Top
logo

కేటీఆర్‌... ట్రబుల్‌ షూటర్‌.. అసంతృప్తులు శాంతిస్తారా?

కేటీఆర్‌... ట్రబుల్‌ షూటర్‌.. అసంతృప్తులు శాంతిస్తారా?
X
Highlights

గుచ్చుకుంటున్న గులాబీలను వరుసలో పెడుతున్నారు. పువ్వులన్నీ ఒకేదారంలో అల్లుకుపోతే, చూడచక్కగా ఉంటుందని...

గుచ్చుకుంటున్న గులాబీలను వరుసలో పెడుతున్నారు. పువ్వులన్నీ ఒకేదారంలో అల్లుకుపోతే, చూడచక్కగా ఉంటుందని నచ్చజెప్పుతున్నారు. ఎంతకీ పొసగని రోజెస్‌ను, నిర్ధాక్షిణ్యంగా తీసి అవతలపాడేస్తున్నారు. ఆశించి భంగపడి ఎదురు తిరుగుతున్న ఎర్ర గులాబీలపై, రామబాణం సంధించారు గులాబీ దళాధిపతి.
టీఆర్ఎస్‌ అధినేత ఏకంగా 105 మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించి, సంచలనం సృష్టించారు. కేవలం ఒకట్రెండు స్థానాల్లో తప్ప, సిట్టింగ్‌లకే అవకాశమిచ్చారు. అందులోనూ ఫిరాయింపు ఎమ్మెల్యేలకూ, అవే స్థానాలిచ్చారు. దీంతో సహజంగానే ఏళ్ల తరబడి ఆశలు పెట్టుకున్న ఆశావహులకు, తీవ్రంగా నిరాశ కలిగింది. చాలాచోట్ల రోడ్ల మీదికొచ్చి నిరసన వ్యక్తం చేశారు. అభ్యర్థులను మార్చాలని డిమాండ్ చేశారు. రెబల్‌గా బరిలోకి దిగుతామని హెచ్చరించారు కూడా. దీంతో అసంతృప్తి జ్వాలలు ఇలాగే ఎగసిపడితే, ఓట్లు చీలి ఇబ్బందులు తప్పవని గ్రహించిన టీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌, అసమ్మతులను చల్లార్చేందుకు, ఏకంగా తనయుడు కల్వకుంట్ల తారక రామారావునే రంగంలోకి దించారు.

దీంతో ప్రచారాన్ని సైతం పక్కనపెట్టి, ఇంటిని సరిదిద్దే పనిలో బిజీగా ఉన్నారు కేటీఆర్. గత 20-25 రోజులుగా బుజ్జగింపుల పర్వాన్ని సాగిస్తున్నారు. వచ్చేది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని, ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని కొందరికి హామీ ఇస్తున్నారు. మరికొందరికి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్‌ పదవులు, ఇతర అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇస్తున్నారు. టీఆర్‌ఎస్‌ను నమ్ముకుంటే రాజకీయ భవిష్యత్తుకు ఢోకా ఉండదని, ప్రగతి భవన్‌కు పిలిపించుకుని, మాట్లాడి, ఖుషీగా పంపించేస్తున్నారు. అంతేకాదు, అభ్యర్థుల మార్పు ప్రసక్తేలేదని చెప్పి, ఆశావహులకు ఫుల్‌ క్లారిటీ ఇవ్వడమే కాదు, గందరగోళానికి తెరదించే ప్రయత్నం చేశారు.

అసంతృప్తులను తనదైన శైలిలో బుజ్జగిస్తున్నారు కేటీఆర్. ఇంకా చాలా చోట్ల తిరుగుబాటు బావుటా ఎగరేసే నాయకులతోనూ మాట్లాడుతున్నారు. అయినప్పటికీ, కొందరు నేతలు అధిష్ఠానం ఆదేశాలను పెడచెవిన పెడుతున్న నేపథ్యంలో, కఠినంగా వ్యవహరించాలని డిసైడయ్యారు. మునుగోడుకు చెందిన పార్టీ నేత వేనేపల్లి వెంకటేశ్వరరావుపై బహిష్కరణ వేటు వేశారు. పలు నియోజకవర్గాల్లో రెబల్స్‌గా ఉన్న టీఆర్‌ఎస్‌ నేతలకు ఇది ఒక హెచ్చరిక సంకేతమని పార్టీ వర్గాలకు స్పష్టం చేశారు కేటీఆర్. మళ్లీ రానున్నది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనన్న విషయాన్ని టికెట్‌ దక్కని నేతలు పరిగణనలోకి తీసుకోకపోవటం ఆత్మహత్య సదృశ్యమేనని, చెబుతున్నారు. బుజ్జగింపులకు వినకపోతే వాళ్ల ఖర్మ. అటువంటి నేతలను పట్టించుకోకుండా ప్రచారంలో ముందుకు సాగండని కర్తవ్య బోధ చేస్తున్నారు కేటీఆర్. మొత్తానికి, అసమ్మతులను చల్లార్చడంలో, తండ్రి బాటను అనుసరిస్తున్నారు కేటీఆర్. చెన్నూర్‌లో ఎర్రజెండా ఎగరేసిన ఓదేలును దారిలోకి తెచ్చినట్టే, మిగతా అసమ్మతి నేతలను సైతం కూల్‌ చేస్తున్నారు. మాట వినని, వేనేపల్లి వెంకటేశ్వరరావు వంటి నేతలపై బహిష్కరణ వేటు వేస్తున్నారు.

Next Story