ఎలక్షన్‌ వెపన్‌... ఎక్కడ... ఎప్పుడు.. ఎవరి మీద పడుతుంది!!

ఎలక్షన్‌ వెపన్‌... ఎక్కడ... ఎప్పుడు.. ఎవరి మీద పడుతుంది!!
x
Highlights

ఒక కొత్త ఆయుధం తయారైంది. రణక్షేత్రంలో తొడగొడతానంటున్న ఆ వెపన్‌, ఏ రేంజ్‌లో ప్రత్యర్థిపై విరుచుకుపడుతుందో తెలీదు. ఏ స్థాయిలో శత్రువుకు నష్టం చేస్తుందో...

ఒక కొత్త ఆయుధం తయారైంది. రణక్షేత్రంలో తొడగొడతానంటున్న ఆ వెపన్‌, ఏ రేంజ్‌లో ప్రత్యర్థిపై విరుచుకుపడుతుందో తెలీదు. ఏ స్థాయిలో శత్రువుకు నష్టం చేస్తుందో తెలీదు. కానీ ఆ అస్త్రం పట్ల అందరిలోనూ ఉత్కంఠ. అధికార, విపక్షాలు అదే పనిగా ఆ ఆయుధం గురించి చర్చిస్తున్నాయి. ఇప్పటికే ఆ అస్త్రం ఒక ప్రధాన శిబిరం వైపు చూస్తోందని తెలిసినా, మరో ప్రధాన పక్షం ఇటువైపు లాగేందుకు కనుగీటుతోంది. రెండు జాతీయ పార్టీలు, ఆ అస్త్రం కోసం రకరకాలుగా ప్రయత్నిస్తున్నాయి. కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జనసమితి, తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారింది.

పార్టీకి సంస్థాగత నిర్మాణం లేకున్నా, పార్టీకి ఎన్నికల గుర్తు రాకున్నా జనసమితితో జట్టు కట్టాలని రెండు జాతీయ పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేసాయి. కాంగ్రెస్‌తో కలిసి ప్రజాకూటమి ఏర్పాటు కోసం జనసమితి ప్రతినిధులు చర్చలు జరిపారు. అయితే కోరినన్ని సీట్లు, ప్రజా కూటమి సారథ్య బాధ్యతలు కోదండరాంకు అప్పజెప్పేందుకు కాంగ్రెస్ వెనకాడుతుండటంతో, చర్చల్లో ఏలాంటి పురోగతి కనిపించడం లేదు. దీంతో బీజేపీ నేతలు రంగంలోకి దిగారు. కోదండరాం పార్టీతో పొత్తులు కుదుర్చుకునేందుకు కమలనేతలు ఆసక్తి కనబరుస్తున్నారు. కోదండరాంకున్న క్లీన్ ఇమేజ్, ఉద్యమ నేపథ్యం, విశ్వసనీయత తమకు కలిసి వస్తాయని బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నారు.

బీజేపీ ఎన్నిప్రయత్నాలు చేసినా రాష్ట్రంలో బలపడటం లేదు. ప్రతి ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితం అవుతోంది. అందుకే కోదండరాం పొత్తు తమకు లాభిస్తుందని కమలదళం అంచనా వేస్తోంది. పట్టణ ఓటు బ్యాంకు గల బీజేపీకి, కోదండరాం వైపు చూస్తున్న గ్రామీణ ఓటర్లు, యువత, నిరుద్యోగులు, మేధావులు తోడైతే అధికారం ఖాయమని నమ్ముతోంది. అందుకే కోదండరాంతో పొత్తులు పెట్టుకునేందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రంగంలోకి దిగారు. ఆయన కోదండరాంతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే తమ ఉద్యమ ఆకాంక్షల ఎజెండాకు అంగీకరిస్తే, సీట్ల సర్దుబాటుకు అభ్యంతరం లేదని జనసమితి నేతలు బీజేపీకి స్పష్టం చేసారు. దీనిపై బీజేపీ స్పందన కోసం ఎదురు చూస్తున్నారు.

భాగ‌స్వామ్య ప‌క్షాలైన జనసమితి, టిడిపి, సిపిఐలకు 30 సీట్లు ఇచ్చి...తాను 90 సీట్లకు ప‌రిమితం కావాల‌ని కాంగ్రెస్ ఓ నిర్ణయానికి వచ్చింది. జనసమితి డిమాండ్ చేస్తున్న కనీస ఉమ్మడి ప్రణాళిక అమలు బాధ్యతల్లో, కోదండరాంకు తగిన స్థానం కల్పించాలని భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనలతో కాంగ్రెస్, జనసమితి మధ్య పొత్తులు ఖాయమవుతాయని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో బీజేపీ కూడా కోదండరాంను వదులుకోకుండా చివరి వరకు ప్రయత్నాలు చేయాలని గట్టి పట్టుదలగా ఉంది. దీంతో రాష్ట రాజకీయాల్లో జనసమితి కీలకంగా మారిందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు రాజకీయ పరిశీలకులు.

Show Full Article
Print Article
Next Story
More Stories