జాతీయ పార్టీలతో అవగాహన కుదిరితే మారే సమీకరణాలేంటి?

జాతీయ పార్టీలతో అవగాహన కుదిరితే మారే సమీకరణాలేంటి?
x
Highlights

ఒకవైపు ప్రాంతీయ పార్టీలు బలంగా పాతుకుపోతుంటే, మెజారిటీ స్థానాలను సంపాదించుకోవడం ఏ జాతీయ పార్టీకి అంత ఈజీ కాదు. మెజారిటీకి దగ్గరగా రావడం కూడా కష్టమే....

ఒకవైపు ప్రాంతీయ పార్టీలు బలంగా పాతుకుపోతుంటే, మెజారిటీ స్థానాలను సంపాదించుకోవడం ఏ జాతీయ పార్టీకి అంత ఈజీ కాదు. మెజారిటీకి దగ్గరగా రావడం కూడా కష్టమే. ఎప్పుడైతే, ఏ ఒక్క జాతీయ పార్టీ మెజారిటీ స్థానాలను సంపాదించుకోలేదో... ప్రాంతీయ పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం మినహా వేరే దారి లేదు. అలాంటప్పుడు ప్రాంతీయ పార్టీలతో జాతీయ పార్టీలు అవగాహన కుదర్చుకుంటాయా? 1999–2004 మధ్య అధికారంలో ఉన్న ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వమైనా, 2004–2009 మధ్య అధికారంలో వున్న యూపీఏ ప్రభుత్వమైనా, అస్థిరత– స్థిరత్వం మధ్య ఊగిసలాడినప్పటికీ పూర్తికాలం కొనసాగాయి. అది ఒక విధంగా గొప్ప విషయమే. ప్రాంతీయపార్టీల సంఖ్య పెరగడమంటే, రాజకీయ పోటీతత్వంలో మార్పులు రావడమే. మొదట్లో అసెంబ్లీలో జాతీయపార్టీలకు పోటీగా ఉన్న ప్రాంతీయ పార్టీలు... తర్వాత బలం పుంజుకున్నాయి. పార్లమెంట్‌లో జాతీయపార్టీలను శాసించే స్థాయికి చేరుకున్నాయి. ఒక్కోరాష్ట్రంలో, ఒక్కో ప్రాంతీయపార్టీకి ప్రజల మద్దతు– ఓటర్ల మద్దతు లభిస్తుండటంతో బలీయమైన శక్తులుగా మారాయి. జాతీయ పార్టీలను లెక్కలోకి తీసుకోని పరిస్థితులు వచ్చేశాయి. కొన్నిరాష్ట్రాలలో ప్రధాన పోటీ ఒక ప్రాంతీయ పార్టీకి, ఏదో ఒక జాతీయ పార్టీకి మధ్యన ఉంటే... తమిళనాడులాంటి రాష్ట్రాలలో ఆ పోటీ ఒక ప్రాంతీయ పార్టీకి, మరో ప్రాంతీయ పార్టీకి మధ్యనే నడుస్తోంది.

ప్రాంతీయ పార్టీలతో పోల్చిచూస్తే, దేశం మొత్తంమీద జాతీయపార్టీలకు పోలైన ఓట్ల శాతం తగ్గుకుంటూ వస్తోంది. ప్రధానంగా 1996 ఎన్నికల తరువాత ఈ పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు గెలిచిన స్థానాల సంఖ్యను పెంచుకుంటూ పోతున్న ప్రాంతీయపార్టీలు, మరో పక్క ఓటింగ్ శాతాన్నీ ఆ స్థాయిలోనే పెంచుకుంటున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించిన బీజేపీ ఓటింగ్ శాతం కేవలం 31 మాత్రమే. భాగస్వామ్య పక్షాలతో కలిపితే 38.5%, అలాగే కాంగ్రెస్ ఓటింగ్ శాతం 19.3. భాగస్వామ్య పక్షాలతో కలిపితే 23%. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీకి, ప్రతిపక్షంలో వున్న కాంగ్రె‍‍స్‌కు కలిపి వచ్చిన ఓట్లు కేవలం 50% మాత్రమే. అంటే మిగిలిన ఓట్లన్నీ ప్రాంతీయ పార్టీలవే!

రాష్ట్రాల పాలన ప్రాంతీయపార్టీల చేతుల్లో ఉండాలని కోరుకుంటున్నారు ప్రజలు. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా కేంద్రం నడుచుకోవాలంటే పార్లమెంటులో కూడా వాటికి గణనీయమైన స్థానాలను గెలిపించాలని ఓటర్లు భావిస్తున్నారు. అందుకే రానున్న లోక్‌సభ ఎన్నికలలో ప్రాంతీయ పార్టీలదే హవా కానుందంటున్నారు విశ్లేషకులు. ఎన్నికల తర్వాత యూపీఏ, ఎన్డీఏలు ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తాయి. డీఎంకే, అన్నా డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ, బహుజన సమాజ్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, తెలుగుదేశం, ఎన్‌సీపీ, జనతాదళ్, శివసేన, అకాలీదళ్, బిజూ జనతాదళ్, రాష్ట్రీయ జనతాదళ్, వైఎస్‌ఆర్‌సీపీ లాంటి పార్టీల మద్దతు కీలకమవుతుంది. వీటిలో చాలావరకు, ప్రస్తుతానికి యూపీఏ, ఎన్డీఏలలో ఏదో ఒక దాంట్లో భాగస్వాములుగా ఉన్న పార్టీలే. అన్నీ కలిసి సుమారు 250కి పైగా స్థానాలు గెలుచుకునే అవకాశం వుంది. వీరంతా కలిసి ఒక ప్రాంతీయ పార్టీల ఫ్రంట్‌గా ఏర్పడితే జాతీయ పార్టీల పరిస్థితి డోలాయమానంలో పడినట్లేనన్నది విశ్లేషకుల మాట. వాస్తవానికి... ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దేశ ప్రజలలో ఒకరకమైన ఉత్కంఠను రేపాయ్. జాతీయస్థాయి రాజకీయ బలబలాలలో మార్పు రాలేకపోయినా... దేశ రాజకీయాలపై ప్రభావం చూపనుండటం ఖాయమన్న సంకేతాలనిచ్చాయ్. ఈ ఎన్నికలలో కమలం వాడుతూ.. కాంగ్రెస్ పుంజుకుంటున్న విషయం తేలిపోగా... ప్రాంతీయ పార్టీల ప్రభావం పెరుగుతున్న నిజం దేశానికి చాటిచెప్పినట్టయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories