కూటమి కథా చిత్రంలో అసలు హీరోలోవెవరు?

కూటమి కథా చిత్రంలో అసలు హీరోలోవెవరు?
x
Highlights

తెలంగాణలో ఎన్నికల వేడి కాక రేపుతోంది. అధికార పార్టీ అభ్యర్ధులను ప్రకటించి ప్రచారం చేసేసుకుంటుంటే.... ఆ పార్టీని ఓడించడానికి జట్టు కట్టిన కూటమి మాత్రం...

తెలంగాణలో ఎన్నికల వేడి కాక రేపుతోంది. అధికార పార్టీ అభ్యర్ధులను ప్రకటించి ప్రచారం చేసేసుకుంటుంటే.... ఆ పార్టీని ఓడించడానికి జట్టు కట్టిన కూటమి మాత్రం సీట్ల పంపకాల చిక్కుముడులు వదుల్చుకోలేక తికమకపడుతోంది. పైకి కూటమి లోన కుస్తీ తప్పదేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయ్. ఏడాది పొడవునా కార్యకర్తల సందడితో ఉండే గాంధీ భవన్, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ భద్రతా బలగాల అదుపులోకి వెళ్లిపోయాయి. సీట్ల సిగపట్లతో వార్ జోన్‌ని తలపిస్తున్నాయి పార్టీ ఆఫీస్‌లు..

పోలింగ్‌కి పట్టుమని మూడు వారాలైనా సమయం లేని టైమ్ లో మహా కూటమిని ఇంకా పొత్తుల చిక్కు ముడులు చుట్టేస్తున్నాయి. వారాలు, రోజులు, గంటల తరబడి కాంగ్రెస్ వార్ రూమ్ లో ఎడ తెగని చర్చలు జరుగుతున్నా.. అభ్యర్ధుల ఎంపిక మాత్రం అంత సులభంగా పూర్తవడం లేదు.. టిక్కెట్లు ఆశిస్తున్న అభ్యర్ధులు విపరీతమైన టెన్షన్ తో నిద్ర, తిండి లేక అలమటిస్తుంటే.. వారి అనుచరులు వీధుల్లో చేరి అలజడి సృష్టిస్తున్నారు.. తమ నేతకు టిక్కెట్ కేటాయించకపోతే.. రణరంగం సృష్టిస్తామని ఒకరు.. రెబల్ గా తిరగబడతామని మరొకరు.. పార్టీ మారిపోతామని ఇంకొకరు.. కూటమి పెద్దలను బెదిరిస్తున్నారు.. సీట్ల సర్దుబాటు పేరుతో జరుగుతున్న కాలయాపన మొదటికే మోసం తెస్తుందేమోనన్న భయం నేతలను వెంటాడుతోంది. నవంబర్ నెలలో పక్షం రోజులు గడిచిపోయాయి..ఎన్నికలకు మరో పక్షం రోజులు మాత్రమే మిగిలున్నాయి.. కానీ సీట్ల చిక్కు ముడులు వీడటం లేదు. ఒకరికి ఇస్తే.. మరొకరు తిరగబడుతుండటంతో కాంగ్రెస్ పెద్దలు జుట్టు పీక్కుంటున్నారు. టిఆరెస్ ను ఓడించాలని పట్టుదలతో ఉన్న పార్టీలన్నీ అభ్యర్ధుల ఎంపికలోనే ఐక్యత సాధించలేక తల్లకిందులైపోతున్నాయి.. టిక్కెట్ వచ్చే దెప్పుడు.. ప్రచారం చేసుకునేదెప్పుడు? టిక్కెట్ ప్రకటించినా.. మళ్లీ అసంతృప్తులతో అదికాస్తా లాక్కుంటారేమోనన్న భయమూ అభ్యర్ధులను వేధిస్తోంది.. ప్రత్యర్థి పార్టీ నామినేషన్లు వేసేసుకుని జనంలోకి వెళ్లిపోతుంటే.. టిక్కెట్ వస్తుందో రాదో తెలియని అయోమయంలో మహాకూటమి అభ్యర్ధులున్నారు.. వాస్తవానికి టిక్కెట్ కేటాయింపుకు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న మార్గదర్శకాలు బాగానే ఉన్నా.. వాస్తవంలో నేతలెవరూ ఆరూల్స్ ను అంగీకరించడానికి సిద్ధంగా లేరు.. సీనియర్లను పార్లమెంటుకు పంపాలని పార్టీ భావిస్తున్నా.. వారు మాత్రం అసెంబ్లీకే సై అంటున్నారు..

ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకుని కొంత ప్రచారం కూడా చేసేసుకున్న శేరిలింగంపల్లి టిడిపి నేత మొవ్వ సత్యనారాయణ, మన్నెగోవర్ధన్ లాంటి నేతలకు ఈ ఎన్నికలు ఆత్మహత్యా సదృశ్యంగా మారిపోయాయి.. జూబ్లీ హిల్స్ సీటును కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ కు కేటాయించడాన్ని టిడిపి నేతలు వ్యతిరేకిస్తున్నారు.ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్ స్థానాల్లో అభ్యర్ధుల ఎంపిక రచ్చ రచ్చగా మారుతోంది. ఇప్పటికే ఎంతో ఖర్చు పెట్టుకున్న నేతలు అవసరమైత రెబల్స్ గా దిగిపోయేందుకు సిద్ధపడుతున్నారు.. మరోవైపు సీనియర్లకు షాకిస్తే.. వారి అనుచరులతో వీరంగం సృష్టిస్తున్నారు.. పొన్నాల భవితవ్యం ఇంకా తేలకపోవడం ఆయన అనుచరుల్లో కలవరం నింపుతోంది. అలాగే మర్రి శశిధర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, జానారెడ్డి కుమారుడు సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డిల భవితవ్యం అయోమయంలో పడిపోయింది. మరోవైపు సిిపిఐ లాంటి పార్టీలు కూడా 9 సీట్లు కావాలని చర్చలను ప్రతిష్టంభింప చేసి చివరకు మూడు సీట్లకు సర్దుకోడానికి చాలా టైమే పట్టింది. వారాల తరబడి చర్చల తర్వాత12 సీట్లలో పోటీ తధ్యమని టిజేఎస్ సంకేతాలిచ్చింది.. కాంగ్రెస్ ఇప్పటికే కేటయించిన సీట్లలో టిజెఎస్ పొత్తులో ఉన్నామంటూనే పోటీకి దిగడంతో గందరగోళం రేగుతోంది. మరోవైపు టిఆరెస్, అందరికన్నా ముందే అభ్యర్ధులను ప్రకటించి సగం ప్రచారాన్ని కూడా పూర్తి చేసేసింది. బిజెపి కూడా ఇప్పటి వరకూ మూడు విడతల జాబితాలు ప్రకటించేసింది. కానీ మహా కూటమి మాత్రం ఇంకా సీట్ల సర్దుబాటులోనే మునిగి తేలుతోంది. ఈ చర్చల కసరత్తు ఓ రెండు నెలల ముందే జరిగి ఉంటే ఈ పాటికి ఒక కొలిక్కి వచ్చి ఉండేవన్న వాదనలూ వినిపిస్తున్నాయి. కూటమి సీట్ల సర్దుబాటు మరో రెండు రోజుల్లో పూర్తి కాకపోతే మాత్రం ప్రచారానికి సమయం చాలక అభ్యర్ధులు నానా ఇబ్బందులు పడే అవకాశముంది.ప్రస్తుతానికి టిక్కెట్లు దక్కని వారికి గెలిచాక ఉన్నత పదవులిస్తామంటూ కాంగ్రెస్ వేస్తున్న ఎర ఎంత వరకూ పనిచేస్తుందో చూడాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories