లాటరీలో రూ.10 కోట్లు గెలుచుకున్న అదృష్టవంతుడు!

లాటరీలో రూ.10 కోట్లు గెలుచుకున్న అదృష్టవంతుడు!
x
Highlights

తిరువనంతపురం: ఆ 46 ఏళ్ల వ్యక్తి నక్క తోకను తొక్కాడో లేక తథాస్తు దేవతలు దీవించారో తెలియదు కానీ అదృష్టం అతని తలుపు తట్టింది. అదీ లాటరీ టికెట్ రూపంలో....

తిరువనంతపురం: ఆ 46 ఏళ్ల వ్యక్తి నక్క తోకను తొక్కాడో లేక తథాస్తు దేవతలు దీవించారో తెలియదు కానీ అదృష్టం అతని తలుపు తట్టింది. అదీ లాటరీ టికెట్ రూపంలో. లాటరీ టికెట్ అనగానే ఏ లక్ష రూపాయలో, రెండు లక్షల రూపాయలో గెల్చుకున్నాడనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఏకంగా రూ.10కోట్లు లాటరీలో గెల్చుకున్నాడు. కేరళ రాష్ట్ర లాటరీ శాఖ తిరువోనం బంపర్ 2017 లాటరీలో ముస్తఫా అనే 46 ఏళ్ల వ్యక్తిని విజేతగా ప్రకటించారు. ముస్తఫా స్వస్థలం కేరళలోని మలప్పురం జిల్లాలో ఉన్న పలతింకల్ అనే గ్రామం. తిరువనంతపురంలోని శ్రీచిత్ర హోం ఆడిటోరియంలో మంత్రి సురేంద్రన్ చేతుల మీదుగా ఈ లాటరీ డ్రాను నిర్వహించారు. టికెట్ నంబర్ ఏజే442876 కొన్న ముస్తఫాను విజేతగా ప్రకటించారు. ముస్తఫా గతంలో డ్రైవర్‌గా పనిచేశాడు. ప్రస్తుతం కొబ్బరిబోండాల వ్యాపారం చేసుకుంటున్నాడు. గురువారం ఈ డ్రా తీస్తే శుక్రవారం వరకూ ముస్తఫాకు ఈ విషయం తెలియదు. ఈ వార్త వినగానే ముస్తఫాకు మాటల్లేవు. తాను గతంలో కూడా చిన్న మొత్తంలో లాటరీ డబ్బును గెలుచుకున్నానని, కానీ ఇంత మొత్తంలో డబ్బు గెలుచుకునే సరికి మాటలు రావడం లేదని తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.

ఇల్లు చాలా సంవత్సరాల క్రితం కట్టిందని, ముందు వెంటనే ఇంటికి మార్పులుచేర్పులు చేయించాలని ముస్తఫా చెప్పాడు. కొన్ని అప్పులు ఉన్నాయని వాటిని కూడా తీర్చేస్తానని అన్నాడు. అనారోగ్య సమస్యలకు మెరుగైన చికిత్స చేయించుకోవాలని భావిస్తున్నట్లు తెలిపాడు. ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళయ్యాయని, ఇద్దరు కొడుకులు చదువుకుంటున్నారని ముస్తఫా చెప్పాడు. వారికి ఈ డబ్బుతో ఉన్నత విద్యను అందిస్తానని తెలిపాడు. ఇదిలా ఉంటే ముస్తఫాకు రూ.10కోట్లు పూర్తిగా చేతికి వెళ్లవు. ఆ రూ.10కోట్లలో ట్యాక్స్, ఏజెంట్స్ కమీషన్ పోగా ముస్తఫాకు రూ.6.3కోట్లు దక్కనుంది. మొత్తం మీద ఈ సంవత్సరం కేరళ లాటరీ శాఖ ఏజెంట్ల సహకారంతో 65లక్షల టికెట్లను అమ్మింది. 145 కోట్ల రూపాయల వరకూ ప్రభుత్వ ఖజానాలో పడింది. ఆ 145కోట్లలో అన్నీ పోగా రూ.59కోట్లు ప్రభుత్వ ఆదాయంగా తేలింది.

Show Full Article
Print Article
Next Story
More Stories