logo

యువతే లక్ష్యంగా టీఆర్ఎస్‌ ఎన్నికల ప్రచారం ...రంగంలో దిగిన...

పెట్టుబడి సాయంతో రైతులను, బతుకమ్మ చీరలతో మహిళల్లో ఆదరణ పొందిన టీఆర్ఎస్ యూత్‌ను ఆకట్టుకునేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తోంది. కోడ్ అమల్లో ఉండటంతో తాము గతంలో చేపట్టిన పథకాలను వివరిస్తూ కొత్త పంథాలో ముందుకు వెళుతోంది. ఏక కాలంలో బహుళ ప్రయోజనాలు పొందేలా అటు యూత్ ఇటు వీరి తల్లిదండ్రులను ఆకట్టుకునేలా క్షేత్రస్ధాయి ప్రచారం ప్రారంభించింది.

ప్రతిపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ప్రచారాన్ని హోరెత్తిస్తున్న గులాబీ పార్టీ గెలుపు అవకాశాలను ఏమాత్రం వదులుకోవడం లేదు. ఇప్పటికే నియోజకవర్గాల్లో ఒక విడత ప్రచారం పూర్తి చేసిన నేతలు పరిస్దితులను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటున్నారు. తాజా ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న యువతను ఆకట్టుకునేందుకు కారు పార్టీ నేతలు ప్రణాళికలు సిద్ధం చేశారు. పార్టీ అనుబంధ సంఘం టిఆర్ఎస్వీని ప్రచారంలోకి దింపిన నేతలు గ్రామానికో విద్యార్థి నాయకుడికి బాధ్యతలు అప్పగించింది. ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచారం ఎలా చేయాలన్న దానిపై టీఆర్ఎస్‌ భవన్లో మంత్రి కేటీఆర్ విద్యార్థి నేతలకు దిశానిర్దేశం చేశారు.

ఒక్కో నియోజకవర్గంలో వందమంది ట్రైనింగ్ పొందిన విద్యార్థి నేతలను గులాబి పార్టీ రంగంలోకి దించింది. ప్రతి గ్రామంలో వీరి ఆధ్వర్యంలో 15 మందితో బృందాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో విద్యావ్యవస్ధను మెరుగుపరిచేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలు, మాడల్ స్కూళ్ల ఏర్పాటు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, మెస్ చార్జీల పెంపు వంటి అంశాలను వివరిస్తూ యూత్‌తో పాటు వారి తల్లిదండ్రులను కూడా ఆకట్టుకుంటున్నారు. తమ ప్రచారంలో ఓటర్ల నుంచి వస్తున్న స్పందన, ఎదురవుతున్న ప్రశ్నలను ఎప్పటికప్పుడు టీఆర్ఎస్‌ భవన్‌లోని ప్రచార విభాగానికి తెలియజేస్తూ వీరంతా ప్రచారం సాగిస్తున్నారు. విద్యార్ధి సంఘం ప్రచారంతో గ్రామీణ ప్రాంతాల్లో తమ ఓటు శాతం మరింత పెరుగుతుందని కారు పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇందుకోసం క్షేత్ర స్ధాయిలోని విద్యార్ధి నేతలకు ప్రత్యేక వసతులతో పాటు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తున్నారు.

arun

arun

Our Contributor help bring you the latest article around you


లైవ్ టీవి

Share it
Top