ఉద్యమాల ఖిల్లాలో గల్లీకో రాజకీయం!! ఖమ్మంలో పార్టీల కథాకళి!!

ఉద్యమాల ఖిల్లాలో గల్లీకో రాజకీయం!! ఖమ్మంలో పార్టీల కథాకళి!!
x
Highlights

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. టీఆర్ఎస్‌లో అసమ్మతి సెగలు మరింతగా పెరుగుతున్నాయి. విపక్షాల్లో సీట్ల...

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. టీఆర్ఎస్‌లో అసమ్మతి సెగలు మరింతగా పెరుగుతున్నాయి. విపక్షాల్లో సీట్ల కేటాయింపుపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఎవరికి ఏ సీటు దక్కుతుందోనని రోజులు గడిచేకొద్దీ ఆయా పార్టీల నాయకులు, శ్రేణుల్లో బీపీ పెరుగుతోంది. జిల్లా టిఆర్ఎస్‌లో అసమ్మతి చినికి చినికి గాలివానలా మారుతోంది. ప్రజాప్రతినిధులు పదవులకు రాజీనామా చేసే వరకు వెళ్లింది. సత్తుపల్లి టికెట్‌ ఆశించిన మట్టా దయానంద్‌ నియోజవకర్గంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. జలగం వెంకటరావు అభ్యర్థిత్వాన్ని మార్చాలని కొత్తగూడెంలో ప్రదర్శన చేపట్టారు. టీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఎన్నికల బరిలో దిగే అభ్యర్థులను ప్రకటించడంతో, ఇటు స్వపక్షంలో, అటు విపక్షంలో అలజడి రేపుతోంది. టీఆర్ఎస్‌లో అసమ్మతి రాగం శ్రుతి మించుతుండగా.. ప్రతిపక్ష పార్టీల్లో ఉన్న లుకలుకలు బయటపడుతున్నాయి. బయటకు బాగానే కనిపిస్తున్నా.. అంతర్గత సమావేశాల్లో వారెంత? వీరెంత? అన్న స్థాయిలో విభేదాలు బహిర్గతమవుతున్నాయి.

వైరా నియోజకవర్గం అసమ్మతి నేతలు కొణిజర్లలో సమావేశమయ్యారు. టీఆర్ఎస్‌ అభ్యర్థి మదన్‌లాల్‌ ఒంటెద్దు పోకడతో వెళ్తున్నారని, ఆయన కాకుండా ఇతరులు ఎవరినైనా అభ్యర్థిగా నిలిపినా గెలుపునకు కృషి చేస్తామని వారు చెబుతున్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో టికెట్‌ ఆశించిన మట్టా దయానంద్‌ మండలాలవారీగా టీఆర్ఎస్‌ నేతలు, కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. మధిర టికెట్‌ ఆశించిన బొమ్మెర రామ్మూర్తి అసంత్రుప్తి రాగం వినిపించినా కెటిఆర్ పిలిచి మాట్లాడటంతో తాజాగా పార్టీ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్‌కు మద్దతుగా, విజయానికి కృషి చేస్తానని ప్రకటించారు. కొత్తగూడెం నియోజకవర్గం టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా జలగం వెంకటరావుకు సీటును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ, ఆ పార్టీ అసమ్మతి వర్గం పట్టణంలో ఆందోళన నిర్వహించడం ఉద్రిక్తతకు దారితీసింది. మరోవైపు విపక్ష కూటమి పొత్తుల వార్తలు కాంగ్రెస్‌లోని లుకలుకలను బహిర్గతం చేస్తున్నాయి.

2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ సీపీఐతో పొత్తు పెట్టుకుంది. ఈ సందర్భంలో వైరా, పినపాక, కొత్తగూడెం టికెట్లు సీపీఐకి కేటాయించారు. గతంలో మాదిరిగా సీపీఐకి వైరా, కొత్తగూడెం టికెట్లు కేటాయించవద్దని స్థానిక కాంగ్రెస్‌ నేతలు గాంధీభవన్‌ ఎదుట ఆందో ళన చేశారు. మహాకూటమిలో భాగంగా టీడీపీకి ఉభయ జిల్లాల్లోని 10 స్థానాల్లో ఏయే సీట్లు దక్కుతాయన్న ఉత్కంఠ పార్టీ శ్రేణుల్లో నెలకొంది. కాంగ్రెస్‌ సీపీఐతోనూ దోస్తీ కట్టడంతో తమకు ఏ స్థానం దక్కుతుందన్న కోణంలో నాయకులు ఆరా తీస్తున్నారు. సత్తుపల్లితోపాటు అశ్వారావుపేట, కొత్తగూడెం, భద్రాచలం స్థానాలను టీడీపీ కోరుతోంది. సత్తుపల్లి నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సీటు ఖాయంగా భావిస్తున్నారు.

ఉద్యమ పార్టీగా జిల్లాలో పట్టున్న సీపీఎం, బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌లో భాగంగా బరిలోకి దిగాలని భావిస్తోంది. ఇప్పటి వరకు బీఎల్‌ఎఫ్‌లో ఉన్న పార్టీలో సీపీఎం మాత్రమే ఉభయ జిల్లాల్లో ప్రభావవంతంగా ఉంది. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ బీఎల్‌ఎఫ్‌తో పొత్తుకు సంబంధించి వచ్చే రెండు మూడు రోజుల్లో స్పష్టత రానుంది. బీఎల్‌ఎఫ్‌లో సీపీఎంతోపాటు జనసేనతోపాటు ఇతర పార్టీలు వస్తే వారికి సీట్లు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నారు. అపుడు ఖమ్మం, భద్రాచలం తదితర నియోజకవర్గాల స్థానాలను సీపీఎం కోరుతోంది. లేనిపక్షంలో బీఎల్‌ఎఫ్‌ తరుపున 10 స్థానాల నుంచి సీపీఎం పోటీ చేయాలని ఆలోచిస్తోంది.
ప్రజల పక్షాన పోరాటాల్లో ఐక్యంగా ఉద్యమించే సీపీఐ, సీపీఎంలు తలోవైపు మొగ్గు చూపుతూ.. తలో దారిలో పయనిస్తున్నాయి. మొత్తం మీద ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిమిష నిమిషానికి మారుతున్న రాజకీయ సమీకరణలు ఏవైపు దారితీస్తాయో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories