ములుగు నుంచి భద్రాద్రి వరకు... సీతక్క దారెటు!!

ములుగు నుంచి భద్రాద్రి వరకు... సీతక్క దారెటు!!
x
Highlights

ఉత్తర తెలంగాణలో బలమైన గిరిజన మహిళా నాయకురాలామె. ఒక్కప్పుడు మావోయిస్టు... ఇప్పుడు రాజకీయ నేత. గిరిజన నేపథ్యం ఉన్న నియోజకవర్గంలో మంచి పట్టు సాధించిన...

ఉత్తర తెలంగాణలో బలమైన గిరిజన మహిళా నాయకురాలామె. ఒక్కప్పుడు మావోయిస్టు... ఇప్పుడు రాజకీయ నేత. గిరిజన నేపథ్యం ఉన్న నియోజకవర్గంలో మంచి పట్టు సాధించిన వనిత. అలాంటి వ్యక్తి ఇప్పుడో సంకటం పట్టుకుంది. సీతక్క. ములుగు నియోజకవర్గ గిరిజన రాజకీయ నాయకురాలు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో సమ్మక్క సరక్కలు కొలువైన ప్రాంతంలో ఉన్న ములుగు నియోజకవర్గం ఇప్పుడు రాష్ట్రంలో హాట్‌ టాపిక్. గత ఎన్నికల్లో ప్రత్యర్థులు ఈ ఎన్నికల్లో ఒకే పార్టీ నుంచి టిక్కెట్ కోసం పోటీ పడుతుండటమే విశేషం.

కిందటి ఎన్నికల్లో మాటలతో కత్తులు దూసుకున్న ప్రత్యర్థులు కాంగ్రెస్ నేత పొదేం వీరయ్య, టీడీపీ నేత సీతక్క... ఇప్పుడు ములుగులో పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. రేవంత్‌రెడ్డి పార్టీ మార్పుతో టికెట్‌ హామీతో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న సీతక్క... ఎలాగైనా స్థానం దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. టిక్కెట్ నాది అంటే నాదంటూ ఇద్దరు నేతలు ధీమాగా ఉన్నారు. మావోయిస్టు పార్టీలో పనిచేసి జనజీవన స్రవంతిలో కలిసిన సీతక్క... ఆ తర్వాత టీడీపీలో చేరారు. 2009లో కాంగ్రెస్ సిట్టింగ్ పొదేం వీరయ్యపై గెలిచి ఆదివాసీ, గిరిజనుల అభిమానాన్ని సంపాదించుకున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన సీతక్క... తర్వాత కాంగ్రెస్‌లో చేరి జాతీయ మహిళల కార్యదర్శిగా పనిచేస్తున్నారు. నియోజకవర్గంలో పట్టు ఉండటంతో సీతక్క.. కాంగ్రెస్‌ టిక్కెట్‌పై ధీమాతో ఉన్నారు. కానీ మాజీ ఎమ్మెల్యే పొదేం వీరయ్య కూడా టికెట్‌ తనకే వస్తుందన్న నమ్మకంతో ప్రచారం ప్రారంభించడంతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు.

ఈ పరిస్థితుల్లో ములుగు టికెట్‌ కేటాయింపు కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఒకరికి ఇస్తే మరొకరు అసమ్మతి నేతగా మారుతారనే ఇబ్బంది ఉంది. ఇప్పటికే ఇద్దరితో చర్చలు జరిపిన అధిష్ఠానంపై... ఒకరికి ములుగు టికెట్‌ ఇస్తే ఇంకొకరికి మరో స్థానం కేటాయించాలన్న ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో సీతక్కను భద్రాచలం నుంచి పోటీకి దింపాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే సీతక్క అక్కడికి వెళుతుందా? ఇక్కడ అయితే అభిమానం, చరిష్మా పనిచేస్తోంది. అక్కడికి వెళితే మొదటి నుంచి గ్రౌండ్‌వర్క్ చేయాల్సి వస్తుంది. మరి సీతక్క మేడారం వదిలి, రామయ్య సన్నిధికి వెళుతుందా లేదా అన్న చర్చ సాగుతుంది. ఏమైనా ఒక్క సీటు ఇద్దరు అభ్యర్థులతో కాంగ్రెస్ అధిష్టానం తలపట్టుకుంటుంది. ఇద్దరూ గిరిజన నేపథ్యంలో గెలిచి నిలిచిన వారే కావడంతో ఒక్కరికే టిక్కెట్ దక్కే అవకాశం ఉందన్న దానిపై క్లారిటీ రావట్లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories