చెందిన రమణారెడ్డి భూవివాదంలో చిక్కుకున్నాడు. భూ కోనుగోలు వ్యవహారంలో ఓ...

తెలంగాణలో అధికార పార్టీ నాయకులను వివాదాలు వీడటం లేదు. వరంగల్‌ అర్బన్ జిల్లాకు చెందిన రమణారెడ్డి భూవివాదంలో చిక్కుకున్నాడు. భూ కోనుగోలు వ్యవహారంలో ఓ యువకుడిపై దాడి చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. రమణారెడ్డి తీరును నిరసిస్తూ నారాయణగిరి గ్రామస్తులు ఆందోళనకు దిగారు.

వరంగల్‌ అర్బన్ జిల్లా ధర్మసాగర్‌ మండలం నారాయణగిరిలో అధికార పార్టీ ఎంపీపీ భర్త మల్లపురెడ్డి రమణారెడ్డి వీరంగం స్పష్టించాడు. గ్రామానికి చెందిన జక్కుల సుధీర్ అనే యువకుడి తాత జక్కుల రామయ్య ఆరేళ్ల క్రితం తన రెండు ఎకరాల భూమిని రమణారెడ్డికి విక్రయించాడు. ఇందుకోసం ముందస్తుగా కొంత నగదు చెల్లించిన రమణారెడ్డి ఒప్పందం చేసుకున్నారు. అయితే తరువాత స్ధానిక సంస్ధల ఎన్నికలురావడంతో డబ్బు వెనక్కు తీసుకున్న రమణారెడ్డి వారి పోలం వారికే ఇచ్చేశాడు. ఈ ఎన్నికల్లో రమణారెడ్డి భార్య లక్ష్మి ఎంపీపీగా గెలిచింది. రెండేళ్ల అనంతరం సుధీర్ తాత మృతి చెందడంతో అవసరం కోసం పొలం అమ్ముతానంటూ ప్రకటించాడు. దీంతో తానే భూమి కొంటానంటూ ముందుకు వచ్చిన రమణారెడ్డి కొంత మొత్తం డబ్బు చెల్లించి మరోసారి ఒప్పందం చేసుకున్నాడు. మిగిలిన డబ్బు ఇవ్వమని ఎన్నిసార్లు కోరినా ఇవ్వకపోవడంతో ఇరువురి మధ్య గొడవ మొదలైంది.

డబ్బు చెల్లించకపోవడంతో తన భూమి తానే సాగు చేసుకుంటానంటూ సుధీర్ తేల్చిచెప్పాడు. దీంతో రమణారెడ్డి పోలీసులను ఆశ్రయించి సుధీర్‌పై కేసు పెట్టాడు. ఇదే సమయంలో సుధీర్ కూడా కేసు పెట్టినా పోలీసులు తీసుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించి ఇంజక్షన్ ఆర్డర్స్‌ పొందాడు. దీంతో సుధీర్‌పై మరింత ఆగ్రహం పెంచుకున్న రమణారెడ్డి గతేడాది కోతకొచ్చిన పంటను ట్రాక్టర్‌తో దున్ని నాశనం చేశాడు. జిల్లా వ్యాప్తంగా ఈ విషయం తీవ్ర సంచలనం రేపడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేప్టటారు.

నెలలు గడుస్తున్నా తనకు న్యాయం లేదంటూ ఆవేదన చెందిన సుధీర్ సోషల్ మీడియాలో తనకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించాడు. ఈ వీడియో గ్రామంలో అందరికి తెలియడంతో ఆగ్రహం చెందిన రమణారెడ్డి పోలం దగ్గరకు చేరుకుని సుధీర్‌ను విచక్షణ రహితంగా చితకబాదాడు. దీంతో తీవ్రంగా గాయపడి స్పహతప్పి పడిపోయిన సుధీర్‌ను చుట్టుపక్కల వారు ఆసుపత్రికి తరలించారు.

అధికారం అండతో అమాయకుడిపై దాడి చేసిన ఎంపీపీ భర్తతో పాటు అనుచరులపై గ్రామస్తులంతా ఏకమై తిరగబడ్డారు. రమణారెడ్డి పరారయ్యాడని తెలుసుకుని ఇంట్లో ఉన్న రెండు బైకులను ధ్వంసం చేశారు. రమణారెడ్డి అనుచరుల ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేసి నిరసనకు దిగారు. విష‍యం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని రమణారెడ్డితో పాటు సుధీర్‌పై దాడి చేసిన వారిని అరెస్ట్ చేస్తామంటూ హామి ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories