logo
జాతీయం

రైతుల ఆందోళనతో దద్దరిల్లుతున్న ఢిల్లీ...అన్నదాతలపై పోలీసుల ప్రతాపం

రైతుల ఆందోళనతో దద్దరిల్లుతున్న ఢిల్లీ...అన్నదాతలపై పోలీసుల ప్రతాపం
X
Highlights

రైతుల ఆందోళనతో ఢిల్లీ పరిసరాలు రణరంగంగా మారాయి. రాజధానిలోకి రైతుల అడుగుపెట్టకుండా శివారు ప్రాంతాల్లో భారీగా...

రైతుల ఆందోళనతో ఢిల్లీ పరిసరాలు రణరంగంగా మారాయి. రాజధానిలోకి రైతుల అడుగుపెట్టకుండా శివారు ప్రాంతాల్లో భారీగా మోహరించిన పోలీసులు కిసాన్ క్రాంతి యాత్రపై విరుచుకుపడ్డారు. ర్యాలీగా వస్తున్న రైతులను ఘజియాపూర్ దగ్గర అడ్డుకున్న పోలీసులు ఢిల్లీలోకి అడుగుపెట్టకుండా భారీ కేడ్లు ఏర్పాటు చేశారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు లోపలికి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వాటర్ కెనన్‌లను ప్రయోగించి రైతులను చెల్లాచెదురు చేశారు. అయినా రైతులు వెనక్కు తగ్గకపోవడంతో టియర్‌ గ్యాస్‌ ప్రయోగించి లాఠీచార్జ్ చేశారు. దీంతో రైతులు తలో వైపు పరుగులు పెట్టారు. పారిశ్రామికవేత్తలకు వేలకోట్ల రూపాయలను మంచినీళ్ల తరహాలో ధారపోస్తున్న కేంద్రం రుణాలు మాఫీ చేయాలంటూ కోరిన అన్నదాతలపై ఉక్కుపాదం మోపింది. దేశ రాజధానిలో తమ గోడు చెప్పుకునేందుకు వస్తున్న వారిపై అత్యంత దారుణంగా దాడి చేసింది. పంటలు సాగు చేయడమే తప్ప ఏ పాపం ఎరుగని రైతులను పోలీసులు లాఠీలతో చితకబాదారు. ట్రాక్టర్ల టైర్ల నుంచి గాలి తీసేశారు. వేలాది మందిగా వస్తున్న రైతుల గోడు వినాల్సిన ప్రభుత్వమే ఇలా పాశవికంగా దాడి చేయడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

రైతులపై జరిగిన లాఠీచార్జ్‌పై విపక్ష నేతలు తీవ్రంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం రైతులపై ఉక్కుపాదం మోపుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల లాఠీచార్జీని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా ఖండించారు. రైతులను తక్షణమే ఢిల్లీలోకి అనుమతించాలంటూ ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమ్‌ ఆద్మీ పార్టీ రైతులకు అండగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ యూపీ మాజీ సీఎం అఖిలేష్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీరు వల్లే రైతులు ఆందోళన బాట పట్టారన్నారు.

Next Story