సెమీస్‌లో నెగ్గిన కాంగ్రెస్‌ చుట్టూ ప్రాంతీయ పార్టీలు తిరుగుతాయా?

సెమీస్‌లో నెగ్గిన కాంగ్రెస్‌ చుట్టూ ప్రాంతీయ పార్టీలు తిరుగుతాయా?
x
Highlights

ఐదు రాష్ట్రాల ఫలితం తేలింది. ఇక పార్లమెంట్ సమరానికి తెరలేవబోతోంది. మూడు హిందీ హార్ట్‌ల్యాండ్‌ రాష్ట్రాల విజయోత్సాహంతో, ఇక పార్లమెంట్‌ యుద్ధంలో సత్తా...


ఐదు రాష్ట్రాల ఫలితం తేలింది. ఇక పార్లమెంట్ సమరానికి తెరలేవబోతోంది. మూడు హిందీ హార్ట్‌ల్యాండ్‌ రాష్ట్రాల విజయోత్సాహంతో, ఇక పార్లమెంట్‌ యుద్ధంలో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్‌, అందుకు తగ్గట్టుగా ప్రాంతీయ పార్టీలతో సైన్యాన్ని సమకూర్చుకుంటోంది. అటు ఉన్నవారు జారిపోకుండా, కొత్త స్నేహాలను వెతుక్కుంటూ, మోడీ ఎన్డీయే టీం లెక్కలు చూసుకుంటోంది. ఈ రెండు కూటములు కాదు, ఫెడరల్‌ ఫ్రంట్‌తో దేశ రాజకీయాలను మార్చేస్తానంటున్నారు, తెలంగాణలో దుమ్మురేపు ఫలితాలు సాధించిన కేసీఆర్. మరి ఎవరి ఫ్రంట్‌....ఫ్రంట్‌లో ఉంది....పార్లమెంట్‌ ఎన్నికల్లో కూటములుగానే కొట్లాడతాయా....విడివిడిగా పోట్లాడతాయా.

పార్లమెంట్‌ ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. మరో మూడు, నాలుగు నెలల్లో సార్వత్రిక శంఖారావం మోగబోతోంది. అయితే ఈ ఫైనల్స్‌కు ముందు జరిగిన సెమీస్‌లో, త్రీ జీరోతో క్లీన్‌ స్వీప్ చేసిన కాంగ్రెస్‌ మాత్రం, రెట్టించిన ఉత్సాహంతో ఢిల్లీ పీఠంపై గురిపెట్టింది. మూడు రాష్ట్రాలను గెలిచిన రాహుల్‌, మోడీతో ఢీకి సై అంటున్నారు. ఇటు కేసీఆర్‌ కూడా సరికొత్త జాతీయ పార్టీ పెడతా, ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించి దుమ్మురేపుతానంటున్నారు. పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు ఈ ఫ‌్రంట్‌ రాజకీయాలు, కాకరేపుతున్నాయి.

దేశమంతా సెమీఫైనల్స్‌గా భావించిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో, జనం విస్పష్టమైనతీర్పిచ్చారు. జనాల మనసెరిగి మసలుకుంటే, గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తామని, తెలంగాణలో గులాబీకి గెలుపు తిలకం దిద్దారు. రాజస్థాన్‌లో వసుంధరా రాజే, అరాచక రాజ్‌కు పాతరేశారు. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో 15 ఏళ్ల సుదీర్ఘ బీజేపీ పాలనకు తెరదించి, కాంగ్రెస్‌ రూపంలో కనిపించిన మార్పుకు ఓటేశారు. ప్రజల హృదయాలు తెలుసుకోకుండా, ఇష్టారాజ్యంగా పాలిస్తామంటే, మార్పు తప్పదని మిజోరంలో అదే కాంగ్రెస్‌ను నేలకేసి కొట్టారు.

నిజంగా ఐదు రాష్ట్రాల ఎన్నికలను సెమీఫైనల్స్‌గా తీసుకుంటే, ఐదింటిలో మూడింటిలో గెలిచిన కాంగ్రెస్‌దే సెమీస్‌ అని చెప్పాలి. కాంగ్రెస్‌కు సరికొత్త పునరుజ్జీవమిది. ఈ ఎన్నికల్లో ఫలితాలను బట్టి, కాంగ్రెస్‌ నాయకత్వంలోని కూటమిలో చేరాలా...వద్దా అని ఆలోచిస్తున్న అనేక ప్రాంతీయ పార్టీలు ఇక, ఫైనల్‌లో అదే హస్తం పార్టీతో జట్టుకట్టేందుకు సిద్దం కావచ్చు. లేదంటే స్వంతంగానే బరిలోకి దిగొచ్చు. మరికొన్ని నెలల్లో మోగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు, కూటమి ప్రయత్నాలు మాత్రం మరింత జోరందుకోబోతున్నాయి.


ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముఖ్యంగా మధ్యప్రదేశ్‌, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ ఎలక్షన్స్, ప్రధాని నరేంద్ర మోడీ నాలుగున్నరేళ్ల పాలనకు రెఫరెండంగా కాంగ్రెస్‌ మాత్రమే కాదు, బీజేపీ కూడా గట్టిగా ప్రచారం చేసింది. యూపీ, గుజరాత్‌‌లా మోడీ చర్మిషాతో గెలవొచ్చని లెక్కలేసింది. మరి కాషాయం వెలిసిపోయింది కాబట్టి మోడీ పాపులారిటీ ఇక ఏమాత్రం ఓట్లే రాల్చే మంత్రం కాదనుకోవాలా....సెమీఫైనల్స్‌లో వెలువడిన ఫలితాలు ఫైనల్స్‌లోనూ ప్రతిఫలిస్తాయా? బీజేపీ కంచుకోటలను బద్దలుకొట్టిన కాంగ్రెస్‌, ఢిల్లీ పీఠంపై కూర్చుంటుందా? ఎన్డీయే నుంచి మరిన్ని పార్టీలు జారుకుంటాయా...సార్వత్రిక పోరు ముందు ఎన్డీయే ఖాళీ అవుతుందా...బీజేపీ ధైర్యంగా మోడీ వర్సెస్‌ ఆల్‌గా సమరానికి సిద్దమవుతుందా?

అటు కాంగ్రెస్ ఫ్రంట్, ఇటు ఎన్డీయే ఫ్రంట్‌పై వాడీవేడీగా చర్చలు జరుగుతున్న తరుణంలో, తెలంగాణలో తిరుగులేని విజయం సాధించిన, టీఆర్ఎస్‌ అధిపతి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు, మరోసారి ఫెడరల్‌ ఫ్రంట్‌‌పై గట్టిగా మాట్లాడారు. దేశంలో బీజేపీయేతర, కాంగ్రెసేతర పాలన కావాల్సిందేనని రెట్టించిన ఉత్సాహంతో చెప్పారు. అతిత్వరలో జాతీయస్థాయిలో కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు ప్రకటించి, ఫ్రంట్‌ కట్టడంలో తానేమీ వెనకబడలేదని, బీజేపీ, కాంగ్రెస్‌లకు సమర సంకేతాలు పంపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories