ఎత్తిపోతలలో రికార్డుల ‘మేఘా’

ఎత్తిపోతలలో రికార్డుల ‘మేఘా’
x
Highlights

ఎత్తిపోతల పథకాల నిర్మాణంలో పంప్‌లు, మోటార్ల సామర్థ్యం కొలబద్ద ఒకప్పుడు హెచ్‌పి (హార్స్‌పవర్‌)లో ఉండేది. కానీ ఇప్పుడు పెరిగిన అవసరాలు, సాంకేతిక శక్తి...

ఎత్తిపోతల పథకాల నిర్మాణంలో పంప్‌లు, మోటార్ల సామర్థ్యం కొలబద్ద ఒకప్పుడు హెచ్‌పి (హార్స్‌పవర్‌)లో ఉండేది. కానీ ఇప్పుడు పెరిగిన అవసరాలు, సాంకేతిక శక్తి సామర్థ్యాలు నేపథ్యంలో అది మెగావాట్లకు చేరింది. హెచ్‌పిలో మోటార్లు, పంప్‌లు ఏర్పాటు నిర్వాహణ గగనమైపోగా ఇప్పుడు మెగావాట్లలో అంటే భారీస్థాయిలో పంప్‌లు, మోటార్లు ఏర్పాటు చేసి నిర్వహించడం మేఘా ఇంజనీరింగ్‌కు వెన్నతో పెట్టిన విద్యగా సాధ్యమవుతోంది. ఇంతవరకు దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం మీద ఏ కంపెనీ కూడా ఐదేళ్ళ కాలంలో ఏర్పాటు చేయలేని స్థాయిలో ఎత్తిపోతల పథకాలకు పంప్‌లు, మోటార్లను భారీ స్థాయిలో ఏర్పాటు చేసి వాటిని మేఘా విజయవంతంగా నిర్వహిస్తోంది.

2012 నుంచి ఇప్పటివరకు ఐదు భారీ ఎత్తిపోతల పథకాలను ఎంఈఐఎల్‌ తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసి ఘనత సాధించింది. తాజాగా పురుషోత్తపట్నం రెండో దశ పథకం క్రింద ఏలేరుకు నీటిని పంప్‌చేయడం ద్వారా ఎంఈఐఎల్‌ తన రికార్డును తానే అధిగమించింది.

మొత్తం ఐదు పథకాల క్రింద 17 పంపింగ్‌ స్టేషన్లలో 186 భారీ పంప్‌లు, మోటార్లను 731 మెగావాట్ల సామర్థ్యం మేరకు ఏర్పాటు చేసి ప్రత్యేకతను చాటుకుంది. ప్రపంచంలో ఇప్పటివరకు ఈజిప్ట్‌లోని ముబారక్‌ పంపింగ్‌ స్టేషన్‌ సామర్థ్యం పెద్దది. ఇది 228 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించింది. దీనిని మేఘా హంద్రినీవా ద్వారా అధిగమించి ప్రపంచంలో ఏ కంపెనీ కూడా చేయలేని విధంగా 731 మెగావాట్ల సామర్థ్యం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో అమలులోకి తెచ్చింది. ఇక దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఎంఈఐఎల్‌ చేపట్టిన ఎత్తిపోతల పథకాలు పరిగణలోకి తీసుకుంటే ఈ సామర్థ్యం మరింతగా పెరుగుతుంది.

తాజాగా పురుషోత్తపట్నం రెండో దశ కింద ఒక్కోక్కటి 4.8 మెగావాట్ల సామర్థ్యంతో 8 పంప్‌లను ఏర్పాటు చేసి నీటిని ఏలేరు ప్రాజెక్ట్‌కు తరలించేందుకు సిద్ధం చేసింది. ఇక్కడ నీటి పంపింగ్‌ ఎత్తు అధికంగా 68 మీటర్లు ఉండటం మరో రికార్డ్‌. హంద్రినీవా స్టేజ్‌-1 కింద 12 స్టేషన్లలో 129 పంప్‌లను 458.83 మెగావాట్ల సామర్థ్యంతో చేయడం ఓ రికార్డు. ముచ్చుమర్రి పథకం కింద 13 పంప్‌లను 48.1 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసింది. అదే విధంగా పట్టిసీమ, భక్తరామదాసు, పురుషోత్తపట్నం మొదటిదశ పథకాలను మేఘా పూర్తి చేసి నిర్వహిస్తున్న సంగతి తెలిసింది. పట్టిసీమ పథకం కింద 24 పంపుల ద్వారా 113 మెగావాట్ల సామర్థ్యంతో నీటిని అందిస్తోంది. పురుషోత్తపట్నం మొదటి దశ కింద 10 పంప్లను ఒక్కొక్కటి 5.22 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసింది.
తెలంగాణలోని భక్తరామదాసు ఎత్తిపోతల పథకాన్ని మొత్తం 21 మెగావాట్ల సామర్థ్యంతో రెండు పంప్‌లను ఏర్పాటు చేసింది. వీటిలో మరో ప్రత్యేకత ఏమంటే నదుల అనుసంధానం. కృష్ణా-పెన్నా, కృష్ణా-గోదావరి, గోదావరి-ఏలేరు నదులను అనుసంధానం చేసిన అరుదైన ఘనత కూడా ఎంఈఐఎల్‌కు దక్కింది.

దేశంలో తొలి నదుల అనుసంధానం నర్మదా-క్షిప్రా సింహాస్థ ఎత్తిపోతల పథకం పూర్తి చేసిన అరుదైన అవకాశం ఎంఈఐఎల్‌కు దక్కింది.

తాజాగా పురుషోత్తపట్నం...సుమారు 24 టిఎంసీల సామర్ధ్యం ఉన్న ఏలేరు జలాశయం గత దశాబ్ధకాలంలో పూర్తిగా నిండలేదు. ఎప్పుడూ 10 నుంచి 12 టిఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉండేది. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిర్మాణం ద్వారా ఆ కష్టాలను దూరం చేయబోతోంది మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌). ఉత్తరాంధ్ర సుజల స్రవంతిలో భాగంగా చేపట్టిన ఈ పథకం తూర్పు గోదావరి జిల్లాలోని ప్రజలు, ముఖ్యంగా రైతులతో పాటు విశాఖపట్నం ప్రజల తాగు, పారిశ్రామిక అవసరాలు, విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ ఎదుర్కొంటున్న నీటి కొరతను తీర్చనుంది. ఇక నుంచి ఏలేరు జలాశయం పూర్తిగా నిండి నిండుకుండలా తొణికిసలాడనుంది. విశాఖ నగర ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్యకు ఈ పథకం పరిష్కారం చూపనుంది. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నం గ్రామం వద్ద తొలిదశలో చేపట్టారు. అదే సమయంలో రెండో దశను జగ్గంపేట మండలం రామవరం వద్ద నిర్మించాలని ప్రతిపాదించి రెండు దశల పనులను మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌కు రూ. 1600 కోట్ల అంచనా వ్యయానికి జవనరుల శాఖ పరిపాలన అనుమతులు ఇచ్చింది. నిపుణులైన, అంకితభావం కలిగిన సిబ్బంది, అధునాతన పరికరాలతో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని ఒక సవాలుగా తీసుకుని మేఘా పూర్తి చేసింది.

గత ఏడాది ఆగస్టు 15న పురుషోత్తపట్నం తొలిదశను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. రెండు మోటార్ల ద్వారా గత నీటి సంవత్సరంలో 1.6 టిఎంసీల నీటిని గోదావరి నుంచి ఏలేరు కాలువతో పాటు రిజర్వాయర్‌లోకి ఎత్తిపోశారు. ఈ నీరు పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ ద్వారా ఏలేరు జలాశయానికి చేరుకుంది. గోదావరి నుంచి సముద్రంలో కలిసే నీటిని సద్వినియోగం చేసుకునేందుకు ఈ ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశారు. నిర్మాణ ప్రాంతం గోదావరి నది ఒడ్డుకు ఆనుకుని ఉండటం, పైపులైన్లు పంట పొలాల మధ్య వేయాల్సి ఉండటం, నిత్యం నీటి ఊటతో నిండి ఉండటం వంటి అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నప్పటికి మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ గడువులోగా ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసిందని అసోసియేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కె. రంగరాజన్‌ చెప్పారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం మొదటి దశలో 57 మెగావాట్ల విద్యుత్తు సామర్థ్యం కలిగిన 10 వర్టికల్‌ టర్బయిన్‌ పంపులను వినియోగించారు. ఒక్కో పంపు 10 క్యూమెక్స్‌ నీటిని ఎత్తిపోసే సామర్థ్యం కలిగి, 10.148 కిలోమీటర్ల పొడవుతో ఐదు వరుసల పైపులైన్లను ఇక్కడ నిర్మించారు.

రామవరం వద్ద నిర్మించిన రెండో దశ నుంచి గోదావరి నదికి వరద ఉన్న సమయంలో 1400 క్యూసెక్కుల నీటిని పోలవరం ఎడమ ప్రధాన కాలువ నుంచి ఏలేరు జలాశయంలోకి ఎత్తి పోయనున్నారు. 68 మీటర్ల ఎత్తుకు నీటిని తోడతారు. ఐదు క్యూమెక్స్‌ సామర్థ్యం కలిగిన ఎనిమిది పంపులను ఏర్పాటు చేశారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ నుంచి నీటిని ఎత్తిపోసి ఏలేరు జలాశయానికి తరలించేందుకు 13.12 కిలోమీటర్ల దూరం రెండు వరుసల్లో పైపులైను నిర్మించారు. పోవరం ఎడమ ప్రధాన కాలువకు ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలను ఉపయోగించుకుని పిఠాపురం బ్రాంచ్‌ కాలువ, పోలవరం ఎడమ ప్రధాన కాలువ, ఏలేరు రిజర్వాయరు పరిధిలోని 2.15 లక్షల ఎకరాలకు సాగునీరు అందించటమే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం. పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా 12 టిఎంసీల నీటిని విశాఖ ప్రజల తాగునీటి అవసరాలతో పాటు పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించనున్నారు. ఈ పధకం ద్వారా ఏడాదికి రూ. 200 కోట్ల ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వ అంచనా. పురుషోత్తపట్నం మొదటి దశ నిర్మాణానికి అవసరమైన 254 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించి మేఘా సంస్థకు గత ఏడాది మే నెలలో అందించింది. నాలుగు నెలల్లోనే తొలిదశను పూర్తి చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభింపచేసింది.

అదే విధంగా పురుషోత్తపట్నం రెండో దశను రామవరంతో పాటు మరికొన్ని గ్రామాల్లో 115 ఎకరాలను ప్రభుత్వం సేకరించి ఇవ్వడం ద్వారా మేఘా ఇంజనీరింగ్‌ యుద్ధ ప్రతిపాదికన పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories