Top
logo

క్వారీలపై ఘోరీలు

Highlights

మరో ఉద్యమం ఉపిరి పోసుకుంటోంది.. నల్లక్వారీ ని నిషేధించాలని అడవిబిడ్డలు ఆందోళన చేస్తున్నారు. విశాఖ ఏజెన్సీ ని...

మరో ఉద్యమం ఉపిరి పోసుకుంటోంది.. నల్లక్వారీ ని నిషేధించాలని అడవిబిడ్డలు ఆందోళన చేస్తున్నారు. విశాఖ ఏజెన్సీ ని చుట్టుముట్టిన మైనింగ్ మాఫియా కు వ్యతిరేకంగా గిరిజనులు ఉద్యమిస్తున్నారు.

విశాఖజిల్లా ఏజెన్సీ అంటేనే పచ్చని కొండలు, పారే జలపాతాలు...ప్రకృతి రమణీయత కు పెట్టింది పేరు విశాఖ ఏజెన్సీ. అంతే కాదు బాక్సైట్, బ్లాక్ స్టోన్ వంటి అపార ఖనిజ సంపద కు నిలయం కూడా... అందుకే ఇప్పుడు అక్రమార్కులకు అమాయక గిరిజన ప్రాంతాలు కాసులు కురిపించే కొండలుగా కనిపిస్తున్నాయి. విశాఖ జిల్లా హుకుంపేట మండలం లో ములియపుట్టు పంచాయితీ, కుల్పడు గ్రామం భూమిలో సర్వే నెంబర్ 1/14 లో రాజేంద్రప్రసాద్ అనే వ్యక్తికి రోడ్డు మెటల్ & బిల్డింగ్ స్టోన్ కోసం ప్రభుత్వ అధికారులు 2008 లో 2.9 హెక్టార్లలో గిరిజనుల పోడు భూమిలో అనుమతులు మంజూరు చేశారు. తాజాగా 2017 నుండి 2022 వరకు మైనింగ్ కొనసాగించేందుకు అనుమతులు మంజూరు చేశారు. దీంతో అడ్డగోలుగా మైనింగ్ చేయడం మొదలైంది. చుట్టూ వున్న పంటలు, నీరు కలుషితం అవుతుండడంతో గిరిజనులు అక్కడ మైనింగ్ చేయడానికి వీలు లేదని అడ్డుకుంటున్నారు.

మైనింగ్ జరుగుతున్న ప్రాంతంలో సుమారు 40 ఎకరాల మెట్టభూముల్లో గిరిజనులు పోడు వ్యవయసాయం చేస్తున్నారు. ప్రస్తుతం నీరు, వాయు, శబ్ద కాలుష్యం వలన వీరంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. క్వారీ చుట్టు పక్కల గూడ, లకేపుట్టు,మర్రిపుట్టు,వల్లంగిపుట్టు,మెట్టవీధీ,వాంగ్ మామిడి,గోచారి, కోడేలు గ్రామాల్లో వివిధ తెగల గిరిజనులు నివసిస్తున్నారు. మైనింగ్ జరిగే ప్రాంతాల్లో ముందు అక్కడ గ్రామస్తుల ఆమోదంతీసుకోవాలి, గ్రామసభలు నిర్వహించాలి. అలాంటివేమి చేయకుండానే స్థానిక ఎమ్మెల్యే అండదండలతో అనుమతులు పొందారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. తమ ఓట్ల తో గెలిచిన నాయకులు తమ బాధలు పట్టించుకోవడం లేదంటూ అందోళన వ్యక్తం చేస్తున్నారు.

పరిమితికి మించి బ్లాస్టింగ్ లు చేయడం వలన వచ్చే కాలుష్యంతో అనేక రోగాల బారిన పడుతున్నారు. శ్వాస కోశ సంబంధిత వ్యాధులతో మరణాలు సంభవిస్తున్నాయి. పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతోంది. దీంతో తమ ప్రాంతాల్లో క్వారీ చేయడానికి వీలు లేదని గిరిజనులు ఉద్యమ బాట పట్టారు. గిరిజన, అటవీ హక్కు ల చట్టాలు, మైనింగ్ చట్టాలకు విరుద్దంగా క్వారీలు నడుపుతున్నారని గిరిజనులు వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story