అన్నివర్గాలను ఆకర్షించేలా టీఆర్ఎస్ మేనిఫెస్టో..

x
Highlights

ప్రజాకర్షక పథకాలను కొనసాగిస్తూ ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగ యువత, గ్రామీణ ప్రాంతాల ప్రజల ఓట్లే లక్ష్యంగా టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫేస్టో విడుదల...

ప్రజాకర్షక పథకాలను కొనసాగిస్తూ ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగ యువత, గ్రామీణ ప్రాంతాల ప్రజల ఓట్లే లక్ష్యంగా టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫేస్టో విడుదల చేసింది. ఈ సారి కూడా రైతు రుణమాఫీ హామిని మేనిఫేస్టోలో చేర్చిన కేసీఆర్ సంక్షేమ పథకాల ద్వారా ఓటర్లను ప్రసన్నం చేసుకునే దిశగా వరాల జల్లు కురిపించారు. సెంటిమెంట్‌కు అధిక ప్రాధాన్యతనిచ్చే కేసీఆర్‌ ఆరు అంకె వచ్చేలా 24 హామీలతో మేనిఫెస్టోను విడుదల చేశారు. అందరి కంటే ముందు అభ్యర్ధులను ప్రకటించి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన సీఎం కేసీఆర్ పోలింగ్ ముగియడానికి మూడు రోజుల ముందు పార్టీ మేనిఫేస్టోను విడుదల చేశారు. ఎన్నికల ప్రచారంలో సంక్షేమ పథకాలను ప్రస్తావిస్తున్న ఆయన ప్రస్తుత లబ్ధిదారులతో పాటు కొత్త వారిని ఆకట్టుకునేలా హామీలు గుప్పించారు. ఇప్పటి వరకు వెయ్యి నుంచి 15 వందల వరకు ఉన్న ఆసరా పెన్షన్లకు 2016 రూపాయల నుంచి మూడువేల పదహారు రూపాయలకు పెంచుతామని ప్రకటించారు. దీంతో పాటు పెన్షన్లు అందుకునే కనీస వయస్సును 57కు తగ్గించారు. దీని వల్ల మరో రెండున్నర లక్షల మంది ఈ పథకం పరిధిలోకి రానున్నారు.

ఎన్నికలకు ముందు ప్రారంభించిన రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తామంటూ మేనిఫేస్టోలో పేర్కొన్న టీఆర్ఎస్ పెట్టుబడి సాయాన్ని ఎనిమిది వేల రూపాయల నుంచి పదివేలకు పెంచుతామంటూ ప్రకటించింది. ఇదే సమయంలో లక్ష రూపాయల వరకు రైతు రుణమాఫీ చేస్తామంటూ మరోసారి ప్రకటించింది. రైతులకు ప్రయోజనం చేకూర్చే దిశగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఐకేపీ ఉద్యోగులను క్రమబద్దీకరించి ఇందులో ఉపాధి కల్పిస్తామన్నారు. వీటి ద్వారా వచ్చే కల్తీ లేని ఆహార పదార్ధాలను ప్రజా పంపిణీ వ్యవస్ధ ద్వారా ప్రజలకు అందిస్తామంటూ తెలిపారు.

కుల సమీకరణలను పరిగణలోకి తీసుకున్న కేసీఆర్ ఆర్ధికంగా వెనకబడిన కులాలకు ప్రత్యేక కార్పోరేషన్‌ చేస్తామంటూ హామి ఇచ్చారు. ఇదే సమయంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంపై వస్తున్న వ్యతిరేకతను అధిగమిస్తూ కాంగ్రెస్ ఐదు లక్షల హామికి ధీటుగా కేసీఆర్ కొత్త ప్రకటన చేశారు. డబుల్ బెడ్‌రూం ఇంటికి అర్హత కలిగి సొంత స్ధలం ఉన్న వారు స్వయంగా ఇల్లు కట్టుకునేందుకు అనుమతిచ్చారు. ఇందుకోసం ఐదు నుంచి ఆరు లక్షల రూపాయల సాయం చేస్తామంటూ హామి ఇచ్చారు.

ఓ వైపు సంక్షేమ రంగానికి ప్రాధాన్యతనిస్తూనే ప్రభుత్వ ఉద్యోగులకు పెద్దపీట వేశారు. తగిన స్ధాయిలో వేతన సవరణ, రిటైర్మెంట్‌ వయస్సు 58 నుంచి 61కి పెంపు, ఉద్యోగ నియామకాల వయోపరిమితి మూడేళ్ల పెంపు, నిరుద్యోగులకు నెలనెలా మూడు వేల 16 రూపాయల నిరుద్యోగ భృతి చెల్లిస్తామంటూ హామి ఇచ్చారు. కంటి వెలుగు తరహాలో ఇతర ఆరోగ్య సమస్యలకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తామంటూ మేనిఫెస్టోలో తెలిపారు. సింగరేణి భూముల్లో ఇళ్లు కట్టుకున్నవారికి పట్టాలు, పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం,గిరిజన, గిరిజనేతర భూ వివాదాల పరిష్కారం, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై హామి ఇచ్చారు. ఎస్సీ,ఎస్టీల అభివృద్ధికి ప్రత్యేక కమిటీ, అగ్రవర్ణాల్లోని పేదల అభ్యున్నతికి ప్రత్యేక పథకాలు, చట్టసభల్లో బీసీలకు 33శాతం, మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ అమలుకోసం రాజీలేని పోరాటం చేస్తామంటూ ప్రకటించింది. ఇక ఎస్సీలు, మైనార్టీల రిజర్వేషన్లపై కేంద్రంతో రాజీలేని పోరాటం చేస్తామంటూ మరోసారి మేనిఫేస్టోలో పేర్కొన్నారు.

హైదరాబాద్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తారని భావించినా ఎలాంటి స్పష్టమైన హామి ఇవ్వలేదు. విశ్వనగరంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతాయంటూ సరిపెట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి నమస్కారాలు అంటూ మేనిఫేస్టోను ప్రారంభించి టీఆర్ఎస్‌ను ఆశీర్వదించండి అభివృద్ధి యజ్ఞానికి అండగా నిలవండి అంటూ ముగించారు. నాలుగేళ్లలో ఎదురైన అవరోధాలు, వ్యవసాయ రంగ పరిస్ధితులను మేనిఫేస్టోలో ప్రత్యకంగా ప్రస్తావించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories