Top
logo

రామాయణంలో వివాదాల వేట....అసలు కత్తి మహేష్ ఏమన్నాడు? ఎందుకీ రచ్చ?

X
Highlights

వింటే రామాయణం వినాలి తింటే గారెలు తినాలన్నారు పెద్దలు. వీనులవిందైన, హృదయానికి హత్తుకునే గాథ, రామాయణ గాథ....

వింటే రామాయణం వినాలి తింటే గారెలు తినాలన్నారు పెద్దలు. వీనులవిందైన, హృదయానికి హత్తుకునే గాథ, రామాయణ గాథ. భారతీయుల గుండెను తడిమే మహాకావ్యం రామాయణం. పరిపూర్ణ మానవుడు ఎలాఉండాలో చూపిన పురుషోత్తముడు రాముడు. అటుంటి మహాకావ్యంపై తెలుగు రాష్ట్రాల్లో అనవరసర చర్చ కాదుకాదు రచ్చ జరుగుతోంది. భావప్రకటనా స్వేచ్చ అంటూ కత్తి మహేష్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, తమ మనోభావాలను దెబ్బతిన్నాయంటూ హిందూ సంప్రదాయవాదులు కేసులుపెట్టడం, సోషల్ మీడియాలో తిట్ల దండకం అందుకోవడం ఇప్పుడు, తెలుగు స్టేట్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. అసలు కత్తి మహేష్ ఏమన్నాడు? ఎందుకీ రచ్చ?

శ్రీరాముడంటే ఎవరు. తండ్రి మాటను జవదాటని తనయుడు. పితృవాక్య పాలకుడు. సకలగుణ సంపన్నుడు. పరిపూర్ణ మానవుడు ఎలా ఉండాలో ఆచరణలో చూపిన పురుషోత్తముడు. ఆ రామనామాన్ని స్మరించినా ఆయన బాటలో నడిచినా అంతా అలౌకికానందం పరిపూర్ణత వైపు పయనం. రామాయణము భారతీయ వాఙ్మయములో ఆదికావ్యము. దానిని సంస్కృతములో రచించిన వాల్మీకి మహాముని, ఆదికవిగా సుప్రసిధ్ధం. రామాయణం అంటే హిందువులకు మరో భగవద్గీతలాంటింది. కానీ రామాయణం వాస్తవగాథా కాల్పనికమా అన్నదానిపై కొన్ని దశాబ్దాల నుంచే కాదు, శతాబ్దాల నుంచే చర్చ జరుగుతోంది. ఈమధ్య కాలంలో ఈ చర్చ, రచ్చగా మారి, చిచ్చు రేపుతోంది.

ప్రముఖ సినిమా విమర్శకుడు, హేతువాది కత్తి మహేష్‌, రామాయణం పుక్కిటి పురాణం, కాల్పనికం, కట్టుకథ అంటూ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో అగ్గిరాజేశాయి. ఇటు సోషల్ మీడియాలో కత్తిమహేష్‌పై విమర్శలు వెల్లువెత్తుతుండగా, కొన్ని పోలీస్‌ స్టేషన్లలోనూ కేసులు నమోదయ్యాయి. హిందువుల మనోభావాలను కించపరిచేలా మాట్లాడారంటూ, కొందరు మండిపడుతున్నారు. కత్తి మహేష్. కేరాఫ్ కాంట్రావర్సీ. సినీ విమర్శకుడు, ఎథిస్ట్. పవన్‌ కల్యాణ్‌ నుంచి నేటి రామాయణం దాకా, కాక రేపే కామెంట్లతో, తన నోటికి పని చెబుతూనే ఉన్న హేతువాది. తన వ్యాఖ్యానాలతో కొందరి అభిమానాన్నే కాదు, మరెందరో ఆగ్రహాన్ని చవిచూశాడు కత్తి మహేష్.

ఈ మధ్య ఒక ఛానెల్ నిర్వహించిన డిస్కషన్‌లో, రామాయణం, శ్రీరామచంద్రుడి మీద కత్తి చేసిన కామెంట్లు రచ్చవుతున్నాయి. రామాయణం కేవలం ఒక కథ, రాముడు దేవుడే కాదు, రాముని దగ్గర కంటే, సీతాదేవి రావణుడి దగ్గరే సురక్షితంగా ఉండేదని వ్యాఖ్యానాలు చేశాడు. దీంతో కత్తి మహేష్‌పై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. కూకట్‌పల్లితో పాటు పలు పోలీస్‌ స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. ఎన్ని కేసులు పెట్టినా అధైర్యపడే వ్యక్తిని కాదని, రాజ్యాంగం ఇచ్చిన భావప్రకటనా స్వేచ్చతోనే, తన అభిప్రాయాలు పంచుకున్నానని చెప్పాడు కత్తి మహేష్.

అయినా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్‌ అంటూ నోటికొచ్చింది మాట్లాడతావా అని హిందూ సంప్రదాయవాదులు ప్రశ్నిస్తున్నారు. ఆంధ‌్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్వామి పరిపూర్ణానంద. కత్తి మహేష్ ఈమధ్య రాముడు, కృష్ణుడు వంటి హిందూ దేవుళ్లపైనా, హిందూ ధర్మాలపైనా, స్వామిజీలపైనా ఇష్టారాజ్యాంగా మాట్లాడుతున్నాడని మండిపడే వారి సంఖ్య పెరుగుతోంది.

మొత్తానికి రామాయణం, శ్రీరామచంద్రుడి మీద కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. హిందువులకు ఆరాధ్య దేవుడైన శ్రీరాముడిపై వ్యాఖ్యలు మంటలు పుట్టిస్తున్నాయి. అయితే భావప్రకటనా స్వేచ్చ పేరుతో కొందరి మనోభావాలను కించపరిచేలా మాట్లాడటం సరికాదని కత్తి మహేష్‌కు హితవు పలుకుతున్నారు సామాజికవేత్తలు. ఎవరి విశ్వాసాలు, నమ్మకాలు వారివని, ఇలాంటి అనవసర వ్యాఖ్యానాలతో సమాజంలో ఘర్షణ రాజేయడం తప్ప ఎవరూ సాధించేది ఏమీలేదని సూచిస్తున్నారు.

Next Story