టీఆర్ఎస్ లో నెంబర్-2 ఎవరంటూ నలుగుతున్న చర్చ..హరీశ్ కు మద్దతుగా పలువురు సీనియర్లు

x
Highlights

సీనియర్లను ఢిల్లీకి పంపడం వెనుక కేసీఆర్ ఉద్దేశం వేరే ఉందా? తనయుడికి రాజకీయంగా పెద్ద పీట వేయాలన్నదే ఆయన ఆంతర్యమా? కేసీఆర్ వేస్తున్న ఎత్తుగడలు,...

సీనియర్లను ఢిల్లీకి పంపడం వెనుక కేసీఆర్ ఉద్దేశం వేరే ఉందా? తనయుడికి రాజకీయంగా పెద్ద పీట వేయాలన్నదే ఆయన ఆంతర్యమా? కేసీఆర్ వేస్తున్న ఎత్తుగడలు, పన్నుతున్న వ్యూహాలు పరిశీలిస్తే... అది నిజమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తనయుడు కేటీఆర్ కు సీఎం పగ్గాలు అప్పజెప్పేందుకే సీనియర్లను ఢిల్లీ పంపవచ్చంటున్నారు పరిశీలకులు.

వచ్చే ఎన్నికల్లో మెజారిటీ ఎంపీ సీట్లు గెలుచుకోవాలన్న ఆలోచనతో పాటు మరో భారీ ఎత్తుగడలో భాగంగానే కేసీఆర్ కొత్త వ్యూహానికి తెర లేపినట్లు చర్చ నడుస్తోంది. వచ్చే ఎన్నికల తర్వాత కుమారుడు కేటీఆర్ కు రాష్ట్ర ముఖ్యమంత్రిగా లైన్ క్లియర్ చేసేందుకే సీనియర్ మంత్రులను ఢిల్లీకి పంపించే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది.

తెలంగాణ అధికార పార్టీలో కేసీఆర్ తర్వాత నెంబర్ టూ ఎవరనే చర్చ చాలా రోజులుగా నడుస్తోంది. ఈ విషయంలో హరీష్ రావు, కేటీఆర్ మధ్య పోటీ తీవ్రంగా ఉంది. మంత్రి ఈటలతో సహా చాలా మంది సీనియర్ మంత్రులు హరీష్ కు అంతర్గతంగా మద్దతు పలుకుతున్నారన్న వ్యాఖ్యానాలు ఎప్పట్నుంచో ఉన్నాయి. అందుకే కేటీఆర్ కు ఎలాంటి అడ్డంకులు లేకుండా చేసేందుకే సీనియర్ మంత్రులందరినీ కేసీఆర్ ఢిల్లీ పంపే స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది.

2019 ఎన్నికల తర్వాత అదునుచూసి కేటీఆర్ ను సీఎం సీట్లో కూర్చోబెడతారని పార్టీలో చెప్పుకుంటున్నారు. అయితే రాష్ట్ర కేబినెట్లో కేటీఆర్ తో పాటు, ఆయన కన్నా తక్కువ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వాలంటే సీనియర్లను గౌరవప్రదంగా తప్పించాల్సి ఉంటుంది. అందుకే సీనియర్లను ఢిల్లీకి పంపడం ద్వారా అటు కేంద్రంలో చక్రం తిప్పడంతో పాటు రాష్టంలో కేటీఆర్ కు సీఎం పదవి కట్టబెట్టే వీలు చిక్కుతుందంటున్నారు పరిశీలకులు.

గత కొన్ని నెలలుగా కేటీఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయాలని కేటీఆర్ వర్గం నుండి డిమాండ్ వస్తోంది. గతేడాది టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ పేరు ప్రకటించబోతున్నట్లు వార్తలొచ్చాయి. అటు తెలంగాణ భవన్ లో కూడా కేటీఆర్ కోసం ఓ చాంబర్ ను కూడా సిద్ధం చేశారు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ చివరి నిమిషంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ పేరును ప్రకటించలేదు. కుటుంబంలోనే మరో వర్గం ఆ ప్రతిపాదనను వ్యతిరేకించినట్లు పార్టీలో అప్పట్లో చర్చ జరిగింది. ఇప్పుడు కేసీఆర్ వేస్తున్న భారీ వ్యూహంతో కేటీఆర్ కు లైన్ క్లియర్ అవడం ఖాయమన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.

దీన్ని బట్టి చూస్తే... కేసీఆర్ ముందు అనేక లక్ష్యాలున్నాయి. కానీ ఉపయోగించే పంచ్ మాత్రం సింగిల్ గానే ఉన్నట్టు కనిపిస్తోంది. అనూహ్యమైన ఎత్తుగడలకు పెట్టింది పేరైన కేసీఆర్... థర్డ్ ఫ్రంట్ ప్రయోగంతో సక్సెస్ అవుతారా? ఇదివరకే విఫల ప్రయోగంగా మిగిలిన ఫ్రంట్ ల ఏర్పాటుకు మిగతా ప్రాంతీయ పార్టీలు ఎంతవరకు ముందుకొస్తాయి? కప్పలతక్కెడను తలపించే ఇండియన్ పాలిటిక్స్ లో కేసీఆర్ ప్రయోగం ఎలాంటి ఫలితాలిస్తుందో వేచిచూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories