తెలంగాణ ఎన్నికలపై లగడపాటి జోస్యం... మరి హిట్టా..ఫట్టా..!

తెలంగాణ ఎన్నికలపై లగడపాటి జోస్యం... మరి హిట్టా..ఫట్టా..!
x
Highlights

ఆంధ్రా ఆక్టోపస్‌ లగడపాటి రాజగోపాల్‌, తెలంగాణ ఎన్నికలపై వెల్లడించిన సర్వే జోస్యం సంచలనం సృష్టిస్తోంది. ఏ పార్టీ గెలుస్తుందో చెప్పకుండా, అందర్నీ...

ఆంధ్రా ఆక్టోపస్‌ లగడపాటి రాజగోపాల్‌, తెలంగాణ ఎన్నికలపై వెల్లడించిన సర్వే జోస్యం సంచలనం సృష్టిస్తోంది. ఏ పార్టీ గెలుస్తుందో చెప్పకుండా, అందర్నీ సర్‌ప్రైజ్‌ చేస్తూ, పెద్ద సంఖ్యలో ఇండిపెండెంట్లదే హవా అని తేల్చేసి, సెన్సేషన్‌ చేశారు. దాదాపు పదిమంది స్వతంత్రులు గెలుస్తారని చెప్పి కలకలానికి కారణమయ్యారు. అలాగని ఇండిపెండెంట్ అభ్యర్థులే కింగ్‌మేకర్లు అయ్యే అవకాశంలేదన్న లగడపాటి, ఏదో ఒక పార్టీకే సంపూర్ణ మెజారిటీ వస్తుందన్నారు. కీలకమైన సంఖ్యలో స్వతంత్రులు గెలుస్తారని చెప్పి, పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. లగడపాటి చెబుతున్నట్టు ఇండిపెండెంట్ అభ్యర్థులే కింగ్‌మేకర్లుగా అవతరిస్తారా. అటు బీఎల్‌ఎఫ్‌ కూడా కొన్ని స్థానాల్లో జయాపజయాలను నిర్దేశిస్తుందా? ఎస్పీ,బీఎస్పీ, శివసేన, ఇలా చిన్నాచితక పార్టీలు ఓట్లను చీలిస్తే, అంతిమంగా ఎవరికి లాభం.. ఎవరికి నష్టం.. ఆంధ్రా ఆక్టోపస్‌ సర్వే సారాంశమేంటి..?

దేశవ్యాప్తంగా అత్యంత ఉత్కంఠ రేపుతున్నాయి తెలంగాణ ఎన్నికలు. గెలుపెవరిది అన్నదానిపై ఎన్నో సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. బెట్టింగ్‌లు కూడా కోట్లలో సాగుతున్నాయి. రోజుకో పార్టీ ట్రెండింగ్‌లో ఉందంటూ, ఆన్‌లైన్‌ పోల్స్‌‌ కూడా, ఈ టెన్షన్‌ను పీక్స్‌కు తీసుకెళ్తున్నాయి. రోజుకో సర్వేతో, తమదే విజయమని, ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నా, లోలోపల కంగారుపడుతున్నాయి. మరింతగా ప్రచారం చేస్తున్నాయి. అభ్యర్థులు సైతం కంటిమీద కునుకులేకుండా గడపగడపా తొక్కుతూ, ఓటర్లను అభ‌్యర్థిస్తున్నారు. ఓటరు నాడి అంతుపట్టడం లేదని రాజకీయ పండితులే తలలు పట్టుకుంటున్నారు. ఇలాంటి సమయంలో, ఎన్నికల సర్వేల దిట్ట, ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరొందిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, మరింత కలకలం సృష్టించేలా, తన సర్వే నివేదికలను వెల్లడించారు.

తెలంగాణ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థుల హవా ఉందని తేల్చేశారు లగడపాటి. 8 నుంచి 10 మంది ఇండిపెండెంట్లు గెలుస్తారని, తన సర్వేల్లో తేలిందని అంచనా వేశారు. లగడపాటి సర్వే రిపోర్ట్స్, పార్టీల్లో లేనిపోని భయాలను రెట్టింపు చేస్తున్నాయి. రోజుకో రెండు స్థానాల చొప్పున సర్వే ఫలితాలు విడుదల చేస్తానన్న లగడపాటి, ఏకంగా నియోజకవర్గాలు, ఆయా అభ్యర్థుల పేర్లూ చెప్పారు. ఆయన చెప్పిన ఇద్దరు అభ్యర్థులూ, కాంగ్రెస్‌ రెబల్సే. లగడపాటి సర్వేనే నిజమైతే, ప్రధాన పార్టీలకు ఇబ్బందే. ఏ పార్టీకీ మెజారిటీ మార్క్ ‌రాకపోతే, స్వతంత్రులే కింగ్‌ మేకర్లుగా అవతరించే ఛాన్సుంది.

ఈసారి తెలంగాణ ఎన్నికల్లో స్వతంత్రులు భారీ సంఖ్యలోనే పోటీపడుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత, అన్ని పార్టీలతో సహా మొత్తం పోటీ చేస్తున్న అభ్యర్థుల సంఖ్య 1825. వీరిలో టీఆర్ఎస్‌ 119, ప్రజాకూటమి 125, బీజేపీ 119, బీఎల్‌ఎఫ్‌ 109 అభ్యర్థులు. వీళ్లందర్నీ కలుపుకున్నా దాదాపు 472 మంది ప్రధాన పార్టీల అభ్యర్థులు. అంటే, 1825లో ప్రధాన పార్టీల అభ్యర్థుల సంఖ్య 472ను తీసివేస్తే, దాదాపు 1353 మంది ఇతరులు ఉన్నారు. అంటే వీరిలో ఎస్పీ, బీఎస్పీ, శివసేనను మినహాయిస్తే, అత్యధిక సంఖ్యలో మిగిలింది స్వతంత్రులే.

స్వతంత్రులుగా పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో అత్యధికులు, టీఆర్ఎస్, కాంగ్రెస్‌, టీడీపీ వంటి ప్రధాన పార్టీల్లో టికెట్‌ దొరకనివారే. పొత్తుల కారణంగా ఆగ్రహంతో రగిలిపోయిన వీరంతా, రెబెల్స్‌గా బరిలోకి దిగుతున్నారు. వీళ్లలో కొందరు ప్రధాన పార్టీలకే ముచ్చెమటలు పట్టిస్తున్న మాట వాస్తవం. వందలు, వేల నుంచి ఓట్లు చీల్చేవారు మరికొందరున్నారు. కొద్దిపాటి మెజారిటీతోనే, అభ్యర్థుల తలరాతలు మారిపోయిన ఘట్టాలున్నాయి. మరి వీరు ఏ అభ్యర్థి గెలుపుకు గండికొడతారన్నది, పార్టీల్లో గుబులు రేపుతోంది.

మరోవైపు సీపీఎం నేతృత్వంలోని బీఎల్‌ఎఫ్‌ కూడా, పెద్ద పార్టీలకు టెన్షన్‌ పుట్టిస్తోంది. సంప్రదాయ పార్టీలతో దశాబ్దాలుగా కొనసాగిస్తున్న పొత్తులను పక్కనపెట్టి 28 చిన్న పార్టీలను కలుపుకొని ఈ కూటమిని ఏర్పాటు చేసింది సీపీఎం. తొమ్మిది స్థానాల్లో, జయాపజయాలను తారుమారు చేసే ఛాన్సుంది. 5వేల నుంచి 10వేల వరకూ ఓట్లను సాధించే స్థానాలు యాభై వరకూ ఉన్నాయని బీఎల్‌ఎఫ్‌ వర్గాలు విశ్వాసం వ్యక్తంచేస్తున్నాయి. వారు అనుకున్నట్లే జరిగితే.. ఇక్కడ గెలుపోటములను నిర్ణయించడంలో ఆ కూటమి అభ్యర్థులు కీలకం కానున్నారు.

ఇలా లగడపాటి సర్వే స్వతంత్రులు కీలకం కాబోతున్నారని చెబుతుంటే, ఇటు బీఎల్‌ఎఫ్‌ కూడా, అభ్యర్థుల తలరాతలను మారుస్తానంటోంది. అటు ఎన్నోకొన్ని సీట్లతో కింగ్‌మేకర్‌ అవుతామని, బీజేపీ కలలుకంటోంది. ఎంఐఎంది కూడా ఇదే కల. ఇక ఎస్పీ, బీఎస్పీ, శివసేన నుంచి కూడా, కొందరు ప్రముఖ నేతలు పోటీ చేస్తుండటంతో, ఓట్లు చీలి, అంతిమంగా తమ అభ్యర్థికే ఇబ్బందని, ప్రధాన పార్టీలు భయపడిపోతున్నాయి. అయితే లగడపాటి సర్వే, ఒట్టి బూటకమని, టీఆర్ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ అన్నారు. ఇలాంటి సర్వేలు నమ్మొద్దని పిలుపునిచ్చారు.

మొత్తానికి లగడపాటి సర్వే, ఎన్నికల సమరంలో మరింత వేడి రగిలిస్తోంది. చూడాలి, ఆంధ్రా ఆక్టోపస్‌ జోస్యం నిజమవుతుందో, తుస్సుమంటుందో.

Show Full Article
Print Article
Next Story
More Stories