హస్తం చేతిలో సీమటపాకాయ్‌... కొడంగల్‌ రాకెట్‌ ఏమంటోంది!!

హస్తం చేతిలో సీమటపాకాయ్‌... కొడంగల్‌ రాకెట్‌ ఏమంటోంది!!
x
Highlights

కాంగ్రెస్‌లో అతను సీమ టపాకాయ్. నోరు తెరిచాడంటే లక్ష్మీ బాంబులా మాటలు పేల్తాయి. చిచ్చుబుడ్లులా చిచ్చురేపుతాయి. తారాజువ్వల్లా ఆయన వాగ్భాణాలు...

కాంగ్రెస్‌లో అతను సీమ టపాకాయ్. నోరు తెరిచాడంటే లక్ష్మీ బాంబులా మాటలు పేల్తాయి. చిచ్చుబుడ్లులా చిచ్చురేపుతాయి. తారాజువ్వల్లా ఆయన వాగ్భాణాలు దూసుకెళ్తాయి. ఈ బాంబులకు దీటుగా గులాబీదళం వంకాయ బాంబును విసురుతోంది. భూచక్రాన్ని వదులుతోంది. కాకరపువ్వొత్తిలాంటి టపాసును సంధిస్తోంది. కొడంగల్‌ సమరంలో, టపటపా పేలుతున్న టపాసుల్లో, ఎవరి శబ్దమేంటి...ఏ రాకెట్‌ ఎలా దూసుకెళుతోంది.

ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని కొడంగల్‍ నియోజకవర్గంలో పాగా వేసేందుకు టీఆర్‍ఎస్‍- కాంగ్రెస్‍ లు వ్యూహప్రతివ్యూహాలు వేస్తున్నాయి... కాంగ్రెస్‌ ఫైర్‌ బ్రాండ్‌ రేవంత్‌ రెడ్డి ఒకవైపు....గులాబీదళం సంధించిన పట్నం నరేందర్‌ రెడ్డి మరోవైపు...హోరాహోరిగా ప్రచారం సాగిస్తున్నారు... రాష్ట్ర నాయకుడినైన తనను గెలిపిస్తే కొడంగల్‍ నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ది చెందుతుందంటూ...కాంగ్రెస్‍ అభ్యర్థి రేవంత్‍రెడ్డీ తన ప్రచారం కొనసాగిస్తుండగా.. ప్రజల మద్యే ఉంటూ ప్రజల కోసం పనిచేసే నాయకుడిగా మీలో ఒకడిగా ఉంటానంటూ.. టీఆర్‍ఎస్‍ అభ్యర్థి పట్నం నరేందర్‍రెడ్డి ప్రచారం ముమ్మరం చేశారు.

కొడంగల్‍ నియోజకవర్గంలో టీఆర్‍ఎస్‍ అభ్యర్థి పట్నం నరేందర్‍రెడ్డి ప్రచారంలో ముందువరులో ఉన్నారు. గ్రామ గ్రామానికి వెళ్ళి ఇంటింటి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇక సోదరుడు నరేందర్‍రెడ్డి గెలుపు కోసం అన్న మంత్రి మహేందర్ రెడ్డి, కొడంగల్‍ పై ప్రత్యేక దృష్టిపెట్టారు. సమయం దొరికినప్పుడల్లా తమ్ముడి కోసం కొడంగల్‍ నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక పట్నం నరేందర్‍రెడ్డికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‍ రెడ్డి సైతం నియోజకవర్గంలో విస్త్రుతంగా పర్యటిస్తున్నారు. తనను ఐదు సార్లు గెలిపించిన కొడంగల్‍ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటు.. ఈసారి తాను మద్దతు తెలిపిన తమ పార్టీ టీఆర్‍ఎస్‍ అభ్యర్థి పట్నం నరేందర్‍రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. ఈ ప్రాంతంలో సీనియర్‍ నేతగా గుర్నాథ్‍ రెడ్డికి ఉన్న, ఓట్‍ బ్యాంక్‍ యధాతథంగా తమవైపు మళ్ళించుకునేందుకు పట్నం సోదరులు తీవ్రంగా కృషిచేస్తున్నారు. తమ ప్రచారంలో కాంగ్రెస్‍ అభ్యర్థి రేవంత్‍రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ.. ప్రభుత్వం చేసిన అభివృద్దిని ప్రజలకు వివరిస్తూ... జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు టీఆర్‍ఎస్‍ అభ్యర్థి పట్నం నరేందర్‍రెడ్డి.

ఇక కాంగ్రెస్‍ అభ్యర్థి రేవంత్‌రెడ్డి మాత్రం ప్రచారంలో వెనకంజలో ఉన్నారు. ఇప్పటికి కేవలం రెండు మూడు సార్లు మాత్రమే ఆయన ప్రచారం చేశారు. కాంగ్రెస్‍ పార్టీ వర్కింగ్‍ ప్రెసిడెంట్‍ కావడం...మాటల తూటాల పేల్చే నాయకుడిగా పేరుండటంతో, ఇతర అభ్యర్థులు సైతం తమతమ నియోజకవర్గాలకు ప్రచారానికి పిలవడంతో, రేవంత్‌ బిజిబిజీగా ఉన్నారు. అంతే కాకుండా ప్రచారం ప్రారంభం రోజునే తన ఆస్తులపై ఐటీ దాడులు జరగడం, రేవంత్‍రెడ్డి ప్రచారంలో వెనకడుగుకు కారణాలుగా మారాయి. ఐతే తాను ఎవరి అవసరం లేకుండా.. తన నియోజకవర్గంలొ తానొక్కడినే ప్రచారం చేసుకుని గెలిచే సత్తా ఉందన్న ధీమాలో రేవంత్‍ ఉన్నారు. తనకు నెలల తరబడి సమయం అవసరం లేదని.. ప్రచారానికి చివరి 10,15 రోజులు చాలునని, కార్యకర్తలతో అన్నట్టు సమాచారం. ఈ కారణం చేతనే కొడంగల్‍లో తన గెలుపు ఖాయమన్నట్టు వ్యవహరిస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి.

ఇక కొడంగల్‍ నియోజకవర్గంలో వైఎస్‍ఆర్‍ సిపి, బీజేపి, ఇండిపెండెంట్లు కూడా తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. బీజేపి నుంచి నాగూరావు నామాజీ, వైసీపీ నుంచి తమ్మలి బాలరాజు, ఇక ఇండిపెండెంట్‌గా టీఆర్‍ఎస్‍ రెబల్‍ క్యాడెంట్‍ సతీష్‍ ముదిరాజ్‍లు పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. ఐతే కొడంగల్‍ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న టీఆర్‍ఎస్‍, కాంగ్రెస్‍ పార్టీల అభ్యర్థులు స్థానికులు కాదని, ఇక్కడి ఓటర్లు స్థానికులకే పట్టం కడతారని వైఎస్‍ఆర్‍ సీపి అభ్యర్థి బాలరాజు, ఇండిపెండెంట్ అభ్యర్థి సతీష్‍ ముదిరాజులు అంటున్నారు. మొత్తానికి కొడంగల్‍ నియోజకవర్గంలో పోటీ రసవత్తరంగా మారే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. టీఆర్‍ఎస్‍ అభ్యర్థి పట్నం నరేందర్‍రెడ్డి ప్రచారంలో దూసుకుపోతూ... కొడంగట్‌లో గులాబీ జెండా ఎగరేయాలన్న పట్టుదలను కనబర్చుతున్నాడు. ఇక కాంగ్రెస్‍ అభ్యర్థి రేవంత్‍ రెడ్డి మాత్రం తన గెలుపును ఎవ్వరూ అడ్డుకోలేరన్న ధీమాను ఆదినుంచి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. మరి కొడంగల్‍ నియోజకవర్గంలో ప్రజలు ఎవరికి పట్టం కడతారో.. వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories