ఎన్నికల అష్టదళంలో మొదటి దళం కేటీఆర్. ఎలాంటి సంక్షోభం వచ్చినా, కేసీఆర్ మొదట చూసేది కేటీఆర్ వైపే. మొన్న అభ్యర్థుల ప్రకటన తర్వాత, అసమ్మతులు చెలరేగినా,...
ఎన్నికల అష్టదళంలో మొదటి దళం కేటీఆర్. ఎలాంటి సంక్షోభం వచ్చినా, కేసీఆర్ మొదట చూసేది కేటీఆర్ వైపే. మొన్న అభ్యర్థుల ప్రకటన తర్వాత, అసమ్మతులు చెలరేగినా, అసంతృప్తులు వినిపించినా, వారిని దారిలోకి తెచ్చే బాధ్యతను కేటీఆర్‌కే అప్పగించారు కేసీఆర్. అందకు ఒక ఉదాహరణ, స్టేషన్‌ఘన్‌పూర్‌లో రాజయ్య, కడియం శ్రీహరి మధ్య టికెట్ కోసం కోల్డ్‌వార్. తన కూతురి కొరకు ఆఖరిదాకా ట్రై చేశారు కడియం. అయితే, సిట్టింగ్‌కే ఓటేశారు కేసీఆర్. రాజయ్య-కడియంల మధ్య సయోధ్యను కుదర్చడంలో కేటీఆర్‌దే కీలక పాత్ర. కేసీఆర్‌కు అత్యంత విశ్వాసపాత్రడు హరీష్. ఎన్నికల కోలాహలం మొదలైన నాటి నుంచే గజ్వేల్‌లో కేసీఆర్ తరపున ప్రచారం హోరెత్తించారు. టీఆర్ఎస్ లేదా కేసీఆర్ మీద విపక్షాలు విమర్శలు చేస్తే, వెంటనే పంచ్‌లు విసిరే బాధ్యత కూడా హరీష్‌దే. 2014 ఎన్నికల హామీలను కేసీఆర్ నిలబెట్టుకోలేదన్న విమర్శలకు దీటుగా, ఉత్తమ్, చంద్రబాబులకు లేఖల రూపంలో అస్త్రాలు సంధించారాయన. ఏ బాధ్యతలు అప్పగించిన సమర్థంగా నిర్వహించి, సక్సెస్ చేస్తాడని పేరున్న హరీష్, కేసీఆర్ బలగంలో కీలకమైన అస్త్రం.
నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, సోషల్ మీడియా రణక్షేత్రంలో పార్టీ తరపున వీరనారిగా కత్తులు దూస్తారు. కేసీఆర్ తన కూతురుకు, ఎన్నికల బాధ్యతల్లో భాగంగా సామాజిక మాధ్యమాల పర్యవేక్షణ అప్పగించారు. సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు ఎలాంటి విమర్శలు గుప్పించినా, ట్వీట్లు, కామెంట్లతో పంచ్‌లు కురిపిస్తారు కవిత. కల్వకుంట్ల వారి కుటుంబానికి అత్యంత ఆప్తుడిగా పేరున్న పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఆర్గనైజింగ్ స్కిల్స్ పుష్కలం. ఈ లక్షణాలను పసిగట్టిన కేసీఆర్, తన బ్యాక్‌రూమ్ టీంలో చేర్చుకున్నారు. టీఆర్ఎస్ సభలకు ఆ రేంజ్‌లో జనం రావడం వెనక, కీలక పాత్ర పల్లా రాజేశ్వర్‌దేనని పార్టీ వర్గాలంటాయి. ఇవేకాదు, పార్టీలో క్రమశిక్షణ తప్పిన కార్యకర్తలపై కటువుగా వ్యవహరించడంలో, ఏమాత్రం వెనకడుగు వేయరు పల్లా. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన కార్యకర్తలు, నేతలను సస్పెండ్ చేశారు పల్లా. కేసీఆర్ అష్టదళంలో, పల్లా కూడా అత్యంత కీలకం.
టీఆర్ఎస్ ఎంపీ వినోద్. కేసీఆర్ నమ్మినబంటు. ఎన్నికల సంఘం, జాతీయ పార్టీల సమన్వయంలో వినోద్‌దే కీరోల్. ముందస్తు ఎన్నికలకు ఈసీని ఒప్పించడంలో సక్సెస్ అయ్యారు వినోద్. ప్రధాని నరేంద్ర మోడీ, తృణముల్ అధినేత్రి మమతా బెనర్జీ, డీఎంకే చీఫ్ స్టాలిన్, మాజీ ప్రధాని దేవేగౌడతో పాటు పలువురు జాతీయ నాయకులతో, కేసీఆర్ భేటికి మార్గం సుగమం చేసింది వినోదే. కె. కేశవ రావు. టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ. కేసీఆర్ అభిమానించే, గౌరవించే సీనియర్ లీడర్. మేనిఫెస్టో బాధ్యతలను సైతం కేకే కే అప్పగించారు. సమాజంలో అన్ని వర్గాలతోనూ మాట్లాడి, ఎన్నికల ప్రణాళిక వండివార్చే బాధ్యత కేకేదే. కేసీఆర్‌కు కేకేపై ఎంత గౌరవమంటే, కేశవ రావు ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో, ఆయన ప్రసంగం వినేందుకు మండలికి వెళ్లడం తనకు గుర్తుందని చాలాసార్లు చెప్పారు.
కేసీఆర్‌కు అడుగడుగునా తోడుంటే వ్యక్తి సంతోష్ కుమార్. ఈయన వెంట ఉన్నాడంటే గులాబీ బాస్‌కు ఎలాంటి ఇబ్బందీలేదంటారు పార్టీ వర్గాలు. కేసీఆర్ కుటుంబ సభ్యుడైన సంతోష్‌కు ఇటీవలె రాజ్యసభ పదవి కూడా దక్కింది. తనకు అత్యంత నమ్మకస్తుడైన సంతోష్‌తో, నిర్మోహమాటంగా రహస్యాలు కూడా పంచుకుంటారు కేసీఆర్. ఎన్నికల రణక్షేత్రంలోనూ, గులాబీదళాధిపతికి అన్ని విధాల అండ సంతోష్. దేశపతి శ్రీనివాస్....గేయకారుడు, పాటగాడు, మాజీ ఉపాధ్యాయుడు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. కేసీఆర్ ప్రభుత్వంలో, వివిధ పథకాలకు నినాదాలు రాయడంలో, పాటలు అల్లడంలో, ప్రచార ప్రకటనలు రూపొందించడంలో కీలక పాత్ర దేశపతిదే. ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్‌లో, వినిపిస్తున్న చాలా స్లోగన్స్ దేశపతి కలం నుంచి జాలువారినవే. ఇలా కేసీఆర్, తన అష్టదళాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. గులాబీ బాస్ వెనక ఈ దళమంతా మోహరించి ఉంది. తమ అధినాయకుడికి, ఎలాంటి ఇబ్బంది వచ్చినా రంగప్రవేశం చేసి, చెలరేగిపోతారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire